
- శంకుస్థాపన చేసిన హైకోర్టు చీఫ్‌జస్టిస్
- ఏడాదిన్నరలో అందుబాటులోకి..
మంచిర్యాల, వెలుగు: ఇరవై ఏండ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న మంచిర్యాల జిల్లా కోర్టులకు మరో ఏడాదిన్నరలో కొత్త బిల్డింగులు అందుబాటులోకి రానున్నాయి. నస్పూర్‌లోని ఐడీఓసీ సమీపంలో ఐదెకరాల్లో ఇంటిగ్రేటెడ్కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి శనివారం హైకోర్టు చీఫ్జస్టిస్అపరేశ్ కుమార్‌సింగ్ హైదరాబాద్ నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
జిల్లా అడ్మినిస్ట్రేటివ్జడ్జి నగేశ్ భీమపాక, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్‌జడ్జి ఎ.వీరయ్య, కలెక్టర్ కమార్ దీపక్, డీఎఫ్‌వో శివ్ ఆశిష్ సింగ్, బార్అసోసియేషన్ ప్రెసిడెంట్బండవరపు జగన్, జనరల్ సెక్రటరీ కె.మురళీకృష్ణతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి భూమిపూజలో పాల్గొన్నారు. సీజే మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లా ప్రజలకు ఒకే చోట అన్ని రకాల న్యాయస్థాన సేవలు అందించనున్నట్లు తెలిపారు.
2027 జూన్ నాటికి..
నస్పూర్‌లోని సర్వే నంబర్42లో మూడేండ్ల కిందట అప్పటి కలెక్టర్ భారతి హోళికేరి 5 ఎకరాల 4 గుంటల గవర్నమెంట్ ల్యాండ్‌ను కోర్టు కాంప్లెక్స్ కోసం కేటాయించారు. ఆ జాగపై కొంతమంది కోర్టుకు వెళ్లడంతో ఆలస్యం జరిగింది. హైకోర్టులో కేసు వీగిపోవడంతో ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. జిల్లా కోర్టుల నిర్మాణానికి రూ.81 కోట్లు మంజూరు చేయగా, హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రైవేట్కన్స్ట్రక్షన్ కంపెనీ టెండర్ దక్కించుకుంది.
ప్రస్తుతం జిల్లాలో పది కోర్టులు ఉన్నాయి. మరో మూడు కోర్టుల కోసం ప్రభుత్వానికి ప్రపోజల్స్ వెళ్లాయి. దీంతో ఈ సముదాయంలో మొత్తం 12 కోర్టు భవనాలను నిర్మిస్తున్నారు. అలాగే జ్యుడీషియల్ఆఫీసర్స్ క్వార్టర్స్ కోసం ఎకరం స్థలాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ కేటాయించారు. మరో ఎకరంన్నర జాగా త్వరలోనే కేటాయిస్తామన్నారు. ఈ భవనాలు వచ్చే 2027 జూన్‌లోగా అందుబాటులోకి రానున్నాయి.
తీరనున్న సమస్యలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిపాలన సౌలభ్యం కోసం 2004లో మంచిర్యాలలో మొదటి కోర్టు ఏర్పాటైంది. ఆ తర్వాత క్రమంగా కోర్టుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 2022లో జిల్లా కోర్టులను విభజించారు. కానీ వాటికి సొంత భవనాలు లేకపోవడంతో స్థానిక మారుతినగర్‌లోని ప్రైవేట్బిల్డింగుల్లో నిర్వహిస్తున్నారు. దీంతో కోర్టులకు సొంత భవనాలు నిర్మించాలని న్యాయవాదులు గత 20 ఏండ్లుగా పోరాడుతున్నారు. ఈ క్రమంలో మొదట మంచిర్యాల రాముని చెరువు సమీపంలో ఎకరం 10 గుంటల స్థలాన్ని కేటాయించారు.
అది ఎఫ్ టీఎల్ పరిధిలోకి వస్తుందని ఇరిగేషన్ అధికారులు అభ్యంతరం తెలిపారు. తరువాత కాలేజీ రోడ్‌లోని భూదాన్ భూముల్లో ఐదెకరాలు కేటాయించారు. అది గోదావరి పరివాహక ప్రాంతం కావడం, భవన నిర్మాణాలకు సాయిల్అనుకూలంగా లేకపోవడంతో బ్రేక్‌పడింది. ఇలా అనేక అడ్డంకులను దాటుకుంటూ ఎట్టకేలకు ఇంటిగ్రేటెడ్ కోర్టు బిల్డింగుల నిర్మాణం జరుగుతుండడంతో న్యాయవాదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆనందంగా ఉంది
మంచిర్యాలలో ప్రస్తుతం పది కోర్టులు ఉన్నాయి. మరో మూడు కోర్టుల కోసం ప్రభుత్వానికి ప్రపోజల్స్వెళ్లాయి. గత ఇరవై ఏండ్లుగా కోర్టు భవనాల కోసం న్యాయవాదులు పోరాడుతున్నారు. స్థల సమస్యలతో ఇన్నాళ్లు ఆలస్యమైంది. ఎట్టకేలకు ఇంటిగ్రేటెడ్ కోర్టు బిల్డింగ్స్‌కు శంకుస్థాపన జరగడం ఆనందంగా ఉంది. మరో ఏడాదిన్నరలో కోర్టు భవన సముదాయం అందుబాటులోకి రానుంది.- బండవరపు జగన్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్