భట్టి విక్రమార్కతో జూపల్లి కృష్ణారావు భేటీ

భట్టి విక్రమార్కతో జూపల్లి కృష్ణారావు భేటీ

ఎలక్షన్స్ ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జోష్ కనిపిస్తోంది. నాయకులు చాలామంది కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. తాజాగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. హైదరాబాద్ లో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నివాసానికి వెళ్లారు. అక్కడ దాదాపు గంటపాటు భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు జూపల్లి. ప్రధానంగా ఈ ఇద్దరు ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. అంతేకాదు.. కొల్లాపూర్ లో నిర్వహించే కాంగ్రెస్ సభ గురించి మాట్లాడుకున్నారు. 

కాంగ్రెస్ పార్టీలో చేరిక సందర్భంగా మర్యాదపూర్వకంగా మల్లు భట్టి విక్రమార్కతో ఆయన నివాసంలో సోమవారం (జులై 10న) భేటీ అయ్యారు జూపల్లి కృష్ణారావు. ఇటీవలే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. జులై 20న కొల్లాపూర్ లో కాంగ్రెస్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు ప్రియాంకగాంధీ హాజరుకానున్నారు. ఇదే సభలో ప్రియాంకగాంధీ సమక్షంలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరనున్నారు.

జూపల్లి కృష్ణారావుతో పాటు వివిధ పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు కాంగ్రెస్ లో చేరనున్నారు. తనతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 14 నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధులు ప్రియాంకగాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతారని జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. మరోవైపు.. మాజీ మంత్రి జానారెడ్డితోనూ జూపల్లి భేటీకానున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నాయకుల చేరికలను కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తోంది. 

కాంగ్రెస్ సభను విజయవంతం చేయండి : మల్లు 

జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరుతున్నందుకు తనను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమర్క అన్నారు. జూపల్లి రాజకీయ అనుభవం కాంగ్రెస్ పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందని వ్యాఖ్యానించారు. జూపల్లితో పాటు వివిధ పార్టీల నుంచి చాలామంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పారు. కాంగ్రెస్ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.