అమెరికాలో తెలుగు ఫ్యామిలీ అనుమానస్పద మృతి

అమెరికాలో తెలుగు ఫ్యామిలీ అనుమానస్పద మృతి

వాషింగ్టన్అమెరికాలో దారుణం జరిగింది. భార్యాపిల్లలను తుపాకీతో కాల్చి చంపి.. తనను తాను కాల్చుకొని ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఓ వ్యక్తి మృతిచెందాడు. మృతులను సుంకర చంద్రశేఖర్ (44)​, ఆయన భార్య లావణ్య (41), వారి ఇద్దరి పిల్లలుగా పోలీసులు గుర్తించారు. పిల్లలిద్దరూ అబ్బాయిలేనని, ఒకరి వయసు 15 ఏళ్లు, మరొకరి వయసు పదేళ్లని తెలిపారు. ఏపీకి చెందిన చంద్రశేఖర్​కొన్నేళ్లుగా భార్యాపిల్లలతో కలిసి అమెరికాలోని అయోవా రాష్ట్రం వెస్ట్​ డెయిస్​ మొయిన్స్​లో నివాసం ఉంటున్నారు. అక్కడే ఇటీవల ఇల్లు కూడా కట్టుకున్నారు. శనివారం ఉదయం ఇంట్లో చంద్రశేఖర్, లావణ్య, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో శవాలై కనిపించారు. పోలీసులు అక్కడికి చేరుకొని విచారించారు. చంద్రశేఖరే భార్యాపిల్లలను తుపాకీతో కాల్చి చంపి.. అటు తర్వాత తనను తాను కాల్చుకొని చనిపోయినట్లు పోలీసులు నిర్ధారించారు. సంఘటన జరిగినప్పుడు ఆ ఇంట్లో వారితోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు తెలిపారు. ఆ వ్యక్తి భయంతో బయటకు వచ్చి స్థానికులకు విషయం చెప్పడంతో వారు తమకు కాల్​ చేశారని పోలీసులు పేర్కొన్నారు. చంద్రశేఖర్​కు కొంతకాలంగా మానసిక స్థితి సరిగా లేదని స్థానికులు చెప్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు బయటకు రాలేదు.