చంద్రయాన్-2 ఆపడమే మంచిదైంది

చంద్రయాన్-2 ఆపడమే మంచిదైంది
  • చంద్రయాన్–2 వాయిదాపై సైంటిస్టుల అభిప్రాయం
  • నిరాశ కలిగించినా ఇస్రో నిర్ణయం కరెక్టే.. అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
  • వందల కోట్లు వృథా కాకుండా ఆపగలిగామని వెల్లడి
  • త్వరలోనే విజయవంతంగా ప్రయోగం జరుగుతుందని ఆశాభావం
  • క్రయోజనిక్ దశలో సమస్య ఉన్నట్టు చెప్తున్న ఇస్రో వర్గాలు

న్యూఢిల్లీ, శ్రీహరికోట:చంద్రయాన్–2 ప్రయోగం వాయిదా పడటం తీవ్ర నిరాశ కలిగించినా.. ఇస్రో నిర్ణయంపై అభినందనలే వ్యక్తమవుతున్నాయి. టెక్నికల్​ లోపాన్ని గుర్తించిన వెంటనే ఎలాంటి ప్రతిష్టకు పోకుండా ప్రయోగాన్ని వాయిదా వేయడం వల్ల మంచే జరిగిందని, ఇస్రో చివరి నిమిషం వరకు అప్రమత్తంగా ఉండటం వల్లే పెద్ద ప్రమాదం తప్పిందని సైంటిస్టులు చెబుతున్నారు. లేకుంటే వందల కోట్ల రూపాయల నష్టంతోపాటు, దేశ పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతినేవని అంటున్నారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా సరిదిద్ది, విజయవంతంగా చంద్రయాన్–2ను ప్రయోగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ముందు జాగ్రత్తగా..

సోమవారం తెల్లవారుజామున 2.51 గంటలకు

జరగాల్సిన జీఎస్ఎల్వీ లాంచింగ్​ను.. ఆ సమయానికి గంట ముందు ఆపేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మీడియాతో మాట్లాడిన ఇస్రో అసోసియేట్​ డైరెక్టర్​ బీఆర్​ గురుప్రసాద్ ‘‘లాంచ్​ వెహికిల్​ (జీఎస్ఎల్వీ)లో ఓ సాంకేతిక సమస్యను గుర్తించాం. ఇప్పుడున్న సమయంలో ప్రయోగాన్ని నిర్వహించే పరిస్థితి లేదు. ముందుజాగ్రత్త చర్యగా ప్రయోగాన్ని వాయిదా వేస్తున్నాం. తిరిగి ఎప్పుడు చేపట్టేదీ త్వరలో వెల్లడిస్తాం”అని ప్రకటించారు. అయితే ఏమిటా సమస్య అన్నది ఆయన వెల్లడించలేదు. శాస్త్రవేత్తలు క్రయోజనిక్​ దశలో ఓ లోపాన్ని గుర్తించారని, దానిని సరిచేసే పనిలో ఉన్నారని ఇస్రో వర్గాలు సోమవారం మధ్యాహ్నం తెలిపాయి.

భవిష్యత్తుకు దారిచూపేది ఇదే..

ఇండియా అంతరిక్ష ప్రయోగాలకు దారి చూపే కీలకమైన ప్రయోగం చంద్రయాన్–2 అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భవిష్యత్తులో మార్స్ పైకి, ఆస్టరాయిడ్స్​పైకి రోవర్లను పంపాలని, పరిశోధనలు చేయాలని ఇస్రో ప్రయత్నిస్తోంది. మరో రెండేళ్లలో అంతరిక్షంలోకి మనిషిని పంపేందుకుకృషి చేస్తోంది. అలాంటి వాటన్నింటికీ ప్రస్తుత ప్రయోగమే ఆధారంగా నిలుస్తుందని నిపుణులు చెప్తున్నరు. భూమి నుంచి శాటిలైట్, ల్యాండర్, రోవర్ల మాడ్యూల్​ను అంతరిక్షంలోకి పంపడంతో జీఎస్ఎల్వీ పని ముగుస్తుందని, ఆ తర్వాతే అసలైన ప్రయోగం కొనసాగుతుందని వివరిస్తున్నారు. భూమి నుంచి చంద్రుడివరకు మాడ్యూల్​ ప్రయాణం, చంద్రుడి చుట్టూ తిరగడం, ఆర్బిటర్​ నుంచి ల్యాండర్ విడిపోయి.. చంద్రుడిపై దిగడం, ల్యాండర్​ నుంచి రోవర్​ విడిపడి చంద్రుడి ఉపరితలంపై ప్రయోగాలు చేయడం, ఆ డేటాను ఆర్బిటర్​ సేకరించి మనకు పంపడం.. ఇవన్నీ మన భవిష్యత్తు ప్రయోగాలకు ఆధారం కల్పిస్తాయని చెబుతున్నారు. ఈ మిషన్​ విజయవంతం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆలస్యమైనా సక్సెస్​ కావాలి..

