దక్షిణ తెలంగాణకు కేసీఆర్​ చేసిన తొమ్మిది ద్రోహాలు

దక్షిణ తెలంగాణకు కేసీఆర్​ చేసిన తొమ్మిది ద్రోహాలు

ఆంధ్ర పాలకుల నీటి దోపిడీకి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు దారితీసింది. నీరు పల్లమెరుగు అనే మాటలతో మభ్యపెట్టి వందల టీఎంసీల కృష్ణానది జలాలను ఆంధ్రోళ్లు అడ్డగోలుగా తరలించుకుపోయారు.  2015లో నాటి ప్రభుత్వ పెద్ద కేసీఆర్.. కేంద్ర జలవనరుల ట్రిబ్యునల్ సమావేశానికి హాజరై తెలంగాణకు అన్యాయం చేసే విధంగా.. ఆంధ్రకు మేలు జరిగే విధంగా సంతకాలు చేశాడు. తెలంగాణలో  కృష్ణా నది పరీవాహక ప్రాంతం 68.5 శాతం ఉంటే..299 టీఎంసీలు అంటే  37 శాతానికే సంతకం పెట్టారు.  ఇది దక్షిణ తెలంగాణకు కేసీఆర్ చేసిన మొదటి ద్రోహం. 
    
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2003 జీవో ద్వారా 5.5.2020 నాడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సంగమేశ్వరం దగ్గర నిర్మించేందుకు విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ స్కీం ద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని కృష్ణా నది నుంచి రాయలసీమకు మళ్లించే, అక్రమ నిర్మాణాల పనులను  ఏనాడు అడ్డుకోలేదు. ఇది దక్షిణ తెలంగాణకు కేసీఆర్ చేసిన రెండో ద్రోహం.  
    
800 అడుగుల నుంచి నీటిని.. రాయలసీమ, ఆంధ్రా అవసరాలకు పంపు చేసేవిధంగా ఈ పథకాన్ని రూపొందించారు. దీనివల్ల శ్రీశైలం రిజర్వాయర్​పై ఆధారపడిన పాలమూరు రంగారెడ్డి, ఎస్ ఎల్ బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని తెలిసినా.. ఇంజినీర్లు, లాయర్లు, ప్రజా సంఘాలు నిరసన గళం విప్పినా కేసీఆర్​కు చీమ కుట్టినట్టైనా కాకపోవడం  కేసీఆర్ దక్షిణ తెలంగాణకు చేసిన మూడో ద్రోహం. 
    
దక్షిణ తెలంగాణ నీటి అవసరాలను గుర్తించిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 5.8.2013 నాడు జీవో 72ను తీసుకొచ్చింది.  జూరాల నుంచి లక్ష క్యూసెక్కుల వరద జలాలను 25 రోజుల్లో 79 టీఎంసీల నీటిని మూడు జలాశయాల్లోకి ఎత్తిపోసి మహాబూబ్​నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు, పరిశ్రమలు , జంటనగరాలకు తాగునీరు అందించడం ఈ జీవో ముఖ్య ఉద్దేశం. రీ డిజైన్ పేరుతో 10.06.2015 నాడు  జీవో 105ను తీసుకొచ్చారు. నీటిని జూరాల నుంచి కాకుండా శ్రీశైలం నుంచి తీసుకునేటట్టుగా ప్రాజెక్టు రూపకల్పన చేశారు.  కరివెన జలాశయం దగ్గర 11. 06.2015 నాడు ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు.  మూడేళ్ళలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి కృష్ణా జలాలతో పాలమూరు రైతుల బీడు భూములకు నీళ్లిచ్చి రైతుల పాదాలు కడుగుతానని మాట్లాడి,  పూర్తి చెయ్యకపోవడం దక్షిణ తెలంగాణకు కేసీఆర్ చేసిన నాలుగో ద్రోహం. 
    
