
యాదగిరిగుట్ట, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి విమర్శించారు.
ఆలేరు మాజీ వైస్ ఎంపీపీ బెంజారం రవి గౌడ్, మాజీ సర్పంచ్ రజినితో పాటు శారాజిపేట గ్రామానికి చెందిన 200 మంది కాంగ్రెస్ నాయకులు మంగళవారం యాదగిరిగుట్టలోని గొంగిడి నిలయంలో గొంగిడి సునీత, మహేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో ఎన్నో హామీలిచ్చి వాటిని నెరవేర్చకుండా కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఇటీవల జరిగిన మదర్ డెయిరీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన డైరెక్టర్ల ఓటమితో ఈ విషయం స్పష్టమైందన్నారు. మదర్ డెయిరీ డైరెక్టర్ల ఎన్నికల్లో పాల సంఘం చైర్మన్లను అధికార కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రలోభపెట్టినా బీఆర్ఎస్ డైరెక్టర్ల గెలుపును ఆపలేకపోయారన్నారు.
ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అనుచరుడు మధుసూదన్ రెడ్డి మదర్ డెయిరీ చైర్మన్ అయ్యాక సంస్థ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. ఆలేరు మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్ యాదవ్, మండల సెక్రటరీ జనరల్ రాంనర్సయ్య, శారాజీపేట గ్రామశాఖ అధ్యక్షుడు మహేందర్, మాజీ సర్పంచ్ కంతి మహేందర్, మాజీ ఎంపీటీసీ రచ్చ కావ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ సముద్రాల కుమార్ తదితరులు ఉన్నారు.