పొంగులేటికి కొత్త తలనొప్పులు.. ఎన్టీఆర్ విగ్రహం చుట్టే రాజకీయాలు

పొంగులేటికి కొత్త తలనొప్పులు.. ఎన్టీఆర్ విగ్రహం చుట్టే రాజకీయాలు

దోస్తీ అంటేనే తోడుండడం. అవసరమైనప్పుడు అండగా ఉండడమే అసలైన దోస్తీ. అయితే.. ఒక్కోసారి దోస్తీ కూడా తిప్పలు తెచ్చిపెట్టే అవకాశం పాలిటిక్స్ లోనే ఉంటుంది. ఖమ్మం జిల్లా రాజకీయంలో సొంత దారిలో పోతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కొత్త తలనొప్పులు తప్పట్లేదంటున్నారు ఆయన సన్నిహితులు. అటు జగన్ తో దోస్తీ, ఇటు ఎన్టీఆర్ విగ్రహం గొడవ ఆయనకు ఇబ్బందేనన్న టాక్ నడుస్తోంది.

మొన్న ఎన్టీఆర్ విగ్రహం గొడవ ఆయనకు వ్యతిరేకంగా జరగలేదు. కృష్ణుడి రూపంలో వద్దని ఇటు ఇస్కాన్, అటు యాదవ సంఘాలు అభ్యంతరం చెప్పాయి. అయితే.. దీన్ని పొంగులేటి టార్గెట్ గా మంత్రి పువ్వాడ వర్గం బాగానే ఉపయోగించుకుంది. గొడవకు పొంగులేటే కారణం అంటూ కొందరు నిరసనలు చేశారు. పొంగులేటి ఎన్టీఆర్ కు నివాళులర్పించాక ఆయన విగ్రహాన్ని శుద్ధి చేశారు. ఇదంతా మంత్రి పువ్వాడే చేయించారన్న టాక్ నడుస్తోంది. 

ఖమ్మం పాలిటిక్స్ లో అన్ని పార్టీల్లోనూ మొదటి నుంచి కమ్మ కులం కీలకంగా ఉంది. వారిని ఆకట్టుకోవడానికి ఎలక్షన్ ఏడాదిలో రాజకీయంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఎన్టీఆర్ విగ్రహం వివాదాన్ని పొంగులేటి టార్గెట్ గా మలుపుతున్నారని ఆయన అనుచరులు అంటున్నారు.

ఇదంతా ఒక ఎత్తైతే ఏపీ సీఎం వైఎస్ జగన్ తో పొంగులేటికి ఉన్న దోస్తీ కూడా ఖమ్మంలో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి 2014లో వైఎస్సార్ పార్టీ నుంచే పొంగులేటి ఎంపీగా గెలిచారు. తర్వాతే టీఆర్ఎస్ లోకి మారారు. పార్టీ మారినా జగన్ తో దోస్తీ కొనసాగింది. ఏపీలో పొంగులేటికి చాలా కాంట్రాక్టు పనులు కూడా అప్పగించారు. ఇంత వరకు ఇబ్బంది లేదుగానీ... ఏపీలో జగన్ కమ్మ కులాన్ని టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలే ఖమ్మం పాలిటిక్స్ లో ఎఫెక్ట్ చూపిస్తాయన్న చర్చ జరుగుతోంది. ఇదే పాయింట్ ను పొంగులేటి టార్గెట్ గా ప్రత్యర్థి వర్గం బాగా ప్రచారం చేస్తోంది. 

మరోవైపు పొంగులేటి టార్గెట్ గా పువ్వాడ వర్గం విమర్శలు చేస్తుంటే.. ఇటు బీఆర్ఎస్ టార్గెట్ గా టీడీపీ కూడా రంగంలోకి దిగింది. టీడీపీనే లేకుండా చేసే కుట్ర అటు ఏపీలో జగన్, ఇటు తెలంగాణలో కేసీఆర్ చేస్తున్నారని ప్రచారం చేస్తోంది. ఏదేమైనా కులం అంశం తెరపైకి రావడం కొంత ఇబ్బందికరమేనని  పొంగులేటి వర్గం నేతలు అంటున్నారు. లోకల్ గా మరో ఇంట్రెస్టింగ్ చర్చ కూడా జరుగుతోంది. పొంగులేటి టార్గెట్ గా ప్రచారం చేస్తున్న పువ్వాడ కూడా గతంలో జగన్ అనుచరుడే కావడం. జగన్ తోనే నా జీవితం అని అప్పట్లో పువ్వాడ స్టేట్ మెంట్లు కూడా ఇచ్చారు. దీంతో రాజకీయంలో అవసరమైనప్పుడే కులం గుర్తొస్తుందని స్థానిక లీడర్లు కామెంట్ చేస్తున్నారు.