జీఎస్ఎల్వీ లాంచింగ్​ విషయంలో తొందరపడకుండా ముందుచూపుతో వ్యవహరించిన ఇస్రో శాస్త్రవేత్తలు అభినందనలు తెలుపుతున్నానని కోల్ కతాలోని ‘ఇండియన్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ సైన్స్​ ఎడ్యుకేషన్ అండ్​ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్)’ప్రొఫెసర్​ రాజేశ్​ కుంబ్లే నాయక్ అన్నారు. ‘‘రాకెట్​ప్రయోగాల విషయంలో ఇస్రో సక్సెస్​ రేట్​ ఎక్కువ. రాకెట్లలోని క్లిష్టమైన వ్యవస్థలను చివరిక్షణం వరకు తనిఖీ చేస్తుండటం ఓ కళ. అందులో ఇస్రో శాస్త్రవేత్తలు గట్టి పట్టు సాధించారు. ప్రయోగాన్ని కొన్ని వారాలు వాయిదా వేస్తారని భావిస్తున్నాను. ఎందుకంటే ఫెయిలయ్యే కంటే కొంచెం లేటైనా సక్సెస్​ సాధించడం మంచిది”అని చెప్పారు. స్పేస్​ ప్రయోగం అంటే ఇంజనీరింగ్​ ఎలిమెంట్స్, సాఫ్ట్​వేర్​ డెవలప్​మెంట్, ఇన్​స్ట్రుమెంటేషన్, టెలీకమ్యూనికేషన్స్ వంటి ఎన్నో విభాగాలు ఉమ్మడిగా పనిచేయాలని, అందులోనూ చంద్రుడిపైకి పంపే మిషన్​ మరెంతో క్లిష్టమైనదని ప్రొఫెసర్​ దివ్యేందు నంది చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో సమర్థవంతులని, టెక్నికల్, డిజైన్​ సవాళ్లను ఎదుర్కొని చంద్రయాన్-2 ప్రాజెక్టును సిద్ధం చేశారని చెప్పారు.

అప్రమత్తతే కాపాడింది

చివరి నిమిషం వరకు అప్రమత్తంగా ఉండటం వల్లే ఇస్రో శాస్త్రవేత్తలు లోపాన్ని గుర్తించగలిగారని, భారీ నష్టాన్ని నివారించారని టాటా ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఫండమెంటల్​ రీసెర్చ్​ ప్రొఫెసర్​ సుదీప్​ భట్టాచార్య చెప్పారు. నిజానికి రాకెట్, శాటిలైట్లను మళ్లీ మళ్లీ తనిఖీ చేస్తూ.. పూర్తిస్థాయిలో సిద్ధం చేయగల సాంకేతిక సామర్థ్యం ఉన్నందుకు సంతోషించాలని పేర్కొన్నారు.

ఇన్నేళ్ల కష్టం వృధా అయ్యేది

రాకెట్ ప్రయోగాన్ని స్వయంగా చూసేందుకు శ్రీహరికోటలోని లాంచింగ్​ స్టేషన్​కు వచ్చినవారంతా ప్రయోగం వాయిదా పడటంతో నిరాశ చెందారు. ‘అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. సమస్యను సరిదిద్దుతారని ఆశిస్తున్నాం. మళ్లీ ప్రయోగం నిర్వహించే రోజున వస్తాం. రాకెట్​ ప్రయోగానికి ముందే ప్రాబ్లంను గుర్తించడం మంచిదైంది. లేకుంటే ఇన్నేళ్ల కష్టం, భారీగా డబ్బు వృధా అయ్యేవి”అని కొందరు స్టూడెంట్స్​ చెప్పారు.

