ఆక్సిజన్ సరఫరా లోపం.. నలుగురు కరోనా రోగుల మృతి

ఆక్సిజన్ సరఫరా లోపం.. నలుగురు కరోనా రోగుల మృతి
  • విజయనగరం మహారాజ ఆస్పత్రిలో ఘటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం మహారాజ ప్రభుత్వాసుపత్రిలో దారుణ ఘటన చోటు చేస జరిగింది. ఆక్సిజన్ కొరతతో నలుగురు కరోనా రోగులు చనిపోయారు. ఆక్సిజన్ సరఫరా నిలిచిపోవడంతో ఊపిరాడక విలవిలలాడుతూ కన్నుమూశారు. ఘటనపై మృతుల బంధువులు ఆందోళనకు దిగడంతో హాస్పిటల్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. కలెక్టర్ హరి జవహర్ లాల్ ఆస్పత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.
స్పందించిన ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి
మహారాజ హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరతపై స్పందించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి. ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన సాంకేతిక సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు. హాస్పిటల్ లో ఉన్న 15 మంది రోగులను తిరుమల ఆస్పత్రికి తరలిస్తున్నామని చెప్పారు. ఆక్సిజన్ సమస్యతో ఎవ్వరూ చనిపోకుండా చూస్తామన్నారు పుష్ప శ్రీవాణి. ఆక్సిజన్ సమస్య కారణంగా ఎవ్వరు మరణించే పరిస్థితి లేదన్నారు. మహారాజ హాస్పిటల్ ఘటనను వైద్య శాఖ మంత్రి ఆళ్ల నాని దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. పరిస్థితి ఇంకా సీరియస్ గా ఉంటే విశాఖకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తామని తెలిపారని ఆమె చెప్పారు. ప్రజలు ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాయంత్రానికి ఆక్సిజన్ సరఫరా సాంకేతిక సమస్య ను కూడా పరిష్కరిస్తామని, విజయనగరం జిల్లాలో అన్ని ఆస్పత్రులలోను ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టామని ఆమె వివరించారు.