
- ఆకస్మికంగా తహసీల్ ఆఫీసును తనిఖీ చేసిన కలెక్టర్
- సమయానికి విధులకు రాకపోవడంతో డిప్యూటీ తహసీల్దార్, మరో ముగ్గురు ఉద్యోగులు సస్పెన్షన్
మునగాల, వెలుగు: మునగాల తహసీల్దార్ ఆఫీసులో విధులకు సమయానికి రాని నలుగురు ఉద్యోగులను కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సస్పెండ్ చేశారు. గురువారం మునగాల తహసీల్దార్ ఆఫీసును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం 10.30 కి ఆఫీసుకు వచ్చిన ఆయన సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. ఆఫీసులో18 మంది ఉద్యోగులకు నలుగురు ఇతర ఆఫీసుల్లో పని చేస్తుండగా, ఇద్దరు సెలవులపై ఉన్నారు.
మరో ఉద్యోగి సర్వే విధులకు వెళ్లారు. డిప్యూటీ తహసీల్దార్ డి. సత్యనారాయణ, ఎంపీఎస్ ఓ సంపత్, జూనియర్ అసిస్టెంట్ సునీల్ గవాస్కర్, రికార్డ్ అసిస్టెంట్ ప్రశాంత్ రిపోర్ట్ చేయలేదు. ఆఫీస్ సమయం దాటినప్పటికీ డ్యూటీకి రాకపోవడంపై ఆగ్రహించిన కలెక్టర్ గైర్హాజరైన వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయమై తహసీల్దార్ సరితను వివరణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది అందరూ సకాలంలో విధులకు హాజరుకావాలని, ఒకవేళ విధులకు గైర్హాజరైనా, ఆలస్యంగా వచ్చిన చర్యలు తప్పవని హెచ్చరించారు.