ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హత్య

ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హత్య
  •  వేట కొడవలితో గొత్తికోయల దాడి
  • ఖమ్మం ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ పొందుతూ అధికారి మృతి

చండ్రుగొండ, వెలుగు: ప్లాంటేషన్​లో పశువులను మేపొద్దన్నడని గొత్తికోయలు ఫారెస్ట్ రేంజ్​ ఆఫీసర్​పై వేట కొడవలితో దాడి చేశారు.  తీవ్రంగా గాయపడిన ఆయన  ఖమ్మం హస్పిటల్​లో చికిత్స పొందుతూ చనిపోయారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండాలపాడు శివారులోని ఎర్రబోడులో మంగళవారం ఈ ఘటన జరిగింది. ఎఫ్ఆర్వో చలమల శ్రీనివాసరావు(45), ఫారెస్ట్​సెక్షన్ ఆఫీసర్ రామారావు ఉదయం ప్లాంటేషన్లు విజిట్ చేసేందుకు బైక్​పై వెళ్లారు. ఒక ప్లాంటేషన్​లో మొక్కల పెంపకంపై 30 మంది కూలీలకు డెమో ఇచ్చి చండ్రుగొండకు బయలుదేరారు. ఇదే సమయంలో శ్రీనివాసరావుకు ఎర్రబోడు ప్లాంటేషన్ వాచర్​ ఫోన్​ చేసి..  గొత్తికోయలు ప్లాంటేషన్​లోని మొక్కలను పశువులకు మేపుతున్నారని, వద్దని చెప్తే కొట్టడానికి వస్తున్నారని కంప్లైంట్ చేశాడు. దాంతో ఆయన ఎర్రబోడు ప్లాంటేషన్ వద్దకు చేరుకున్నారు. చత్తీస్​గఢ్ నుంచి చాలా కాలం కింద వలస వచ్చిన గొత్తికోయలకు చెందిన పశువులు మొక్కలను మేస్తుండడంతో వాటిని బయటకు తోలాలని శ్రీనివాసరావు చెప్పారు. దీంతో వారు అతనితో వాగ్వాదానికి దిగారు. సర్వే చేయకుండానే ప్లాంటేషన్లు ఏర్పాటు చేస్తున్నారని, మీవల్లనే మాకు అన్యాయం జరుగుతోందంటూ వాదించారు. గతంలో పోడు భూములకు సంబంధించి రేంజర్​కు, గొత్తికోయలకు గొడవ జరిగినట్టు చెప్తున్నారు. అనంతరం సెక్షన్ ఆఫీసర్, వాచర్ పశువులను బయటకు కొడుతుండగా రేంజర్ వీడియో తీస్తూ నిలబడ్డారు. వెంటనే  శ్రీనివాసరావు వెనక నుంచి వచ్చిన గొత్తికోయలు మెడ మీద వేటకొడవలి లాంటి కత్తితో దాడి చేశారు. ఆయన  కేకలు వేస్తూ కింద పడ్డా వదలకుండా దాడి చేశారు. సెక్షన్ ఆఫీసర్ పరిగెత్తుకువచ్చి గొత్తికోయలను ఆపేందుకు ప్రయత్నించారు. దాడి చేయవద్దని కాళ్ళు పట్టుకొని బతిమాలాడు. అప్పటికే స్పృహ కోల్పోయిన రేంజర్​ను కారులో చండ్రుగొండ పీహెచ్​సీకి తరలించారు. బీపీ డౌనై, పల్స్ పడిపోయినట్టు గుర్తించిన డాక్టర్లు మెరుగైన చికిత్స కోసం  ఖమ్మం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేంజర్​ చనిపోయారు.  శ్రీనివాసరావుకు భార్య భాగ్యలక్ష్మి, కొడుకు, కూతురు ఉన్నారు. దాడి విషయం తెలియగానే వారు ఖమ్మంలోని కిమ్స్ ఆస్పత్రికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. 

అధికార లాంఛనాలతో నేడు అంత్యక్రియలు

రేంజర్ శ్రీనివాసరావు సొంతూరు ఈర్లపూడిలో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో బుధవారం జరగనున్నాయి. కాగా, దాడి చేసిన ఇద్దరు గొత్తికోయలు తండ్రీకొడుకులని తెలిసింది. రాత్రి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఎస్పీ డాక్టర్ వినీత్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. 

