నాగర్​కర్నూల్​ నియోజకవర్గంలో  కారు ఖాళీ!

నాగర్​కర్నూల్​ నియోజకవర్గంలో  కారు ఖాళీ!
  • కాంగ్రెస్​లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే మర్రి!
  • బీఆర్ఎస్​కు ఏడుగురు కౌన్సిలర్లు గుడ్​ బై
  • అదే దారిలో మరో ఎనిమిది మంది

నాగర్ కర్నూల్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బేజారవుతున్న బీఆర్ఎస్​ లీడర్లు పూటకొకరు జారుకుంటున్నారు. నాగర్ కర్నూల్​ సిట్టింగ్​ ఎంపీ పోతుగంటి రాములు కొడుకుతో కలిసి బీజేపీలో చేరగా, తాజాగా నాగర్​కర్నూల్​ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి కాంగ్రెస్​లో చేరడం లాంఛనమేనని సమాచారం. ఇటీవల  హైదరాబాద్​లో నియోజకవర్గ నాయకులతో సమావేశమైన మర్రి పార్టీ మార్పుపై చర్చించినట్లు తెలిసింది. ఆ పార్టీ అగ్రనాయకత్వంతో చర్చించిన మర్రి లైన్​ క్లియర్​ చేసుకున్నారు. మల్కాజ్​గిరి పార్లమెంట్​ స్థానం నుంచి కాంగ్రెస్​ అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలిసింది.

మర్రి పార్టీ మారడంపై రెండు నెలల కింద చర్చ మొదలుకాగా, నాగర్​ కర్నూల్​లో కార్యకర్తల మీటింగ్​ పెట్టి అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశాడు. పార్టీ మారితే ముందుగా కేసీఆర్​కు చెప్పి మారతానని ప్రకటించారు. మర్రికి కుడిభుజంగా పేరున్న డీసీసీబీ డైరెక్టర్, సమీప బంధువు జక్కా రఘునందన్​ రెడ్డి బీజేపీలో చేరారు. రెండు రోజుల కింద నాగర్​ కర్నూల్​ మున్సిపాలిటీలో ఏడుగురు బీఆర్ఎస్​ కౌన్సిలర్లు పార్టీకి రిజైన్​ చేసి కాంగ్రెస్​లో చేరారు. మరో 8 మంది త్వరలో కాంగ్రెస్​లో చేరుతారని తెలిసింది.నాగర్​ కర్నూల్​ నియోజకవర్గంలో బీఆర్ఎస్​కు ముగ్గురు, కాంగ్రెస్​కు ఇద్దరు జడ్పీటీసీలు ఉన్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్​కు ముందు బిజినేపల్లి జడ్పీటీసీ కాంగ్రెస్​లో చేరారు. మిగిలిన ఇద్దరు జడ్పీటీసీలు, ఎంపీపీలు బీఆర్ఎస్​లో ఉంటారా? లేక కాంగ్రెస్​లో చేరుతారా? అనే చర్చ మొదలైంది. 

దిక్కుతోచని లోకల్​ లీడర్లు..

మర్రి జనార్దన్​రెడ్డి, జక్కా రఘునందన్ రెడ్డిపై ఆధారపడి రాజకీయం చేస్తున్న ద్వితీయ శ్రేణి లీడర్లు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు భవిష్యత్​ ఏమిటో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. నాగర్​ కర్నూల్​ మున్సిపాలిటీలో బీఆర్ఎస్​కు చెందిన 10 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధంగా ఉన్నా, వీరిలో ఆరుగురిని చేర్చుకోవడానికి ఎమ్మెల్సీ దామోదర్​రెడ్డి అంగీకరించడం లేదని సమాచారం.

వీరిని చేర్చుకుంటే ప్రజల నుంచి వ్యతిరేకత మూటకట్టుకోవాల్సి వస్తుందన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. బీఆర్ఎస్​లో ఉండి పదేండ్లు రియల్,​ ఇసుక, మట్టి, కల్లు దందాల్లో ఆరితేరిన లీడర్లు షెల్టర్, సెక్యూరిటీ కోసం కాంగ్రెస్​లో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఐదుగురు ఎంపీపీల్లో ఎంతమంది బీఆర్ఎస్​లో ఉంటారు? ఎందరు కాంగ్రెస్​లోకి వెళ్తారనే చర్చ మొదలైంది. ఇదిలాఉంటే నాగర్​ కర్నూల్​ నియోజకవర్గం ఎఫెక్ట్​ జిల్లాలోని మిగిలిన మూడు నియోజకవర్గాలపై ఎంత వరకు ఉంటుందనే చర్చ జరుగుతోంది.

బీఆర్ఎస్​కు నాగమే దిక్కు..

బీఆర్ఎస్  ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలు, ప్రజాక్షేత్రంలో పోరాడిన మాజీ మంత్రి నాగం జనార్దన్​రెడ్డి ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ నుంచి బీఆర్ఎస్​లోకి మారారు. మాజీ ఎమ్మెల్యే మర్రి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్​లో చేరుతుండడంతో, నాగర్​కర్నూల్​లో కారుకు నాగం జనార్దన్​రెడ్డి, ఆయన కొడుకు శశిధర్​రెడ్డి పెద్ద దిక్కుగా మిగలనున్నారు.

రేవంత్​ నాయకత్వంలోనే..

వస్త్ర వ్యాపారం చేసుకునే మర్రి జనార్దన్​రెడ్డి 2012లో రేవంత్​రెడ్డి నాయకత్వంలో టీడీపీలో చేరి నాగర్​ కర్నూల్​ బై ఎలక్షన్స్​లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీఆర్ఎస్​లో చేరి 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. జిల్లాలోని మెజార్టీ గ్రామ పంచాయితీలు, మండల పరిషత్ లు, జడ్పీటీసీలు, పీఏసీఎస్​లు, మున్సిపాలిటీలు దక్కించుకున్నారు. కేసీఆర్, కేటీఆర్​తో ఉన్న చనువుతో జిల్లాలో ఆధిపత్యం చెలాయించారు. కాంగ్రెస్​లో చేరి మల్కాజ్​గిరి పార్లమెంట్​ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన మర్రి జనార్దన్​రెడ్డి ఇప్పటికే రెండుసార్లు కాంగ్రెస్​ అగ్రనాయకులతో చర్చించినట్లు సమాచారం. కాంగ్రెస్​ మూడో లిస్ట్​కు ముందే కాంగ్రెస్​లో చేరడం, ఎంపీ టికెట్​ దక్కించుకోవడం ఖాయమనే ప్రచారం సాగుతోంది.