ఇలాంటి ఇబ్బందులు కొత్తేం కాదు..

ఇస్రో చేపట్టిన ప్రయోగాల్లో సాంకేతిక ఇబ్బందులు ఇప్పుడు కొత్తేం కాదు.  మొదట్లో సోవియట్​ యూనియన్​ నుంచి కొంత సహకారం అందింది. అయితే 90వ దశకంలో సోవియట్​ విచ్ఛిన్నమైన తర్వాతి నుంచి ఇండియానే సొంతంగా స్పేస్​ టెక్నాలజీని డెవలప్​ చేసుకోవడంపై దృష్టి పెట్టింది. పీఎస్ఎల్వీని రాకెట్లను అభివృద్ధి చేసింది. అయితే నాలుగైదు టన్నుల బరువైన శాటిలైట్లు, పేలోడ్లను స్పేస్​లోకి పంపేందుకు భారీ రాకెట్లు అవసరం. ఆ దిశగానే జీఎస్ఎల్వీని రూపొందించింది. అయితే అందులో కీలకమైన క్రయోజనిక్​ టెక్నాలజీ విషయంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. దీనిపై రష్యా తొలుత కొంత సహకరించినా.. తర్వాత ఇస్రోయే క్రయోజనిక్​ ఇంజన్లను అభివృద్ధి చేసింది. జీఎస్ఎల్వీలో మార్క్​–1, 2 రాకెట్ల ద్వారా 13 ప్రయోగాలు చేసింది. అందులో మూడు విఫలంకాగా.. మిగతావి అన్నీ సక్సెస్ ఫుల్​గా శాటిలైట్లను స్పేస్​లోకి తీసుకెళ్ళాయి. మరింత బరువైన శాటిలైట్లు, పేలోడ్లను పంపగలిగేలా జీఎస్ఎల్వీ మార్క్​–3 వెర్షన్​ను సిద్ధం చేశారు. ఇస్రో బాహుబలిగా పిలిచే ఈ రాకెట్లతో రెండు జీశాట్​ ప్రయోగాలను, స్పేస్​లోకి మనిషిని పంపే ‘క్రూ మాడ్యూల్’పరీక్షను విజయవంతంగా పూర్తి చేశారు. తాజాగా చంద్రయాన్–2ను ప్రయోగానికి అంతా సిద్ధం చేసినా.. క్రయోజనిక్​ దశలో చిన్న లోపాన్ని గుర్తించి, వాయిదా వేశారు. అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు చేపట్టిన ‘గగన్​యాన్’కోసం కూడా జీఎస్ఎల్వీ మార్క్​–3 రాకెట్లనే వినియోగించనున్నట్టు ఇటీవలే ఇస్రో చైర్మన్​ కె.శివన్​ కూడా వెల్లడించారు.

ఏమిటీ క్రయోజనిక్​ టెక్నాలజీ?

జీఎస్ఎల్వీ మార్క్–3 తరహా రాకెట్లకు క్రయోజనిక్​ టెక్నాలజీ ఆయువుపట్టు లాంటిది. అన్ని రాకెట్ ఇంధనాల్లో హైడ్రోజన్ ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది. కానీ హైడ్రోజన్ సహజంగా గ్యాస్ రూపంలో ఉంటుంది. అలా ఇంధనంగా వాడటం కష్టం. ఇదే హైడ్రోజన్ ను లిక్విడ్ రూపంలోకి మార్చి వాడొచ్చు. కానీ సహజ హైడ్రోజన్ మైనస్​ 250 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ టెంపరేచర్ లో అయితేనే లిక్విడ్ రూపంలో ఉంటుంది. ఈ హైడ్రోజన్​ లిక్విడ్ ను మండించడానికి లిక్విడ్ రూపంలో ఉన్న ఆక్సిజన్ కూడా అవసరం. అది మైనస్​ 90 డిగ్రీల సెల్సియస్ వద్ద ద్రవ రూపంలోకి మారుతుంది. రాకెట్ లోపల అంత తక్కువ టెంపరేచర్లు క్రియేట్ చేసి, ప్రయోగించడం కష్టం. ఆ ఇంధనాన్ని మండించడానికి కూడా ప్రత్యేకమైన టెక్నాలజీ కావాలి. అదే క్రయోజనిక్​. 1980ల్లోనే క్రయోజనిక్​ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు ఇస్రో ప్రయత్నించింది. అప్పట్లో ఈ టెక్నాలజీ కేవలం అమెరికా, సోవియట్ యూనియన్, జపాన్, ఫ్రాన్స్ వద్ద మాత్రమే ఉంది. మరోవైపు నెక్ట్స్ జనరేషన్ లాంచ్ వెహికల్స్, భారీ ఉప గ్రహాలను ప్రయోగించడంపై దృష్టి పెట్టిన ఇస్రో.. జీఎస్ఎల్వీ రాకెట్లను తయారు చేయాలని నిర్ణయించింది. మన దగ్గర టెక్నాలజీ లేకపోవడంతో.. విదేశాల నుంచి కొన్ని క్రయోజనిక్​ ఇంజన్లను కొనుగోలు చేయాలని అనుకుంది. జపాన్, అమెరికా, ఫ్రాన్స్ తో పాటు రష్యాను సంప్రదించింది. రెండు ఇంజన్లను ఇచ్చేందుకు రష్యా ముందుకు వచ్చింది. పూర్తి స్థాయిలో టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ చేస్తామని కూడా చెప్పింది.