2004-–05న రూ.2,990 కోట్లతో 19 మండలాలు,303  గ్రామాలు, అచ్చంపేట నియోజకవర్గంలోని చివరి గ్రామం చారకొండ వరకు 3, 40, 000 ఎకరాలకు నీళ్లిచ్చే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు.. తెలంగాణ వచ్చిన నాటికి 87 శాతం పూర్తి అయ్యాయి. కేసీఆర్ ప్రభుత్వం దీన్ని పూర్తిగా విస్మరించి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కల్వకుర్తి నియోజకవర్గం రైతన్నలకు మేలు చెయ్యకుండా, పదేండ్లలో ప్రాజెక్టు పూర్తి చెయ్యకపోవడం దక్షిణ తెలంగాణకు కేసీఆర్ చేసిన ఐదో ద్రోహం. 
    
బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, సరళ సాగర్ పూర్తి చెయ్యకపోవడం దక్షిణ తెలంగాణకు కేసీఆర్ చేసిన ఆరో ద్రోహం. 
    

ముప్ఫై రోజుల్లో శ్రీశైలం మొత్తం నీటిని ఆంధ్రా సర్కార్ తరలించగా.. కేసీఆర్ ప్రభుత్వం 90 రోజుల్లో లిఫ్ట్ చేస్తామనడం, పంపుల విడ్త్ పెంచకపోవడం కేసీఆర్ చేసిన ఏడో ద్రోహం. 
    
ఇది చాలదన్నట్టు స్మిత సబర్వాల్ ఇరిగేషన్ కార్యదర్శిగా కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగిస్తామని లేఖ రాయడం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అతిపెద్ద ఎనిమిదో  ద్రోహం. 
    
కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ లో భాగంగా ప్రజాహితం ప్రతిపక్షాలు వేసిన కేసులపై కోట్ల రూపాయలు ఖర్చు చేసి, సుప్రీంకోర్టు నుంచి అడ్వకేట్లను తెచ్చి కొట్లాడిన కేసీఆర్..మన నీటిని ఆంధ్రా పాలకులు దోచుకుపోతుంటే అదే మాదిరి ఎందుకు అడ్డుకోలేదు?  ఇది దక్షిణ తెలంగాణకు కేసీఆర్​ చేసిన తొమ్మిదో  ద్రోహం.  

Also read : మూసీ.. థేమ్స్​ నది అయ్యేనా?

కొత్త సీఎం న్యాయం చేయాలి

ఉద్యమ సమయంలో ఏ పాలమూరైతే నిన్ను ఆదుకుందో.. ఆ పాలమూరుకు జరుగుతున్న నష్టం గురించి అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేతగా హాజరుకాకుండా బాధ్యతారాహిత్యంగా చిల్లర రాజకీయాలు చేస్తూ దొంగే దొంగ అన్నట్టుగా మాట్లాడటం సిగ్గుచేటు. 

ఎస్ఎల్బీసీ పూర్తి చెయ్యకుండా  కృష్ణా జలాల్లో వాటా కావాలంటూ నల్గొండ సభలో పాల్గొనడం.. కేసీఆర్​కు దక్షిణ తెలంగాణ పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుంది. ప్రాజెక్టుల పేరుతో చేసిన మోసగాళ్లను శిక్షించి,  పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ‘ రైతు ప్రయోజనాలతో పని లేకుండా పెట్టుబడిదారుల ప్రయోజనం’ తో దగాపడిన దక్షిణ తెలంగాణకు న్యాయం చేయాలని పాలమూరు బిడ్డ సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. పాలమూరు రంగారెడ్డి రిజర్వాయర్లన్ని టిని కల్వకుర్తి లిఫ్టులో భాగం చేసి కల్వకుర్తి, అచ్చంపేట,  ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసి రైతన్నల ఆత్మగౌరవం కాపాడాలని  పాలమూరు ఆడబిడ్డగా కోరుతున్నా..

- ఇందిరాశోభన్, రాష్ట్ర కాంగ్రెస్​ నాయకురాలు