మంత్రి ఎర్రబెల్లి సంతకం ఫోర్జరీ.. ఇద్దరిపై కేసు

మంత్రి ఎర్రబెల్లి సంతకం ఫోర్జరీ.. ఇద్దరిపై కేసు

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు కేటాయించాలంటూ మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి, మంత్రి లెటర్‌ హెడ్‌తో బోగస్‌ సిఫార్స్‌ లేఖ తయారు చేసి సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన ఇద్దరిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్‌ కేసు నమోదైంది.

పోలీసుల కథనం ప్రకారం.. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు కేటాయించాలంటూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పేరుతో కొన్ని సిఫార్సు లేఖలు వచ్చాయి. గతంలో ఎన్నడూ ఇలాంటి సిఫార్సు లేఖలు తమకు రాలేదని, అధికారులు దీన్ని మంత్రి ఎర్రబెల్లి కార్యాయలం దృష్టికి తీసుకువెళ్లారు. సిఫార్సు లేఖలపై ఆరా తీయగా.. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం నర్రెగూడెం గ్రామానికి చెందిన ఎండీ. గౌస్‌ పాషా, గుంటి శేఖర్‌ వీటిని తయారు చేసినట్లు బయటపడింది. 

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేరుతో నకిలీ లెటర్‌ హెడ్‌ను తయారు చేయడంతో పాటు.. ఏకంగా మంత్రి సంతకాన్ని ఫోర్జరీ చేసి సంగారెడ్డి కలెక్టర్‌కు సిఫార్సు లేఖలను పంపించినట్లు తేలింది. ఈ మేరకు మంత్రి ఓఎస్‌డీ డా. రాజేశ్వర్‌రావు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితులైన గౌస్‌పాషా, గుంటి శేఖర్‌పై ఐపీసీ 419, 420, 464, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.