రష్యా చెయ్యివ్వడంతో..

ఇండియా, రష్యా మధ్య ఒప్పందం కుదిరే నాటికి వాటికి మిస్సైల్ టెక్నాలజీ కంట్రోల్ రిజీమ్ (ఎంటీసీఆర్)లో ఇండియాకు సభ్యత్వం లేదు. ఆ సాకుతో క్రయోజనిక్​ టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ ఒప్పందం కుదరదంటూ అమెరికా మోకాలడ్డింది. అప్పటికే కోల్డ్ వార్ లో ఓడిన రష్యా.. అమెరికా ఒత్తిడికి తలొగ్గి డీల్ ను క్యాన్సిల్ చేసుకుంది. అయితే ప్రత్యామ్నాయంగా ఏడు ఇంజన్లను (టెక్నాలజీ ట్రాన్స్ ఫర్ లేకుండా) ఇస్తామని ఆఫర్ చేసింది. ఆ ఇంజన్ల సాయంతోనే జీఎస్ఎల్వీ మార్క్–1, జీఎస్ఎల్వీ మార్క్–2 రాకెట్లను ఇస్రో అభివృద్ధి చేసింది. 2007 సెప్టెంబర్ లో ఇన్ శాట్–4 సీఆర్ శాటిలైట్ ను మార్క్–2 రాకెట్ ద్వారా సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది. అప్పటికే సొంతంగా క్రయోజనిక్​ టెక్నాలజీ డెవలప్ చేసేందుకు తిరువనంతపురంలో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసింది. ఇంజన్లను అభివృద్ధి చేయడానికి పదేళ్లకుపైగానే పట్టింది. 2010లో సొంతంగా తయారు చేసిన ఇంజన్ తో జీఎస్ఎల్వీ రాకెట్ ను పరీక్షిస్తే.. ఫెయిల్యూర్ ఎదురైంది. 2014లో జీఎస్ఎల్వీల్లో కొత్త తరం రాకెట్ మార్క్–3ని ఇస్రో డిజైన్​ చేసింది. దానికి సొంత క్రయోజనిక్​ ఇంజన్ ను అమర్చి ప్రయోగించగా విజయం వరించింది. తర్వాత మార్క్–3తో చేసిన రెండు ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి.

చంద్రయాన్-1లోనూ ఇట్లనే అయింది

చంద్రయాన్–1 లాంచింగ్ కు రెండు గంటల ముందు ప్రొపెల్లెంట్ లో లీకేజీ ఉన్నట్టు గుర్తించాం. వెంటనే సిబ్బంది రంగంలోకి దిగి  సరిచేయడంతో.. సమయానికి లాంచ్ చేశాం.ఇప్పుడు చంద్రయాన్చం–2లోనూ అలాంటి లీకేజీ సమస్యే వచ్చినట్టుంది. ప్రయోగాల సమయంలో ఇలాంటివి జరుగుతుంటాయి. సరైన సమయంలో సమస్యను గుర్తించడం వల్ల భారీ ప్రమాదం తప్పింది.
– మాధవన్ నాయర్, ఇస్రో మాజీ ఛైర్మన్