తమ్ముడు చనిపోతే చూసేందుకు వెళ్తూ.. అన్న మృతి

తమ్ముడు చనిపోతే చూసేందుకు వెళ్తూ.. అన్న మృతి
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో నలుగురి దుర్మరణం

సిరిసిల్ల జిల్లాలో వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం పాలయ్యారు. రోడ్డు ప్రమాదం జరిగితే మానవత్వంతో స్పందించిన ఓ యువకుడు బైకు రోడ్డు పక్కన ఆపి ప్రమాదాన్ని చూస్తుంటే.. ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. రోడ్డు పక్కన బైకు ఆపి చూస్తున్న యువకుడిని కంటెయినర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కంటెయినర్ ఢీకొట్టడంతో తమ్ముడు చనిపోయాడన్న సమాచారంతో చూసేందుకు బైకుపై బయలుదేరిన అన్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తమ్ముడి శవం దగ్గరకు చేరుకోకముందే తనువు చాలించాడు. బుధవారం వేర్వేరు చోట్ల జరిగిన హృదయ విదారక ఘటనలు విషాదం సృష్టించాయి. 
రాజన్న సిరిసిల్ల జిల్లాలో బుధవారం ఒకే రోజు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందిన ఘటనలు స్థానికులను కలచివేశాయి. మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు ఒకేరోజు వేరు వేరు చోట్ల చనిపోగా.. అన్నదమ్ములిద్దరి చావుకి మరో  యాక్సిడెంట్ మృతి కారణం కావడం విచిత్రం. 
బుధవారం మధ్యాహ్నం సిరిసిల్ల సమీపంలోని సర్దాపూర్ దగ్గర బైకును ఆటో ఢీకొనడంతో బైకుపై వెళ్తున్న వేణు అనే యువకుడు చనిపోయాడు. అదే మార్గంలో వెళ్తున్న రాజు అనే యువకుడు రోడ్డు ప్రమాదాన్ని చూసి ఏం జరిగిందో తెలుసుకునేందుకు తన బైకు రోడ్డు పక్కన ఆపాడు. సర్దాపూర్ దగ్గర ఆపిన తన బైకు పక్కనే నిలబడి బైకు- ఆటో ఢీకొట్టడంతో వేణు అనే వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించాడు. ఎట్లా జరిగిందని అక్కడున్న వారిని ఆరా తీస్తుండగానే రోడ్డు పక్కన ఆపిన తన బైక్ పక్కన నిలబడ్డ రాజును ఊహించని రీతిలో కంటైనర్ వచ్చి  ఢీకొట్టింది. దీంతో రాజు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అతని మొబైల్ ఫోన్ ఆధారంగా కుటుంబ సభ్యులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. తమ్ముడు రాజు మరణవార్త విని  అన్న నర్సయ్య బైకుపై బయలుదేరాడు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ వద్ద  బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో అన్న నర్సయ్య మృతి చెందాడు. తమ్ముడి శవం దగ్గరకు వెళ్లకముందే మార్గం మధ్యలోనే అన్న కూడా చనిపోయాడు. అన్నదమ్ములిద్దరి స్వస్థలం సిరిసిల్ల అర్బన్ పెద్దూర్ గా గుర్తించారు. అన్నదమ్ములిద్దరు కొన్ని నిమిషాల తేడాలో వేర్వేరు చోట్ల ప్రమాదాల్లో చనిపోవడం స్థానికంగా విషాదం రేపింది.