హార్డ్ డిస్క్​లు ముక్కలు చేసి..మూసీలో వేసి..రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

హార్డ్ డిస్క్​లు ముక్కలు చేసి..మూసీలో వేసి..రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు
  • ప్రణీత్ రావుతో కలిసి ఆధారాలు ధ్వంసం చేసిన భుజంగరావు, తిరుపతన్న
  • మూసీ నుంచి 9 హార్డ్ డిస్క్ లు స్వాధీనం.. ఎస్ఐబీ ఆఫీసులో ఆధారాల సేకరణ
  • భుజంగరావు, తిరుపతన్నకు ఈ నెల 6 వరకు జ్యుడీషియల్ రిమాండ్ 
  • రిటైర్డ్ ఏఎస్పీ వేణుగోపాల్ రావుకు పోలీసుల నోటీసులు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫోన్​ ట్యాపింగ్ ​వ్యవహారంలో ఆధారాలు ధ్వంసం చేసినట్టు పోలీసుల అదుపులో ఉన్న మాజీ ఏఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న ఒప్పుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్స్ చీఫ్ ప్రణీత్​రావుతో కలిసి హార్డ్ డిస్క్​లను మూసీ నదిలో పడేసినట్టు అంగీకరించారు. ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ల ట్యాపింగ్, ఎన్నికల టైమ్​లో డబ్బు పంపిణీపై నిఘా నిజమేనని చెప్పారు. 

ఈ మేరకు భుజంగ రావు, తిరుపతన్న రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ‘‘గత బీఆర్ఎస్ ​ పాలనలో జరిగిన ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌, టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ ఆపరేషన్స్‌‌‌‌ బయటపడకుండా ఉండేందుకే లాగర్ రూమ్‌‌‌‌ ఆధారాలను ధ్వంసం చేశారు. కంప్యూటర్లు, హార్డ్‌‌‌‌డిస్క్‌‌‌‌లను కట్టర్లతో కట్‌‌‌‌ చేశారు. ఆ హార్డ్ డిస్క్ లను నాగోల్‌‌‌‌ వద్ద మూసీలో పడేశారు. ప్రణీత్​ రావు తొలుత అంగీకరించిన ఈ విషయాలను తర్వాత భుజంగ రావు, తిరుపతన్న ధ్రువీకరించారు” అని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. భుజంగరావు, తిరుపతన్న అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. కుట్రపూరితంగా ప్రైవేట్ వ్యక్తుల సమాచారం సేకరించారని  తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు సాక్ష్యాలను మాయం చేయడంలో కీలకంగా వ్యహరించారని చెప్పారు. 

‘‘ఈ టీమ్ ధ్వంసం చేసిన ఆధారాలన్నీ సేకరించాం. నాగోల్​వద్ద మూసీలో పడేసిన 9 హార్డ్​డిస్క్​లు స్వాధీనం చేసుకున్నాం. లాగర్ రూమ్​లో హార్డ్​డిస్క్​లను కట్​చేసినప్పుడు పడిన పౌడర్ శాంపిళ్లను, ఎస్​ఐబీ ఆఫీసు ఆవరణలో తగులబెట్టిన రికార్డుల ఆనవాళ్లను సేకరించాం” అని పోలీసులు వెల్లడించారు. 

కస్టడీలో గుట్టువిప్పిన ప్రణీత్‌‌‌‌రావు.. 

స్పెషల్ ఆపరేషన్స్‌‌‌‌ టార్గెట్స్‌‌‌‌ చీఫ్‌‌‌‌ ప్రణీత్‌‌‌‌రావును గత నెల 13న పోలీసులు అరెస్ట్ చేశారు. అదే నెల 17 నుంచి 24 వరకు కస్టడీకి తీసుకుని విచారించారు. మొదట్లో ప్రణీత్‌‌‌‌రావు పోలీసుల విచారణకు సహకరించలేదు. ఆ తర్వాత 21న ఎస్‌‌‌‌ఐబీ లాగర్‌‌‌‌ రూమ్ లో ఆధారాల‌‌‌‌ ధ్వంసం గురించి వెల్లడించాడు. హార్డ్‌‌‌‌డిస్క్‌‌‌‌లను నాగోల్‌‌‌‌ దగ్గర మూసీ నదిలో పడేసినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు వాటి కోసం మూసీలో గాలించారు. ఈ క్రమంలో డ్యామేజ్‌‌‌‌ అయిన 5- హార్డ్‌‌‌‌ డిస్క్‌‌‌‌ కేసులు, మెషిన్‌‌‌‌తో కట్‌‌‌‌ చేసిన 9 హార్డ్‌‌‌‌డిస్క్‌‌‌‌లు, 6 మెటల్‌‌‌‌ డిస్క్‌‌‌‌ల ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని 2023 డిసెంబర్ 4న రాత్రి మూసీ‌‌‌‌లో పడేసినట్టు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న ఈ పరికరాలను సీజ్‌‌‌‌ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌‌‌‌కు పంపించారు. 

