పూర్తికాని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎట్ల ప్రారంభిస్తరు? : జూపల్లి కృష్ణారావు

పూర్తికాని పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును ఎట్ల ప్రారంభిస్తరు? :  జూపల్లి కృష్ణారావు
  • పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తయినట్టు భ్రమలు కల్పిస్తున్నరు
  • పంపు మోటార్ల కొనుగోలులో రూ.1,600 కోట్ల అవినీతి
  • ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్​ శ్రేణుల అడ్డగింత
  • పోలీసుల అదుపులో జూపల్లి, పలువురు నాయకులు

మహబూబ్ నగర్ కలెక్టరేట్/ కొల్లాపూర్: పూర్తికాని పాలమూరు-–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ఎలా ప్రారంభిస్తారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. శనివారం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న ఆయన్ను పోలీసులు అడ్డున్నారు. దీంతో ఆయన మహబూబ్​నగర్​ కాంగ్రెస్​పార్టీ ఆఫీస్​లో మీడియాతో మాట్లాడారు. నార్లాపూర్​లో ఒక్క మోటారు పనులు మాత్రమే పూర్తయ్యాయని, కానీ మొత్తం ప్రాజెక్టు పూర్తయినట్లు భ్రమలు కల్పిస్తున్నారని ఫైరయ్యారు. తొమ్మిదేండ్ల నుంచి కల్వకుర్తి ప్రాజెక్టు పూర్తి కానప్పుడు పాలమూరు ప్రాజెక్టు ఎలా పూర్తయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

కాల్వలకు భూసేకరణ కూడా పూర్తి కాలేదన్నారు. నార్లాపూర్ రిజర్వాయర్ రెండో లిఫ్ట్ నుంచి ఏదుల వరకు కెనాల్ ద్వారా నీళ్లు పంపాల్సి ఉంటుందని, కెనాల్స్​ పూర్తి కానప్పుడు నీళ్లు ఎలా తీసుకుపోతారని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు పంపు మోటార్లలో రూ.1,600 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. దానిని నిరూపిస్తానని, లేదంటే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ, సోనియాగాంధీ సభల ప్రాధాన్యతను తగ్గించేందుకే ఈ ప్రాజెక్టు ప్రారంభిస్తున్నట్లు విమర్శించారు. మీడియా సమావేశం అనంతరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న జూపల్లి కృష్ణారావుతోపాటు నాయకులు మేఘారెడ్డి, వీర్లపల్లి శంకర్ తదితరులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ క్రమంలో కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. 

ఉదయం నుంచే అరెస్టులు

మాజీ మంత్రి జూపల్లి పిలుపు మేరకు ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్న కాంగ్రెస్​ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. మరికొందరిని గృహ నిర్బంధం చేశారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచే పోలీసులు ముఖ్య నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. కొల్లాపూర్​లో జూపల్లి క్యాంప్​ ఆఫీస్​ వద్ద భారీగా పోలీసులను మోహరించారు.