కాంగ్రెస్​లో పొంగులేటి చేరిక లాంఛనమే.. సీట్లపైనే సస్పెన్స్

కాంగ్రెస్​లో పొంగులేటి చేరిక లాంఛనమే.. సీట్లపైనే సస్పెన్స్
  • భట్టి, రేణుకా అభ్యంతరం?
  • సర్వే ప్రకారమే టికెట్లు ఇస్తామంటున్న పీసీసీ చీఫ్
  • 25న ఢిల్లీలో రాహుల్ గాంధీతో శ్రీనివాస్​ రెడ్డి భేటీ 
  • వచ్చే నెల 2న ఖమ్మంలో 
  • భారీ బహిరంగ సభ

ఖమ్మం, వెలుగు: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి కాంగ్రెస్​లో చేరడం ఖాయమైపోయింది. ఇప్పటికే ఆయన నిర్ణయం తీసుకున్నా, కేవలం బహిరంగంగా ప్రకటించడం మాత్రమే మిగిలి ఉంది. ఈనెల 25న ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో పొంగులేటి సమావేశం కానున్నారు. అదే రోజు లాంఛనంగా ఆ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించనున్నారు. వచ్చే నెల 2న ఖమ్మంలో భారీ బహిరంగ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనిపై ఇప్పటికే ముఖ్య అనుచరులకు పొంగులేటి స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఖమ్మం నుంచి వైరా వెళ్లే ప్రధాన రహదారిపై ఎస్ఆర్ గార్డెన్స్​ వెనుక ఉన్న పొంగులేటికి చెందిన 100 ఎకరాల సొంత స్థలంలోనే మీటింగ్ జరిగే అవకాశం ఉంది.

పొంగులేటి తన ఇద్దరు పిల్లల పెండ్లిళ్ల రిసెప్షన్​నూ ఇక్కడే నిర్వహించారు. ఖమ్మం నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని కూడా ఇక్కడే జరిపారు. ఖమ్మంలో జనవరిలో జరిగిన బీఆర్ఎస్ ​ఆవిర్భావ సభను మించిన స్థాయిలో పబ్లిక్​ మీటింగ్ పెట్టి, ఖమ్మం గడ్డపైనే వేరే పార్టీలో చేరతాను తప్ప ఢిల్లీలోనో, హైదరాబాద్​ లోనో కండువా కప్పుకోబోనని ఇప్పటికే ఒకట్రెండు సార్లు పొంగులేటి ప్రకటించారు. దీంతో పబ్లిక్​ మీటింగ్ కోసం సొంత ప్లేస్​లోనే ఏర్పాట్లు చేస్తారని తెలుస్తోంది. 

మధిర, భద్రాచలం కాకుండా మిగిలినవి ఇవ్వండి 

కాంగ్రెస్​లో పొంగులేటి ఎంట్రీ ఫిక్స్ అయినప్పటికీ, ఇంకా సీట్ల సర్దుబాటుపై మాత్రం స్పష్టత రాలేదు. ఉమ్మడి ఖమ్మం పొంగులేటి జిల్లాలో మెజార్టీ సీట్లు కోరుతున్నారని, దీనికి ఇప్పటికే కాంగ్రెస్​లో ముఖ్య నేతలుగా ఉన్న సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ కేంద్రమంత్రి రేణుకాచౌదరి అభ్యంతరాలు చెబుతున్నారని ప్రచారం జరిగింది. ప్రస్తుత సిట్టింగ్ స్థానాలైన మధిర, భద్రాచలం మినహా మిగిలిన 8 స్థానాలను తన అనుచరుల కోసం కోరుతున్నట్టు తెలుస్తోంది. సెగ్మెంట్ల వారీగా చూసుకుంటే వైరాలో తన వర్గం అభ్యర్థిగా గతంలో విజయాబాయిని పొంగులేటి ప్రకటించారు. అక్కడ రామ్మూర్తి నాయక్​, రాందాస్ ​నాయక్ ​రేసులో ఉన్నారు. సత్తుపల్లిలో రిటైర్డ్ ఉద్యోగి సుధాకర్​ పొంగులేటి వర్గంలో ఉండగా, రీసెంట్ గా పొంగులేటి వర్గం నుంచి కాంగ్రెస్​ లో చేరిన మట్టా దయానంద్, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్​, మానవతారాయ్​ టికెట్ ఆశిస్తున్నారు.

