
- చంద్రబాబుతో ప్రయోజనం లేదని.. మోడీ, అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు
- ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని
విజయవాడ: కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జూనియర్ ఎన్టీఆర్ సమావేశంపై.. ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ మద్దతు కోసం అమిత్ షా ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తోందని పేర్కొన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా.. జూనియర్ ఎన్టీఆర్ - అమిత్ షా భేటీపై ఆయన ఈమేరకు కామెంట్స్ చేశారు. ఎలాంటి ఉపయోగం లేకపోతే.. అమిత్ షా ఒక్క నిమిషం కూడా ఎవరితోనూ మాట్లాడరని పేర్కొన్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ విస్తరణకు, బలోపేతానికి పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ను ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో దేశవ్యాప్తంగా బీజేపీ తరఫున ప్రచారం చేయించే అవకాశం ఉందన్నారు. చంద్రబాబుతో ఎలాంటి ప్రయోజనం లేదని భావించి.. మోడీ, అమిత్ షా ఆయనకు ఎలాంటి అపాయింట్ మెంట్ ఇవ్వట్లేదని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. కాగా, జూనియర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం రాత్రి శంషాబాద్ నోవాటెల్ హోటల్ లో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో ఎలాంటి అంశాలపై చర్చించారనేది తెలియరాలేదు. ఏపీకి చెందిన రాజకీయ అంశాలపై చర్చించారని పలువురు అంటున్నారు.