తెలంగాణ ప్రాంతీయ కమిటీ

తెలంగాణ ప్రాంతీయ కమిటీ

ఏడో రాజ్యాంగ సవరణ చట్టం - 1956 ప్రకారం ఆంధ్రప్రదేశ్​, పంజాబ్​ రాష్ట్రాల శాసనసభలకు ప్రాంతీయ సంఘాలు ఏర్పరిచే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. సాధారణంగా శాసనసభల సంఘాల కార్యకలాపాలు రాష్ట్రమంతటికి సంబంధించి ఉంటాయి. కానీ పంజాబ్​, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రాల్లో రూపొందించిన ప్రాంతీయ సంఘాలు రాష్ట్రంలోని ఒకే ప్రాంతానికి పరిమితం. రాష్ట్రాల పునర్విభజనతో మన దేశంలో ప్రాంతాలు సంఘాల ఏర్పాటు మొదలైంది. ఇవి ప్రాంతీయ అసమానతలను నిర్మూలించడానికి దోహదం చేశాయి. 

1956, ఫిబ్రవరి 20న జరిగిన పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ప్రాంతీయ సంఘం ఏర్పాటు, రక్షణల అమలుతో ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం అవతరించింది. పెద్ద మనుషుల ఒప్పందంలో తెలంగాణ ప్రాంతీయ మండలిగా పేర్కొన్న సంస్థ ఆంధ్రప్రదేశ్​ ఏర్పాటు చట్టంలో తెలంగాణ ప్రాంతీయ కమిటీగా మారింది. తెలంగాణ రక్షణల, ప్రాంతీయ సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం లోక్​సభకు ఒక నోట్​ను సమర్పించింది. రాజ్యాంగంలోని ఏడో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన 371(1) అనే అధికరణం ప్రాంతీయ సంఘాల ఏర్పాటు గురించి తెలుపుతుంది. ఈ అధికరణం ప్రాంతీయ సంఘాలు ఎంత కాలం ఉంటాయో నిర్దేశించలేదు. కాబట్టి రాష్ట్రపతి రద్దు చేసేవరకు ప్రాంతీయ సంఘాలు అమలులో ఉంటాయి. 1958, ఫిబ్రవరిలో రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతీయ సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రాంతీయ కమిటీకి తమ ప్రాంతాలకు సంబంధించిన బడ్జెట్​ అంచనాలను చర్చించే అధికారం లేదు. శాసనాల బిల్లులను చర్చించి ఆమోదించే అధికారం ఉంది. పంజాబ్​ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ప్రాంతీయ సంఘానికి ప్రశ్నోత్తరాల సమయం ఏర్పాటు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్​లోని తెలంగాణ ప్రాంతీయ కమిటీకి ప్రశ్నోత్తరాల సమయానికి అవకాశం కల్పించలేదు. 

చైర్మన్, డిప్యూటీ చైర్మన్​ ఎన్నిక

తెలంగాణ ప్రాంతీయ కమిటీకి చైర్మన్​, డిప్యూటీ చైర్మన్​ ఉంటారు. రాష్ట్ర గవర్నర్​ ప్రాంతీయ కమిటీ చైర్మన్​ ఎన్నిక తేదీని ప్రకటిస్తారు. తెలంగాణ శాసనసభ సభ్యులందరూ కలిసి చైర్మన్​, డిప్యూటీ చైర్మన్​ను ఎన్నుకుంటారు. ఓటింగ్​ పద్ధతిని పంజాబ్​ ప్రాంతీయ సంఘ ఎన్నికల్లో అనుసరించిన విధంగా బహిరంగ ఓటింగ్​ పద్ధతిని అనుసరిస్తారు. 

మొదటి చైర్మన్​ ఎన్నిక

1958, మార్చి 31న తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి సమావేశం ఆంధ్రప్రదేశ్ సహకార శాఖ మంత్రి మోహిదీ నవాజ్ జంగ్​ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ప్రాంతీయ కమిటీ చైర్మన్​ పదవికి ఎన్నిక నిర్వహించారు. ఆనాడు తెలంగాణ శాసన సభ్యుల సంఖ్య 105. ఇందులో 90 మంది ప్రాంతీయ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. 15 మంది గైర్హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ తరఫున చైర్మన్​ పదవికి అచ్యుతారెడ్డి పోటీ చేశారు. ఈయన అభ్యర్థిత్వాన్ని ఎన్​.రామచంద్రారెడ్డి ప్రతిపాదించగా కేవీ రంగారెడ్డి, కొండా లక్ష్మణ్​ బాపూజీలు బలపర్చారు. కమ్యూనిస్టు అభ్యర్థిగా రావి నారాయణరెడ్డి పేరును కృష్ణామాచారి ప్రతిపాదించగా, కేఎల్​ నర్సింహారెడ్డి  బలపర్చారు. ఈ ఎన్నికల్లో  కే అచ్యుతా​రెడ్డి 63 ఓట్లు సాధించగా, రావి నారాయణరెడ్డికి 22 ఓట్లు వచ్చాయి. సోషలిస్టు పార్టీకి చెందిన 5 సభ్యులు తటస్థంగా వ్యవహరించారు. కే అచ్యుతారెడ్డి తెలంగాణ ప్రాంతీయ కమిటీ మొదటి చైర్మన్​గా ఎన్నికయ్యారు. 