పొంగులేటి వియ్యంకుడు రామసహాయం రఘురామిరెడ్డి పాలేరు లేదా మహబూబాబాద్​ జిల్లా పాలకుర్తి టికెట్​ ఆశిస్తున్నట్టు సమాచారం. ఈయన సీనియర్​ కాంగ్రెస్​ నేత, నాలుగు సార్లు ఎంపీగా, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన రామసహాయం సురేందర్ రెడ్డి ఏకైక కుమారుడు. 2014లో కూడా ఎమ్మెల్సీగా, 2014, 18లో కాంగ్రెస్​ నుంచి పాలేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘురామిరెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు, పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్ది శ్రీనివాసరెడ్డి​ టికెట్ కోరుతున్నారు. ఇక ఖమ్మం నుంచి స్వయంగా పొంగులేటి పోటీలో ఉంటారని తెలుస్తోంది. ఇక్కడ నగర కాంగ్రెస్​అధ్యక్షుడు జావెద్ తో పాటు ఒకరిద్దరు టికెట్ అడుగుతున్నారు. 

ఖర్గేను కలిసిన రేణుకా చౌదరి 

కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి ఆధ్వర్యంలో గురువారం కాంగ్రెస్ నేతలు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలవడం ఆసక్తికరంగా మారింది. గతంలో పొంగులేటి ప్రధాన అనుచరుడిగా ఉండి, ఆయనకంటే ముందే కాంగ్రెస్ లో చేరి సత్తుపల్లి టికెట్ ఆశిస్తున్న మట్టా దయానంద్, వైరా టికెట్ ఆశిస్తున్న రామ్మూర్తి నాయక్, ఖమ్మం కార్పొరేటర్ ముస్తఫా, ఇతర నేతలు ఖర్గేను కలిసిన వారిలో ఉన్నారు. పొంగులేటి టీమ్ కు ఎక్కువ సీట్లు కోరుతున్నారనే ప్రచారాల 
నేపథ్యంలో ఈ భేటీ చర్చనీయాంశంగా మారింది. తమ సీట్లు తమకు ఇవ్వాలని లీడర్లు కోరినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇల్లందు కాంగ్రెస్ నేతలు కూడా చీమల వెంకటేశ్వర్లు అధ్వర్యంలో పొంగులేటికి వ్యతిరేకంగా ఇటీవల పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. పార్టీని మోసం చేసి బయటకు వెళ్లిన కోరం కనకయ్యకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వొద్దని కోరారు.

కొత్తగూడెం నుంచి పొంగులేటి?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం సీటు కూడా జనరల్ స్థానమే కావడంతో అక్కడ పొంగులేటి పోటీ చేసే అవకాశం కూడా ఉండొచ్చని సమాచారం. కాంగ్రెస్​నుంచి ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, సీనియర్ నేత యడవెల్లి కృష్ణ కొత్తగూడెం సీటుపై ఆశలు పెట్టుకున్నారు. అశ్వారావుపేటలో జారే ఆదినారాయణ కోసం పొంగులేటి సీటు అడుగుతుండగా, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు రేసులో ఉన్నారు. పినపాకలో మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును, ఇల్లందులో ప్రస్తుత జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్యను తన అభ్యర్థిగా పొంగులేటి ప్రకటించారు. ఈ రెండు సీట్లలో కాంగ్రెస్​కు బలమైన అభ్యర్థుల్లేరు. భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు పోదెం వీరయ్య, మధిరలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సిట్టింగ్ సీటు కావడంతో ఈ సెగ్మెంట్లను పొంగులేటి కోరడం లేదని సమాచారం. అయితే భద్రాచలంలో తెల్లం వెంకట్రావు, మధిరలో డాక్టర్ ​కోట రాంబాబు పొంగులేటి టీమ్​లో ఉన్నారు. మరోవైపు మాజీ ఎస్సీ కార్పొరేషన్​చైర్మన్​ పిడమర్తి రవి 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్​ తరపున సత్తుపల్లిలో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం పొంగులేటి వెంట ఉన్న ఈయన కంటోన్మెంట్, లేదా తుంగతుర్తి సీటు కోరుతున్నట్టు తెలుస్తోంది.

బీఆర్​ఎస్​ నేత వేముల వీరేశం కోసం కూడా నకిరేకల్​ స్థానాన్ని అడుగుతున్నట్టు సమాచారం.  అయితే, పీసీసీ చీఫ్ ​రేవంత్ రెడ్డి మాత్రం ఇటీవల ఒకట్రెండు సందర్భాల్లో పార్టీ టికెట్ల కేటాయింపుపై స్పష్టతనిచ్చారు. సర్వేల ఆధారంగా గెలిచే అభ్యర్థులకే సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. గురువారం పొంగులేటితో మీటింగ్ తర్వాత మీడియాతో మాట్లాడిన సమయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడా ఇదే అంశాన్ని మరోసారి చెప్పారు. దీంతో టికెట్ల విషయంలో పొంగులేటి పట్టుదలకు పోవడం లేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.