14 ఏండ్ల సర్వీస్​

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం ఈర్లపూడికి చెందిన శ్రీనివాసరావు 14 ఏండ్ల కింద డిపార్ట్​మెంటులో చేరారు. సెక్షన్​ ఆఫీసర్​గా చేరిన ఆయన ప్రమోషన్​పై రేంజ్​ఆఫీసర్​ అయ్యారు. మొదట మహబూబాబాద్ జిల్లా లింగాల రేంజర్​గా పని చేసిన ఆయన 4 ఏండ్ల కింద చండ్రగొండ రేంజ్​​కు బదిలీ అయ్యారు. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా ఆయనకు కలెక్టర్ అనుదీప్ ఉత్తమ రేంజర్ అవార్డు అందించారు. హైదరాబాద్ లో చీఫ్​ కన్జర్వేటర్​ ఆఫ్​ ఫారెస్ట్​ నుంచి గోల్డ్ మెడల్ అందుకున్నారు. చండ్రుగొండ రేంజ్​లో హరితహారంను సక్సెస్​ అవడానికి చేసిన కృషికి గాను ఆయన  ఆఫీసర్ల మన్ననలు పొందారు. ఆక్రమణలకు గురైన ఫారెస్ట్ భూములను గుర్తించి తిరిగి స్వాధీనం చేసుకొని ప్లాంటేషన్ వేశారు. ఈ క్రమంలో ఆయనకు  పోడుదారులతో తరచూ ఘర్షణలు జరుగుతుండేవి. గతంలో గొత్తి కోయలను ఫారెస్ట్ ఆఫీసర్లు కొట్టగా.. మద్దుకూరులోని మంగళిబోడు గొత్తికోయలు ఫారెస్ట్ ఆఫీసర్లపై దాడి చేశారు. ఈ ఘటనలతో ఫారెస్ట్ ఆఫీసర్ల మీద గొత్తికోయలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ దాడికి కూడా ఆ ఆగ్రహం  కారనమన్న వాదన వినిపిస్తోంది. ఆయన భార్య భాగ్యలక్ష్మి గృహిణి కాగా, కొడుకు యశ్వంత్  9వ తరగతి, కూతురు  కృతిక 6వ తరగతి చదువుతున్నారు.

ఆఫీసర్లపై దాడులు సహించం
ఎఫ్ఆర్​వో కుటుంబానికి రూ.50 లక్షలు : సీఎం కేసీఆర్

హైదరాబాద్, వెలుగు: విధి నిర్వహణలో ఉన్న ఆఫీసర్లపై దాడులను సహించబో మని సీఎం కేసీఆర్  స్పష్టం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎటువంటి జంకు లేకుండా విధులు నిర్వర్తించాలని సీఎం సూచించారు. శ్రీనివాసరావు మృతిపై సీఎం విచారం వ్యక్తం చేశారు. దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. ఎఫ్ఆర్​వో కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్​గ్రేషియాతోపాటు వారి ఫ్యామిలీలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం ప్రకటించారు. శ్రీనివాసరావు రిటైర్​మెంట్​వయసు వరకు నెలనెలా పూర్తి జీతం ఆయన కుటుంబీకులకు అందించాలని ఆదేశించారు. ఎఫ్ఆర్​వో అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సీఎస్​కు సూచించారు. అట‌‌‌‌‌‌‌‌వీ భూముల ఆక్రమ‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌ను స‌‌‌‌‌‌‌‌హించేది లేద‌‌‌‌‌‌‌‌ని, ఆక్రమ‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌దారుల‌‌‌‌‌‌‌‌పై చ‌‌‌‌‌‌‌‌ట్టప‌‌‌‌‌‌‌‌రమైన చ‌‌‌‌‌‌‌‌ర్యలు తీసుకుంటామ‌‌‌‌‌‌‌‌ని మంత్రి ఇంద్రక‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణ్ రెడ్డి స్పష్టం చేశారు.

రేంజర్​ను చంపినోళ్లపై చర్యలు తీసుకోవాలె

ఎఫ్ఆర్వో శ్రీనివాస్ రావు హత్యను ఉద్యోగ సంఘాలు ఖండించాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీజీవో  వ్యవస్థాపక అధ్యక్షుడు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. డ్యూటీలో ఉన్న అధికారులపై దాడులు బాధాకరమని టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, సత్యనారాయణ తెలిపారు. రేంజర్ హత్యను ఖండిస్తున్నామని టీఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్ తెలిపారు. గద్వాల ఎమ్మెల్యే డ్యూటీలో ఉన్న అధికారి గల్లా పట్టుకోవడం సరికాదన్నారు. ఎఫ్ఆర్వో శ్రీనివాస్ రావు హత్యను తెలంగాణ ఉద్యోగుల సంగం ఖండిస్తున్నదని అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు రవీంద్ర కుమార్, హరీశ్ కుమార్ రెడ్డి, అడ్వైజర్ పద్మాచారి తెలిపారు.