డిజిటల్ బ్యాంకింగ్​తో సేవలు మరింత ఈజీ

డిజిటల్ బ్యాంకింగ్​తో సేవలు మరింత ఈజీ

న్యూఢిల్లీ : మనదేశంలో 2014కు ముందు 'పొలిటికల్​ ఫోన్ బ్యాంకింగ్' ఉండేదని, దాని స్థానంలో 'డిజిటల్ బ్యాంకింగ్'ను తేవడం ద్వారా బీజేపీ ప్రభుత్వం భారతదేశ స్థిరమైన ఆర్థిక వృద్ధికి పునాదులు వేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. గత యూపీఏ పాలన గురించి ప్రస్తావిస్తూ బ్యాంకులు ఎవరికి, ఎంత అప్పులు ఇవ్వాలి.. అనే విషయాలను అప్పటి నాయకులు బ్యాంకులకు ఫోన్​ చేసి చెప్పేవారని ఆరోపించారు. “ఏ దేశ ఆర్థిక వ్యవస్థకు అయినా దాని బ్యాంకింగ్ వ్యవస్థ ఎంత బలంగా ఉంటే అంత మంచిది. అది పటిష్టంగా ఉంటేనే దేశం ముందుకు వెళ్తుంది” అని  ప్రధాని మంత్రి అన్నారు. వీడియో- కాన్ఫరెన్స్ ద్వారా 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను (డీబీయూ) జాతికి అంకితం చేసిన తర్వాత మాట్లాడుతూ, 2014కు ముందు ఉన్న 'ఫోన్ బ్యాంకింగ్' వ్యవస్థ నుంచి డిజిటల్ బ్యాంకింగ్‌‌కు మారడం వల్ల భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిరంతరంగా ముందుకు సాగుతోందని  కామెంట్​ చేశారు. 2014కు ముందు నాయకుల ‘ఫోన్​ బ్యాంకింగ్’  వల్ల బ్యాంకులకు ఎంతో నష్టం కలిగిందని, రూ.వేల కోట్ల కుంభకోణాలకు బీజం వేసి దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని మోడీ పేర్కొన్నారు. 2014 మేలో బీజేపీ నేతృత్వంలోని  ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం పారదర్శకతపై దృష్టి సారించి బ్యాంకింగ్ వ్యవస్థను మార్చిందని ప్రధాన మంత్రి అన్నారు. "ఎన్‌‌పీఏల గుర్తింపులో పారదర్శకత తీసుకొచ్చి వాటిని తిరిగి వసూలు చేశాం. లక్షల కోట్ల రూపాయలను బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి తీసుకొచ్చాం. బ్యాంకులకు మూలధనాన్ని సమకూర్చాం. ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై చర్యలు తీసుకున్నాం.  అవినీతి నిరోధక చట్టాన్ని సంస్కరించాం.  దివాలా కోడ్ (ఐబీసీ) అమలు బ్యాంకుల మొండిబాకీల (ఎన్‌‌పీఏ) పరిష్కారానికి సాయపడింది. డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లు,  ఫిన్‌‌టెక్  టెక్నాలజీల వంటి కొత్త కార్యక్రమాల ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థ కోసం ‘సొంతగా ఎదగగల యంత్రాంగాన్ని’(సెల్ఫ్​డ్రివెన్​) సృష్టించాం. దీనివల్ల వినియోగదారులకు, బ్యాంకులకు  ఎంతో సౌలభ్యం ఉంటుంది" అని ఆయన అన్నారు. 