డిప్యూటీ చైర్మన్ ఎన్నిక

1958, మే 16న తెలంగాణ ప్రాంతీయ కమిటీ చైర్మన్​ కే అచ్యుతారెడ్డి అధ్యక్షతన డిప్యూటీ చైర్మన్​ ఎన్నిక కోసం సమావేశం నిర్వహించారు. మసుమా బేగంను డిప్యూటీ చైర్మన్​గా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలోనే తెలంగాణ ప్రాంతీయ కమిటీ, ఉప కమిటీల కార్యక్రమాల విధానం, నియమ నిబంధనలు రూపొందించేందుకు ఎనిమిది మంది సభ్యులతో ఒక అడ్​హక్​ కమిటీ ఏర్పాటు చేశారు.
 
అడహక్​ కమిటీ సభ్యులు

 అచ్యుతారెడ్డి, కేవీ రంగారెడ్డి, వి.బి.రాజు, జేవీ నరసింగరావు, పీవీ రాజేశ్వరరావు, రావి నారాయణరెడ్డి, వి.నరసింగరావు, కృష్ణామాచార్యులు. 
ఈ సమావేశంలో హనుమంతరావు రెండు తీర్మానాలను ప్రతిపాదించారు. అవి రెండు సబ్​ కమిటీల నియామకాలకు సంబంధించినవి. 1. తెలంగాణ ప్రాంతంలో ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలను నెలకొల్పే అంశాన్ని పరిశీలించడం. 2. ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని అంశాలను పరిశీలించడం. మొదటి సబ్​ కమిటీకి కె.అచ్యుతారెడ్డి అధ్యక్షుడిగా నియమించారు. సభ్యులు.. పి.వి. నర్సింహారావు, కే జనార్దన్ రెడ్డి, మీర్​ అహ్మద్​ ఖాన్​, షుకూర్​ బేగ్​, గోక రామలింగం, బి.వి.గురుమూర్తి, టి.లక్ష్మీకాంతమ్మ, సి.హెచ్​.రాజేశ్వరరావు, డి. నర్సయ్య, గోపిడి రంగారెడ్డి, జగన్మోహన్​ రెడ్డి. 
రెండో సబ్​ కమిటీకి ఎం.చెన్నారెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు. సభ్యులు.. కొండా లక్ష్మణ్​ బాపూజీ, గోపాల్​ ఎక్బోటే, నూకల రామచంద్రారెడ్డి, దావర్ హుస్సేన్​, మాసుమ బేగం, వాసుదేవ నాయక్​, పి.నరసింగరావు, కేఎల్​ నరసింగరావు, మహేంద్రనాథ్​, ఎస్​కేవీ ప్రసాద్, సత్యారెడ్డి.    

తొలగింపు అంశాలు

అసెంబ్లీ సభ్యత్వం కోల్పోతే ప్రాంతీయ సంఘం చైర్మన్ పదవి కూడా పోతుంది. ప్రాంతీయ కమిటీ సభ్యుల తీర్మానం ద్వారా చైర్మన్​ను అధికారం నుంచి తొలగించవచ్చు. 

సమావేశాలు

తెలంగాణ ప్రాంతీయ కమిటీ చైర్మన్ సంఘం సమావేశాలను ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా ఆ సమావేశాలకు చైర్మ​నే అధ్యక్షత వహిస్తాడు. ప్రాంతీయ కమిటీ 1/3వ వంతు మంది సభ్యులు హాజరైనట్లయితే సమావేశాలు జరపవచ్చు. ఒకవేళ కోరం లేకుంటే సమావేశాన్ని చైర్మన్ వాయిదా వేస్తాడు. కోరం లేకుండా వాయిదా పడిన సందర్భాలు తెలంగాణ ప్రాంతీయ కమిటీ విషయంలో చాలా అరుదుగా జరిగాయి. 

ప్రాంతీయ కమిటీ పనితీరు 

తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఉత్తర్వు షెడ్యూల్లో పేర్కొన్న అధికారాల మేరకు తెలంగాణ వర్తించే ఏ శాసనపరమైన(ద్రవ్య సంబంధమైన శాసనం కానట్లయితే) దానిని ప్రాంతీయ బిల్లు అని పేర్కొంటారు. ప్రాంతీయ బిల్లులన్నింటిని శాసనసభలో ప్రవేశపెట్టే ముందు తప్పనిసరిగా తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఏదైనా బిల్లు విషయంలో ఆ ప్రాంతీయ బిల్లు అవునా? కాదా? అనే సంశయం వచ్చినప్పుడు గవర్నర్​ది తుది తీర్పు అవుతుంది. హైదరాబాద్​ రాష్ట్రపు శాసనం ఏదైనా ఆంధ్ర ప్రాంతానికి వర్తించేలా బిల్లు ను ప్రాంతీయ కమిటీకి నివేదించాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రాంతంలో అమలులో ఉన్న శాసనాన్ని రద్దు చేసే ద్రవ్య సంబంధమైన బిల్లును కూడా ప్రాంతీయ సంఘానికి సమర్పించాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రాంతీయ కమిటీకి నివేదించిన బిల్లులను ప్రాంతీయ కమిటీనే చర్చించి ఆమోదించే అధికారాలను కలిగి ఉంది. కొన్ని సందర్భా ల్లో ప్రాంతీయ కమిటీ తనకు నివేదించిన బిల్లులను ఉప సంఘాలకు పంపి, విస్తృతమైన చర్చలకు అవకాశం ఇవ్వొచ్చు.

రఘు దేపాక
తెలంగాణ ఉద్యమ చరిత్ర, రాష్ట్ర ఆవిర్భావం పుస్తక రచయిత