Michael Slater: ఆసీస్ క్రికెటర్‌పై డజనుకుపైగా కేసులు.. బెయిల్ నిరాకరించిన కోర్టు

Michael Slater: ఆసీస్ క్రికెటర్‌పై డజనుకుపైగా కేసులు.. బెయిల్ నిరాకరించిన కోర్టు

ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, మాజీ ఓపెనర్ మైఖేల్ స్లేట‌ర్(54)కు క్వీన్స్‌లాండ్ మేజిస్ట్రేట్ షాకిచ్చింది. గృహ హింస ఆరోపణలపై అరెస్టయ్యి పోలీసుల అదుపులో ఉన్న స్లేటర్.. బెయిల్ ధరఖాస్తును కోర్టు తిరస్కరించింది. స్లేటర్‌కు బెయిల్ మంజూరు చేస్తే మళ్లీ నేరాలకు పాల్పడే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూటర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు.. బెయిల్ కోసం అతను చేసిన విజ్ఞప్తిని కొట్టివేసింది. ఈ విషయం తెలిసి ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం కోర్టు ఆవరణలోనే కుప్పకూలిపోయాడు.

ఏంటి ఈ కేసులు..?

ఆసీస్ క్రికెటరైన మైఖేల్ స్లేట‌ర్ పై డజనుకుపైగా కేసులు న‌మోదయ్యాయి. భార్యపై దాడికి పాల్పడ‌డం, ఇతర మ‌హిళ‌ల్ని వెంబ‌డించ‌డం, దొంగ‌త‌నానికి పాల్పడ‌డం, ఇతరులపై భౌతిక దాడికి దిగడం వంటి ఘటనల్లో అతనిపై ఈ కేసులు నమోదు చేశారు. 2023 డిసెంబ‌ర్ 5 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 12వ తేదీ మ‌ధ్యలో అతను ఈ నేరాల‌కు పాల్పడినట్లు కేసులు రిజిష్టర్ అయ్యాయి. అంతేకాదు ప‌లుమార్లు కోర్టు ఆదేశాల‌ను ధిక్కరించిన నేరాలు ఉన్నాయి. ఈ కేసుల్లో అరెస్టైన స్లేటర్.. గత కొన్ని రోజులుగా మారుచిడోర్ పోలీస్ వాచ్ హౌస్‌లో శిక్ష అనుభవిస్తున్నాడు. జైలు నుంచి బయటపడటానికి అతను ఇటీవల బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

స్లేటర్ క్రికెట్ కెరీర్

ఇక స్లేటర్ క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. 1993లో ఆసీస్ తరుపున టెస్టుల్లో అరంగ్రేటం చేశాడు. ఓపెనింగ్ బ్యాట‌రైన స్లేట‌ర్ కెరీర్ మొత్తంగా 74 టెస్టులు, 42 వ‌న్డేలు ఆడాడు. 42.83 స‌గ‌టుతో 5,312 ప‌రుగులు సాధించాడు. 2004లో అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికిన స్లేట‌ర్ ఆ త‌ర్వాత టీవీ కామెంటేట‌ర్‌గా మారాడు. ఛానెల్ 9, ఛానల్ 7లలో పనిచేశారు.