భువనగిరి ఎంపీ సీటు గెలిపించి మోదీకి గిఫ్ట్ ఇయ్యాలె : బూర నర్సయ్య గౌడ్

భువనగిరి ఎంపీ సీటు గెలిపించి మోదీకి గిఫ్ట్ ఇయ్యాలె : బూర నర్సయ్య గౌడ్

కొమురవెల్లి, వెలుగు: భువనగిరి ఎంపీ సీటు గెలిపించి పీఎం మోదీకి గిఫ్ట్ ఇవ్వాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కొమురవెల్లిలో బీజేపీ సిద్దిపేట, జనగామ జిల్లాల అధ్యక్షులు మోహన్ రెడ్డి, దశమంతరెడ్డిలతో కలిసి మల్లికార్జున స్వామిని దర్శించుకొని విజయ సంకల్ప యాత్రను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి ప్రధాన మంత్రి నరేంద్రమోదీతోనే సాధ్యమన్నారు. మాజీ సీఎం కేసీఆర్​, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు తిరుగుతున్న అద్దంలాంటి రోడ్లు కేంద్ర ప్రభుత్వం వేసినవే అన్నారు. కొమురవెల్లికి రైల్వే స్టేషన్ ఇచ్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు.  80 రోజుల్లో కాంగ్రెస్సోళ్ల మాటలు కోటలు దాటాయ్​చేతలు మాత్రం గడప దాటలేదని విమర్శించారు. బీజేపీ నాయకులు గడపకు గడపకు తిరిగి ప్రచారం చేయాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉమారాణి, సురేశ్, రాందాస్, లక్ష్మారెడ్డి, కర్ణాకర్, మల్లేశం పాల్గొన్నారు.

రెవెన్యూ డివిజన్​ ఏర్పాటు చేయిస్తా

చేర్యాల: భువనగిరి ఎంపీ సీటును మోదీకి అందిస్తే చేర్యాల రెవెన్యూ డివిజన్​ఏర్పాటు చేయిస్తానని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హామీ ఇచ్చారు. శుక్రవారం చేర్యాల పట్టణంలో నిర్వహించిన రోడ్ షో లో ఆయన మాట్లాడారు. మోదీ నాయకత్వంలో దేశ వ్యాప్తంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందాయని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ మోదీ ప్రభుత్వం ఏర్పడబోతుందన్నారు. 

బీఆర్ఎస్ రద్దయ్యే పార్టీ అని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే పార్టీ కాదని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీజేపీ సిద్దిపేట, జనగామ జిల్లాల అధ్యక్షులు మోహన్ రెడ్డి, దశమంత రెడ్డి, నాయకులు పాపారావు, కేవీఎల్​ఎన్​రెడ్డి, ఉమారాణి, సురేశ్ గౌడ్, చక్రధర్, పాండు పాల్గొన్నారు.