
టీమిండియా పేసర్ బుమ్రాపై పాక్ మాజీ పేసర్ అబ్దుల్ రజాక్ అక్కసు వెళ్లగక్కాడు. షాహీన్ అఫ్రిదీని పొగిడేందుకు బుమ్రాపై కారు కూతలు కూశాడు. పాక్ కు చెందిన ఓ వార్త సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన రజాక్..బుమ్రా, షాహీన్ ను పోలుస్తూ కామెంట్స్ చేశాడు. అబ్దుల్ రజాక్ కామెంట్స్ వైరల్ కావడంతో బుమ్రా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
షాహీన్ అఫ్రిదీ అద్భుతమైన బౌలర్..అని బుమ్రా అతని దరిదాపుల్లో కూడా లేడని వ్యాఖ్యానించాడు. షాహీన్ అఫ్రిదీ ట్యాలెంటెడ్ ప్లేయర్ అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు బుమ్రాను బేబీ బౌలర్ అనేశాడు. తాను వసీం అక్రమ్, మెక్ గ్రాత్ వంటి మేటీ బౌలర్లను ఎదుర్కొన్నానని..తన ముందు బుమ్రా పిల్ల బౌలర్ అంటూ అవమానించాడు. తాను ఆడితే మాత్రం బుమ్రాకు చుక్కలు చూపించేవాడినని చెప్పాడు.
టీమిండియా పేసర్ బుమ్రా ప్రస్తుతం వెన్నునొప్పితో బాధపడుతూ జాతీయ జట్టుకు దూరమయ్యాడు. గాయం కారణంగా ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ లోనూ ఆడలేదు. ప్రస్తుతం కోలుకుంటున్న బుమ్రా ఆసీస్ తో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి రెండు టెస్టుల వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
పాక్ పేసర్ షాహీన్ అఫ్రిదీ కూడా గాయం కారణంగా పాక్ జట్టుకు దూరమయ్యాడు. మోకాలి గాయంతో ఆసియా కప్‌లోనూ ఆడలేదు. అయితే టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం ఆడాడు. ఫైనల్‌లో మరోసారి గాయం తిరగబెట్టడంతో జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న షాహీన్ అఫ్రిదీ..పాకిస్తాన్ సూపర్ లీడ్ సమయానికి అందుబాటులోకి వచ్చే ఛాన్సుంది.