ఈడీ విచారణకు హాజరైన గీతారెడ్డి, గాలి అనిల్

ఈడీ విచారణకు హాజరైన గీతారెడ్డి, గాలి అనిల్

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు మాజీ మంత్రి గీతారెడ్డి, గాలి అనిల్ హాజరయ్యారు. ఈ కేసులో ఈడీ నోటీసులు అందుకున్న రాష్ట్ర కాంగ్రెస్  నేతల్లో ఈనెల 3వ తేదీన (సోమవారం) మాజీ మంత్రి షబ్బీర్ అలీ విచారణకు హాజరయ్యారు. దాదాపు 6 గంటల పాటు  యంగ్ ఇండియా  కంపెనీకి ఇచ్చిన విరాళాలపై షబ్బీర్ అలీని ప్రశ్నించారు. అయితే ఈడీ విచారణకు కొన్ని వ్యక్తిగత కారణాలతో గీతారెడ్డి, గాలి అనిల్ సోమవారం అటెండ్ కాలేదు.

యంగ్ ఇండియా  కంపెనీకి ఇచ్చిన విరాళాలపై మొత్తం ఐదుగురు కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. షబ్బీర్ అలీ, గీతారెడ్డిలతోపాటు సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, అనిల్కుమార్లను ఈడీ విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలకు ఈడీ నోటీసులు అందడం కలకలం సృష్టించింది. వేధింపుల కోసమే ఈడీ నోటీసులు ఇచ్చిందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. ఎక్కడ తమ అవినీతి బయటపడుతుందోనని భయపడుతున్నారని.. నిజాయితీని నిరూపించుకోవాలని బీజేపీ నేతలు సవాల్ విసిరారు.