అధికారం వస్తే అత్యాశ పుడుతుందా?: సుప్రీం మాజీ న్యాయమూర్తి

అధికారం వస్తే అత్యాశ పుడుతుందా?: సుప్రీం మాజీ న్యాయమూర్తి

బెంగళూరు: ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పట్ల తాను పూర్తిగా నిరాశకు గురయ్యానని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎన్ సంతోష్ హెగ్డే అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అత్యాశ ఎక్కువ అవుతుందనే విషయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. " అర్వింద్ కేజ్రీవాల్ పట్ల నేను పూర్తిగా నిరాశకు గురయ్యాను. ఆప్ పరిపాలనాపరమైన న్యాయాన్ని తెస్తుందని అనుకున్నాను. 

కానీ అలా జరగలేదు. సంపూర్ణ అధికారం మనిషిని పూర్తిగా భ్రష్టుపట్టిస్తుందనే దానికి కేజ్రీవాల్ అరెస్ట్ ఒక సూచన.ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్ ఉద్యమం తర్వాత అందులో పాల్గొన్న నేతలతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అవతరించింది. నేను దాని నుంచి బయటకు వచ్చేశాను. రాజకీయాలు అవినీతికి అడ్డాగా ఉండటమే అందుకు ప్రధాన కారణం. అవినీతి నుంచి ఏ రాజకీయ పార్టీకి విముక్తి లేదు. రాజకీయాలకు దూరంగా ఉంటూ అవినీతిని క్లీన్ చేయడానికి ప్రయత్నించాలన్నదే మా సూత్రం. అయితే, కొందరు రాజకీయాల్లోకి వెళ్లి అవినీతిని అంతం చేయాలనుకున్నారు. అది ఎప్పటికీ విజయవంతం కాదని నేను అప్పడే అనుకున్నాను. కేజ్రీవాల్ అరెస్టుతో అది సరైనదేనని భావిస్తున్నాను" అని హెగ్డే వివరించారు.