గద్వాల-,డోర్నకల్ రైలు మార్గంపై దృష్టి : చిన్నారెడ్డి

గద్వాల-,డోర్నకల్  రైలు మార్గంపై దృష్టి : చిన్నారెడ్డి
  •     మాజీ మంత్రి చిన్నారెడ్డి

వనపర్తి, వెలుగు : గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, కల్వకుర్తి, సూర్యాపేట పట్టణాల మీదుగా వరంగల్  జిల్లా డోర్నకల్  వరకు నూతన రైలు మార్గాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని మాజీ మంత్రి చిన్నారెడ్డి తెలిపారు. గురువారం పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కర్నాటక, తెలంగాణ, ఏపీలను కలుపుతూ 296 కిలోమీటర్ల రైల్వే ట్రాక్  నిర్మించనున్నట్లు చెప్పారు. గతంలో రాయచూర్, మాచర్ల రైలు మార్గంలో మొదటి విడతలో గద్వాల వరకు పనులు పూర్తయ్యాయని, రెండో దశలో గద్వాల నుంచి మాచర్ల వరకు పనులు జరగాల్సి ఉందన్నారు.

కొత్తగా గద్వాల–డోర్నకల్  రైలు మార్గం రావడంతో రెండింటిని కలిపేలా కల్వకుర్తి వరకు కామన్  రైల్వే లైన్  అవసరమవుతుందన్నారు. ఈ రైలు మార్గానికి బడ్జెట్​లో నిధులు కేటాయించేలా రైల్వే మంత్రిని సీఎం కలవనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్  ప్రభుత్వం ప్రజాపాలనతో రాష్ట్ర ప్రజల సమస్యలు తీర్చుతుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, శంకర్ ప్రసాద్, కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

గోపాల్ పేట : మండలంలోని బుద్ధారం గ్రామానికి చెందిన తోల శ్రీహరి యాక్సిడెంట్​లో చనిపోగా, బుధవారం మాజీ మంత్రి జి చిన్నారెడ్డి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాంగ్రెస్  పార్టీ సభ్యత్వ ఇన్సూరెన్స్  ద్వారా వచ్చిన రూ.2 లక్షల చెక్కును మృతుడి తండ్రి వెంకటయ్యకు అందజేశారు. కిరణ్ కుమార్, దిలీప్ కుమార్ యాదవ్, దేవన్న యాదవ్  ఉన్నారు.