కాంగ్రెస్ పై చీటింగ్ కేసు పెట్టాలే : హరీశ్ రావు

కాంగ్రెస్ పై చీటింగ్ కేసు పెట్టాలే : హరీశ్ రావు

నారాయణ్ ఖేడ్, వెలుగు: కాంగ్రెస్ పై ప్రజలు చీటింగ్ కేసు పెట్టాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గురువారం ఖేడ్ పట్టణంలోని హెచ్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 100 రోజుల్లో 6 గ్యారంటీలు 13 హామీలు నెరవేరుస్తామని చెప్పి మాట తప్పిందన్నారు.  

తెలంగాణ రాష్ట్రంలో నారాయణఖేడ్ లో బీఆర్ఎస్ ఓడిపోతుందని కలలో కూడా అనుకోలేదన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమని, గెలిచినా ఓడినా కేసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ పనిచేస్తుందన్నారు. భూపాల్ రెడ్డి నిత్యం ప్రజల్లోనే ఉండి అభివృద్ధి కోసం పని చేశాడన్నారు. ఖేడ్ ని సస్యశ్యామలం చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం బసవేశ్వర ప్రాజెక్టును స్టార్ట్ చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బసవేశ్వర ప్రాజెక్టును, ఎస్జీఎఫ్ నిధులను, ఖేడ్ మున్సిపల్ నిధులను రద్దు చేసిందన్నారు. 

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను బొంద పెడితేనే ప్రజలకు అభివృద్ధి పథకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. సమావేశంలో జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, జిల్లా పరిషత్ చైర్మన్ మంజు శ్రీ, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కుమార్, రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రాష్ట్ర మాజీ చైర్మన్ భిక్షపతి వివిధ మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షుడు పరమేశ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.