
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు:- ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జయప్రకాష్ నారాయణ స్మారక పురస్కారం 2005 అందుకున్నారు. సోమవారం జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన సన్మాన కార్యక్రమంలో తనికెళ్ల భరణి లక్ష రూపాయల చెక్కు, ప్రశంసా పత్రంతో గుమ్మడి నర్సయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ.. జెపీఎన్సీ విద్యార్థులు ప్రతిభావంతులు కావాలని, వారి సేవలు దేశానికి, ప్రపంచానికి ఉపయోగ పడాలని కోరారు.
చదువుకున్న వారు జ్ఞానం ఉన్న అవినీతికి పాల్పడుతున్నారని ఇది చాలా బాధాకరమన్నారు. ముఖ్య అతిథి నటుడు రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. గుమ్మడి నర్సయ్య గుమ్మడి కాయ లాంటి మనిషి అని గుమ్మడి కాయ పాడవకుండా ఉంటుందని అలాగే గుమ్మడి నర్సయ్య కూడా ఎప్పుడూ స్వచ్చంగా ఉంటాడని తెలిపారు.
రాజకీయాలలో వావిలాల గోపాలకృష్ణయ్య ఆదర్శ పురుషుడు అని తదుపరి గుమ్మడి నర్సయ్య అన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు కిలె గోపాల్, హన్మేష్ జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వెంకటేశ్, కాలేజీ కార్యదర్శి వెంకట రామారావు, కాలేజీ ప్రిన్సిపాల్ డా. కృష్ణమూర్తి, పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డా.చంద్ర శేఖర్, పరీక్షల నిర్వహణ అధికారి శ్రీ కోటల సందీప్ కుమార్, వజ్రలింగము, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.