ఎస్‌‌‌‌ఐబీలో ఆధారాల సేకరణ..  

కేసు విచారణలో భాగంగా పోలీసులు మార్చి 22న బేగంపేట్‌‌‌‌లోని ఎస్‌‌‌‌ఐబీ ఆఫీస్‌‌‌‌లో సోదాలు చేశారు. 12 కంప్యూటర్లు,7 సీపీయూలు, ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌, మానిటర్‌‌‌‌,‌‌‌‌ పవర్ కేబుల్స్‌‌‌‌ స్వాధీనం చేసుకున్నారు. ఎలక్ట్రిషియన్ రూమ్‌‌‌‌లో తనిఖీలు చేశారు. హార్డ్‌‌‌‌ డిస్క్‌‌‌‌లను కట్‌‌‌‌ చేసిన సమయంలో బయటకు వచ్చిన అల్యూమినియం పౌడర్‌‌‌‌ సేకరించారు. కట్టింగ్‌‌‌‌ మిషన్‌‌‌‌, ఇతర సామగ్రిని సీజ్ చేశారు. ఎస్‌‌‌‌ఐబీ ఆఫీస్‌‌‌‌లో తగులబెట్టిన స్పైరల్‌‌‌‌ బైండింగ్‌‌‌‌ బుక్స్‌‌‌‌, సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. కస్టడీలో ప్రణీత్‌‌‌‌రావు ఇచ్చిన సమాచారంతో కానిస్టేబుల్ కొత్త నరేశ్ గౌడ్‌‌‌‌ను విచారించారు. ఆయన డిప్యుటేషన్‌‌‌‌పై ఎస్‌‌‌‌ఐబీలో పని చేస్తున్నట్టు గుర్తించారు. ఎన్నికల సమయంలో బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ అభ్యర్థులు మినహా మిగతా పార్టీల క్యాండిడేట్లు, వారి అనుచరులు, బంధువులపై నిఘా పెట్టినట్టు నరేశ్ గౌడ్‌‌‌‌ వెల్లడించాడు. డబ్బులు ట్రాన్స్‌‌‌‌పోర్ట్ చేసే వారిని గుర్తించి, ఆ మొత్తాన్ని సీజ్‌‌‌‌ చేసే వాళ్లమని తెలిపాడు.  

ఇయ్యాల వేణుగోపాల్ రావు విచారణ.. 

ఫోన్‌‌‌‌ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్‌‌‌‌ ఏఎస్పీ వేణుగోపాల్‌‌‌‌రావుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. బుధవారం ఉదయం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. బంజారాహిల్స్ స్టేషన్ లో ఆయనను విచారించనున్నారు. వేణుగోపాల్‌‌‌‌ రావును విచారించిన తర్వాత ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వేణుగోపాల్‌‌‌‌ రావు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేసి పదవీ విరమణ పొందారు. అనంతరం వేణుగోపాల్‌‌‌‌ రావును ఎస్ఐబీలో అడిషనల్‌‌‌‌ ఎస్పీ(ఓఎస్డీ)గా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్‌‌‌‌ ప్రభాకర్ రావు నియమించారు. ప్రణీత్‌‌‌‌రావు, రాధాకిషన్ రావుతో కలిసి వేణుగోపాల్‌‌‌‌రావు కూడా ప్రతిపక్ష నేతలపై నిఘా పెట్టారు.

ఇద్దరికీ జ్యుడీషియల్ రిమాండ్.. 

ప్రణీత్‌‌‌‌రావు, నరేశ్ గౌడ్‌‌‌‌ స్టేట్‌‌‌‌మెంట్స్‌‌‌‌ ఆధారంగా భుజంగరావు, తిరుపతన్నకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. గత నెల 23న బంజారాహిల్స్‌‌‌‌ పీఎస్‌‌‌‌లో వీరిద్దరిని విచారించారు. ప్రణీత్‌‌‌‌రావు సహా ఇతర నిందితులతో కలిసి నేరం చేసినట్టు వీరిద్దరూ అంగీకరించారు. దీంతో ఇద్దరి సెల్‌‌‌‌ఫోన్లను పోలీసులు సీజ్‌‌‌‌ చేశారు. కేసులో నిందితులుగా చేర్చి రిమాండ్‌‌‌‌కు తరలించారు. కోర్టు అనుమతితో ఐదు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించారు. మంగళవారం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, కోర్టు ఈ నెల 6 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌‌‌‌ విధించింది. దీంతో భుజంగరావు, తిరుపతన్నను చంచల్‌‌‌‌గూడ జైలుకు తరలించారు. కాగా, టాస్క్‌‌‌‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ పై మంగళవారం కోర్టులో వాదనలు జరిగాయి. తీర్పును బుధవారానికి వాయిదా వేశారు. అలాగే ప్రధాన నిందితుడైన ప్రణీత్‌‌‌‌రావు బెయిల్‌‌‌‌ పిటిషన్‌‌‌‌పై వాదనలు ముగిశాయి. బుధవారం తీర్పు వెలువడే అవకాశం ఉంది.