ఫిఫా వరల్డ్ కప్ గెలవలేకపోవడం రొనాల్డో విజయాలను తక్కువ చేయలేదు:కోహ్లీ

 ఫిఫా వరల్డ్ కప్ గెలవలేకపోవడం రొనాల్డో విజయాలను తక్కువ చేయలేదు:కోహ్లీ

ఫుట్బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డోపై టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిఫా వరల్డ్ కప్లో క్వార్టర్ ఫైనల్లో పోర్చుగల్ ఓడిపోవడంతో..భావోద్వేగానికి గురైన రొనాల్డో..తన ఇన్స్టా గ్రామ్లో పోస్ట్ పెట్టాడు. దీనిపై స్పందించిన కోహ్లీ...తన దృష్టిలో రొనాల్డో ఆల్ టైం గ్రేట్ ప్లేయర్ అని చెప్పాడు. ఎంతో మందికి స్పూర్తిగా నిలిచారని కొనియాడాడు. ఫుట్బాల్తో పాటు..వరల్డ్ వైడ్గా ఉన్న అభిమానులకు రొనాల్డో ఆటను ఏ ట్రోఫి నిర్వచించలేదన్నాడు. గ్రౌండ్లోకి దిగిన ప్రతీసారి అంకితభావంతో ఆడారని పేర్కొన్నాడు. ఫిఫా వరల్డ్ కప్ గెలవలేకపోవడం అనేది రొనాల్డో విజయాలను తక్కువ చేయలేదని కోహ్లీ పోస్ట్ చేశాడు. 

ఓటమి..

గ్రూప్ దశ నుంచి అదరగొట్టిన పోర్చుగల్..క్వార్టర్ ఫైనల్లో చతికిలపడింది. మొరాకో చేతిలో ఓడి ఇంటిముఖం పట్టింది. దీంతో కెరీర్లో ఒక్క  ఫిఫా వరల్డ్ కప్  అయినా సాధించాలన్న రొనాల్డో కల చెదిరింది. ప్రస్తుతం రొనాల్డో వయసు 37 ఏళ్లు. దీంతో అతనికి ఇదే చివరి ప్రపంచకప్ కానుంది. మరో వరల్డ్ కప్ వరకు అతను ఆడతాడో లేదో అనేది సందేహమే. ఈ క్రమంలో రొనాల్డో వరల్డ్ కప్ గెలవడం అనేది కలగానే మిగిలిపోనుంది. ఈ బాధతోనే మ్యాచ్ ఓడిన తర్వాత రొనాల్డో ఏడ్చాడు.ఆ  తర్వాత  ఇన్ స్టాగ్రామ్లో ఒక భావోద్వేగ పూరిత పోస్ట్ పెట్టాడు. 

కల గానే మిగిలింది...

ఫిఫా వరల్డ్ కప్లో పోర్చుగల్ను విజేతగా నిలపడం తన కల అని రొనాల్డో చెప్పాడు. కానీ ఆ కల నెరవేరలేదన్నాడు. ప్రస్తుత వరల్డ్ కప్లో జట్టును విజేతగా నిలపడానికి పోరాడినట్లు వెల్లడించాడు. గత 16 ఏళ్లలో ఆడిన 5 వరల్డ్ కప్లలో గొప్ప ప్రదర్శన చేసినట్లు చెప్పాడు. దేశంతో పాటు..అభిమానులు ఇచ్చిన మద్దతుతో రాణించానని తెలిపాడు. పోర్చుగల్తో పాటు..వరల్డ్ కప్కు ఆతిథ్యమిచ్చిన ఖతార్కు రొనాల్డో ధన్యవాదాలు తెలిపాడు.