అన్ని చోట్లా బ్యాంకు సేవలు
గతంలో ప్రజలు బ్యాంకుల్లో క్యూలు కట్టిన రోజులను గుర్తుచేస్తూ, తమ ప్రభుత్వం బ్యాంకులను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఆ విధానాన్ని మార్చిందని అన్నారు. బ్యాంకింగ్ సేవలు చివరి మైలురాయికి చేరుకునేలా చూసేందుకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని మోడీ చెప్పారు. గ్రామాల్లోని చిన్న వ్యాపారులు పూర్తిగా డిజిటల్ లావాదేవీల వైపు మళ్లాలని ప్రధాన మంత్రి కోరారు. దేశ ప్రయోజనాల కోసం పూర్తిగా డిజిటల్‌‌గా మారేందుకు వ్యాపారులను తమతో అనుసంధానం చేసుకోవాలని బ్యాంకులకు సూచించారు.  బ్యాంకింగ్ వ్యవస్థ ఆర్థిక లావాదేవీలకు మాత్రమే పరిమితం కాకుండా సుపరిపాలన, మెరుగైన సేవలు అందించే వ్యవస్థగా మారిందని మోడీ వివరించారు. మన డిజిటల్ ఎకానమీ.. మన ఆర్థిక వ్యవస్థకు, మన స్టార్టప్ ప్రపంచానికి, మేక్ ఇన్ ఇండియాకు గొప్ప బలమని పీఎం కామెంట్​ చేశారు. టెక్నాలజీ, ఆర్థిక వ్యవస్థల కలయిక అవినీతిని నిర్మూలించడంలో సహాయపడిందని, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌‌ఫర్ (డీబీటీ) పథకం ద్వారా ప్రభుత్వం 25 లక్షల కోట్ల రూపాయలను నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేసిందని ఆయన అన్నారు. పీఎం- కిసాన్ పథకం కింద మరో విడత డబ్బును సోమవారం బదిలీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద, అర్హులైన రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక ప్రయోజనం అందిస్తారు. రూ. 2,000 చొప్పున మూడు సమాన వాయిదాలలో చెల్లిస్తారు.  బ్లాక్‌‌చెయిన్ టెక్నాలజీ ఆధారంగా డిజిటల్ కరెన్సీని ప్రారంభించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ డిజిటల్​ రూపాయి వల్ల పొదుపు పెరిగి, ఫిజికల్​ కరెన్సీ వాడకం తగ్గుతుందని చెప్పారు. పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని ఆయన అన్నారు.  కరెన్సీ ముద్రణకు ఉపయోగించే కాగితం,  ఇంక్ దిగుమతి చేసుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. 

టెక్నాలజీని బాగా వాడుకుంటున్నం..
ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌ మాట్లాడుతూ.. అభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు టెక్నాలజీని వినియోగించుకోవడానికి ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. 2014లో తీసుకొచ్చిన జన్ ధన్ యోజన మొబైల్  ఆధార్ అనుసంధానం, డీబీటీ  వంటి అనేక ఇతర కార్యక్రమాలకు ఉపయోగపడిందని చెప్పారు.   యూపీఐ పేమెంట్స్​ సిస్టమ్​ భారతదేశానికి కొత్త అవకాశాలను తీసుకొచ్చిందని ప్రధాన మంత్రి అన్నారు. బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ, ఇనోవేషన్లను ఉపయోగించుకోవడంపై దృష్టి సారించామని ఆర్‌‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ సందర్భంగా అన్నారు. డీబీయూల స్థాపన దేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత పెంచడంలో ఒక అడుగు అని అన్నారు. ఇబ్బందులు లేకుండా బ్యాంకింగ్ లావాదేవీలను సులభతరం చేయడానికి, అందరికీ  ఆర్థిక సేవలు అందించేందుకు డీబీయూ సాయపడుతుందని దాస్​ వివరించారు. వీటితో సేవింగ్స్​, ఇన్వెస్ట్​మెంట్, ఇన్సూరెన్స్​, ప్రభుత్వ పథకాల ప్రయోజనాల వంటి సేవలు అందుతాయని చెప్పారు. చిన్న ఇండస్ట్రీలకు వేగంగా అప్పులు మంజూరు అవుతాయని అన్నారు.  డీబీయూలను విస్తరించేందుకు డిజిటల్ బిజినెస్ ఫెసిలిటేటర్లను,  వ్యాపార కరస్పాండెంట్లను నియమిస్తున్నామని చెప్పారు.