
సూర్యాపేట/తుంగతుర్తి, వెలుగు: మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు తుంగతుర్తి సమీపంలోని ఆయన సొంత వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో పూర్తయ్యాయి. దశాబ్దాలుగా ప్రజాసేవలో నిలిచిన నాయకుడి అంతిమయాత్రలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కడసారి చూపు కోసం వేలాదిగా తరలివచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల మధ్య అంత్యక్రియలు జరిగాయి.
మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. పీసీసీ చీఫ్ రాంరెడ్డి పార్థివదేహంపై కాంగ్రెస్ జెండాను ఉంచారు. ఆయన రాజకీయ జీవితం, ప్రజా సేవ, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధిని గుర్తు చేసుకుంటూ నేతలు సంతాపం తెలిపారు. అంతిమయాత్రలో వేలాది మంది అభిమానులు, పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. కొడుకు సర్వోత్తమ్ రెడ్డి తండ్రి దామోదర్ రెడ్డి చితికి నిప్పంటించారు.
కాంగ్రెస్ కు తీరని లోటు..
మాజీ మంత్రి దామోదర్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పార్టీకి, ప్రజలకు అంకితభావంతో సేవలందించారని గుర్తు చేశారు. ప్రజల కోసం ఆయన తాపత్రయపడేవారని, విలువలతో కూడిన రాజకీయాలు చేసిన ఆయన వ్యక్తిత్వం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఈ ప్రాంత ప్రజల మనసును గెలుచుకున్నారని కొనియాడారు. ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
దామన్న ఆశయ సాధనకు కృషి..
దామోదర్ రెడ్డి ఆశయ సాధనకు కృషి చేస్తానని మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. అన్ని రకాల ఆటుపోట్లను అధిగమించి కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. వ్యాపార ధోరణితో రాజకీయాలు నడుపుతున్న ఈ రోజుల్లో పార్టీని కాపాడుకునేందుకు సొంత ఆస్తులను కర్పూరంలా కరిగించుకున్న మహానేత అని కొనియాడారు. 1994లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన సమయంలో తనకు అండగా ఉన్నారని, ఈ విషయాన్ని ఎప్పటికీ
మరచిపోలేనన్నారు.