
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త స్పోర్ట్స్ పాలసీ లోపభూయిష్టంగా ఉందని శాట్ మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి విమర్శించారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ వంటి ప్రతిష్ఠాత్మక పోటీలకు క్రీడాకారులను సన్నద్ధం చేసేందుకు అవసరమైన హైపెర్ఫామెన్స్ అకాడమీల స్థాపనపై స్పోర్ట్స్ పాలసీలో కనీస ప్రస్థావన లేదని ప్రశ్నించారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా పెంపు, ఒలింపిక్స్, ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన వారికి నేరుగా ఉద్యోగాలిచ్చే విధానంపై పాలసీలో కానరాకపోవడం విచారకరమన్నారు. ప్రస్తుతం శాట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కోచ్‌ల క్రమబద్ధీకరణ, కొత్త కోచ్‌ల నియామకం గురించి ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు.