ఈ వారం దలాల్ స్ట్రీట్‌‌‌‌కు 4 ఐపీఓలు

ఈ వారం దలాల్ స్ట్రీట్‌‌‌‌కు 4 ఐపీఓలు

 ముంబై :  దలాల్​స్ట్రీట్‌లోకి ​మరో నాలుగు కంపెనీలు ఈ వారం అడుగుపెడుతున్నాయి. ఐపీఓల ద్వారా దాదాపు రూ.1,100 కోట్ల నిధులు సమీకరించనున్నాయి. వీటిలో ఒక ఎస్​ఎంఈ ఇష్యూ కూడా ఉంది. మరికొన్ని కంపెనీల లిస్టింగ్స్​ కూడా ఇదే వారంలో ఉన్నాయి.  

జ్యోతి సీఎన్​సీ ఆటోమేషన్ 

ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో మెయిన్‌‌‌‌బోర్డ్ సెగ్మెంట్ నుంచి ఇది మొదటి ఇనీషియల్‌ పబ్లిక్ ఆఫర్. ఇది జనవరి 9–-11 మధ్యకాలంలో సబ్‌‌‌‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది. ఒక్కో షేరు ధర రూ. 315–-331. రూ. వెయ్యి కోట్ల ఐపీఓలో కంపెనీ తాజా ఇష్యూ మాత్రమే ఉంది.  ఆఫర్- ఫర్ -సేల్ కాంపోనెంట్ లేదు. అందువల్ల, కంపెనీ మొత్తం ఇష్యూ ఆదాయాన్ని తన కోసం ఉపయోగించుకుంటుంది. రాజ్‌‌‌‌కోట్‌‌‌‌కు చెందిన ఈ మెటల్ -కటింగ్ కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్ (సీఎన్​సీ) మెషీన్ల తయారీదారు రూ. 475 కోట్లను అప్పులను తిరిగి చెల్లించడానికి,  మరో రూ. 360 కోట్లను దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఐపీఓ నిధులను ఉపయోగించుకుంటుంది.

ఐబీఎల్​  ఫైనాన్స్ 

స్మాల్​, మీడియం ఎంటర్‌‌‌‌ప్రైజ్ (ఎస్​ఎంఈ) విభాగంలో  ఐబీఎల్​ ఫైనాన్స్ ప్రస్తుత సంవత్సరంలో మొదటి ఐపీఓ అవుతుంది. ఇది కూడా జనవరి 9–-11 మధ్య రూ. 33.4 కోట్లను సమీకరించడానికి సబ్‌‌‌‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటుంది. ఇది ఫిక్స్​డ్​ప్రైస్​ ఇష్యూ. ఒక్కో షేరు ధరను రూ.51గా నిర్ణయించారు. ఈ ఫిన్‌‌‌‌టెక్ ఆధారిత ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌‌‌‌ఫారమ్ ఐపీఓలో 65.5 లక్షల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ మాత్రమే ఉంటుంది.   భవిష్యత్ మూలధన అవసరాలను తీర్చడానికి టైర్-–1 మూలధన స్థావరాన్ని పెంచడానికి ఇది ఇష్యూకు వస్తోంది. 

లిస్టింగ్​​: ఇదిలా ఉండగా, ఈ వారంలో కౌశల్య లాజిస్టిక్స్ మాత్రమే లిస్టింగ్ అవుతుంది. సంస్థ తన ఈక్విటీ షేర్లను జనవరి 8న ఎన్​ఎస్​ఈ ఎమర్జ్‌‌‌‌లో లిస్ట్​ చేస్తుంది  ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ.75. రూ. 36.6 కోట్ల పబ్లిక్ ఇష్యూకి ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. డిసెంబర్ 29 నుంచి జనవరి 3 వరకు ఇది 364.18 రెట్లు సబ్‌‌‌‌స్క్రయిబ్ అయింది.

న్యూ స్వాన్ మల్టీ టెక్ ఐపీఓ

ఈ వారం సబ్‌‌‌‌స్క్రిప్షన్ కోసం వస్తున్న మూడవ ఐపీఓ న్యూ స్వాన్ మల్టీటెక్. ఇది ప్రిసిషన్​ ఇంజనీరింగ్ కాంపోనెంట్స్ తయారీదారు. రూ.33.11 కోట్ల విలువైన ఈ ఐపీఓ జనవరి 11న ప్రారంభమై జనవరి 15న ముగుస్తుంది. అయితే ఆఫర్‌‌‌‌ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.62–-66గా నిర్ణయించారు.  రయాన్, లుధియానా యూనిట్ల కోసం మెషినరీ కొనడానికి, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలతో పాటు అప్పులు చెల్లించడం,  వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఈ డబ్బును వాడుతారు. 

ఆస్ట్రేలియన్ ప్రీమియం సోలార్ 

ఈ కంపెనీ మోనోక్రిస్టలైన్  పాలీక్రిస్టలైన్ సోలార్ మాడ్యూల్స్ మేకర్. ఇదే వారంలో రూ. 28 కోట్ల పబ్లిక్ ఇష్యూని కూడా ప్రారంభించనుంది. ఇది బుక్ -బిల్డింగ్ ఇష్యూ. ఆఫర్​ జనవరి 11న మొదలై, జనవరి 15న ముగుస్తుంది. ఒక్కో షేరు ధరను రూ. 51-–54 మధ్య నిర్ణయించారు. ఇందులో తాజా ఇష్యూ మాత్రమే ఉంటుంది. ఓఎఫ్​ఎస్​ భాగం ఉండదు. కంపెనీ తన మూలధన వ్యయం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం నిధులను వాడుతుంది.