దొరికిపోతామని ఎస్ఐని కారుతో ఢీకొట్టారు

దొరికిపోతామని ఎస్ఐని కారుతో ఢీకొట్టారు
  • విరిగిన సబ్​ ఇన్​స్పెక్టర్​ కాలు, తలకు తీవ్ర గాయాలు
  • పోలీసుల అదుపులో నిందితులు

వికారాబాద్​ జిల్లా, వెలుగు: కారులో గంజాయి .. ముందు చూస్తే పోలీసులు..దీంతో ఎక్కడ దొరికిపోతామో అన్న భయంతో పోలీసులను కారుతో ఢీకొట్టి పరార్ ​కావడానికి ప్రయత్నించారు నలుగురు వ్యక్తులు.ఈ ఘటనలో ఓ ఎస్​ఐ తీవ్రంగా గాయపడ్డాడు. వికారాబాద్​కు 4 కిలోమీటర్ల దూరంలోని అనంతగిరి కొండల్లో గురువారం తెల్లవారుజామున ఈ ఇన్సిడెంట్‌‌‌‌ జరిగింది. వికారాబాద్ ​నుంచి తాండూరు రూట్​లో డ్రంకెన్​ డ్రైవ్​ చేస్తున్నారన్న సమాచారంతో నవాబుపేట ఎస్ఐ కృష్ణ సిబ్బందితో కలిసి నందిఘాట్​ వద్ద తనిఖీలు చేస్తున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్​ టోలీచౌకికి చెందిన అన్వర్, నవీత్, సమీర్, ఇమ్రాన్‌‌‌‌​లు టీఎస్​ 07 యూహెచ్​ 0381 నంబర్​ కారులో గంజాయితో వికారాబాద్​ నుంచి కెరెల్లి వైపు వెళ్తున్నారు. పోలీసులను చూసి ఆగిపోయారు. ముందుకు వెళితే దొరికిపోతామనే భయంతో వెహికల్​ లైట్లను ఆఫ్​ చేశారు. వీరిని చూసిన ఎస్​ఐ కృష్ణ, సిబ్బంది ‘ఏయ్..కారు ఎందుకు ఆపారు’ అని ప్రశ్నిస్తూ వస్తుండగా స్పీడ్​ పెంచి ఎస్ఐని ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయారు. సిబ్బంది కారును వెంబడించి పట్టుకున్నారు. చెక్​ చేయగా 200 గ్రాములు గంజాయి దొరికంది. ప్రమాదంలో ఎస్ఐ కృష్ణ ఎడమ కాలు విరగడంతోపాటు తలకు తీవ్రంగా గాయమైంది. ఆయనను సికింద్రాబాద్‌‌‌‌లోని ఓ హాస్పిటల్​లో చేర్చారు.

మీ ధైర్యానికి సెల్యూట్: డీజీపీ మహేందర్​ రెడ్డి

గాయపడిన ఎస్​ఐ శ్రీకృష్ణ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని డీజీపీ మహేందర్​రెడ్డి ట్వీట్​చేశారు. గురువారం విషయం తెలుసుకున్న డీజీపీ ‘ఎన్ని అవరోధాలు ఎదురైనా, ప్రమాదాలకు గురైనా, వ్యక్తిగతంగా నష్టం జరిగినా, మొక్కవోని ధైర్యం, విశ్వాసంతో ప్రజలకు సేవ చేస్తున్నారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను’ అని స్పందించారు.