సార్సాల పోడు భూమిలో మొక్కలు నాటిన అధికారులు

సార్సాల పోడు భూమిలో మొక్కలు నాటిన అధికారులు

అటవీ అధికారులపై దాడులతో ఆదివారం రాష్ట్రంలో సంచలనానికి కేంద్రబిందువైన సార్సాల పోడు ఏరియాలో సోమవారం పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపించింది. ఎటూ చూసినా పచ్చని మొక్కలు… ఖాకీ చొక్కాలే కనిపించాయి. దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం కావడంతో ఉన్నత స్థాయి అధికారులు రంగంలోకి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఎఫ్ఫార్వో అనిత, ఫారెస్ట్‌‌ సిబ్బందిపై దాడి చేసిన ఎమ్మెల్యే సోదరుడు, జడ్పీవైస్ చైర్మన్​ కోనేరు కృష్ణారావు సహా 14 మందిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నరు. తొమ్మిది జిల్లాల నుంచి వచ్చిన అటవీ శాఖ సిబ్బంది, పోలీసు శాఖ అధికారులు, సిబ్బంది పెద్దసంఖ్యలో కొత్త సార్సాలలోని ఘటనాస్థలానికి చేరుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. నార్త్‌‌ జోన్‌‌ ఐజీ నాగిరెడ్డి కాగజ్‌‌నగర్‌‌ నుంచి పరిస్థితిని పర్యవేక్షించారు.

అటవీ భూమి ఖాకీమయం…

కాగజ్‌‌నగర్ అటవీ డివిజన్‌‌లోని కడంబా బ్లాక్‌‌లో టైగర్ రిజర్వు ఫారెస్ట్ రాచ్‌‌పల్లి బీట్‌‌లో గల 133, 136 బ్లాక్‌‌లతో 20 హెక్టార్ల భూమి కాళేశ్వరం ప్రాజెక్టు భూమి కింద ప్రత్యామ్నాయంగా అటవీ అభివృద్ధికి ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ఈ 20 హెక్టార్ల భూమిలో మొక్కలు నాటేందుకు పోలీసు, అటవీశాఖ అధికారులు, సిబ్బంది వందల సంఖ్యలో రావడంతో ఆ ప్రాంతం ఖాకీమయమైంది. కూలీలు, కొందరు అధికారులు మినహా మిగిలిన వారంతా ఖాకీ డ్రెస్‌‌లో ఇందులో పాల్గొన్నారు

22,222 మొక్కలు…

సార్సాల ఏరియాలో అడవీ అభివృద్ధికి అధికారులు 20 హెక్టార్లు ఎంపిక చేశారు.  ఈ భూమిలో 22,222 మొక్కలు నాటేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అటవీ శాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో తొమ్మిది జిల్లాలోని అటవీ శాఖ డీఎఫ్వోలు, ఎఫ్డీవోలు, పారెస్ట్ చీఫ్ ఆఫీసర్లు తరలివచ్చారు. తమ తోటి ఉద్యోగిపై జరిగిన పాశవిక దాడిని ఖండిస్తూ విధి నిర్వహణలో ఐక్యతను చాటేందుకు తొమ్మిది జిల్లాల నుంచి తరలిరావడంతో సారసాల అటవీభూమి ఖాకీమయం అయింది. అటవీ శాఖ వరంగల్​ రీజియన్​ సీసీఎఫ్​ ఎంజే అక్బర్​ మాట్లాడుతూ భావితరాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ప్రతిష్ఠాత్మక హరితహారం కార్యక్రమాన్ని అటవీ శాఖ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది చేస్తున్న ప్రయత్నాలు పూర్తిగా ప్రభుత్వ ఆదేశాలతోనే చేస్తున్నామని దాడులు సరికాదని, విధులకు అడ్డు రావద్దని ఆదిలాబాద్​ కన్జర్టేటర్ వినోద్​కుమార్ మాట్లాడుతూ తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమంలో పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, జనగాం, ములుగు, సిరిసిల్లా, మహదేవపూర్, భూపాలపల్లి, ఏటూరినాగారానికి చెందిన అటవీ శాఖ ఉన్నతాధికారులు రామలింగం, ప్రదీప్​శెట్టి, నర్సింహరావు, రవిప్రసాద్​, సారయ్య, ఖాదర్​మొహినోద్దీన్​, లక్ష్మణ్​రంజిత్​నాయక్​, రాజరమణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు..

ఎవరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నా సహించబోమని ఆసిఫాబాద్‌‌ జిల్లా ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. ఆదివారం అటవీశాఖ అధికారి అనితపై జరిగిన దాడిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో జులై 30వ తేదీ వరకు 30 పోలీసు యాక్టు అమలులో ఉంటుందని, అనుమతులు లేకుండా సభలు, ర్యాలీలు, ధర్నాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎంతటి వారైనా శిక్షలు తప్పవని ప్రతి ఒక్కరు సమన్వయంతో మెలగాలని ఆయన సూచించారు.