మంజీర ఇసుక గుంతల్లో నలుగురి జల సమాధి

మంజీర ఇసుక గుంతల్లో నలుగురి జల సమాధి

బీర్కూర్, పిట్లం, వెలుగు: మంజీరా నది దాటుతూ ఇసుక కోసం తీసిన గుంతల్లో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు జల సమాధి అయ్యారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్​లో జరిగింది. బిచ్కుంద మండలం షెట్లూరు గ్రామస్తులు మంజీరా అవతలి వైపు ఉన్న బీర్కూర్ ​మండలంలోని ముస్లిం దేవుడు గైపీర్లను దర్శించుకోవడానికి మంజీరా నదిని దాటి వెళ్తుంటారు. కొంత కాలంగా నదిలో ఇసుక తవ్వి తీస్తుండటంతో లోతైన గుంతలు ఏర్పడ్డాయి. వాటిలో ప్రస్తుతం నీరు చేరింది. శుక్రవారం సాయంత్రం షెట్లూరుకు చెందిన అంజవ్వ(45), తన కూతురు జ్యోతి(16), అంజవ్వ చెల్లెలి కూతురు గంగోత్రి(10), కొడుకు ప్రశాంత్(7) గైపీర్ల దర్శనం కోసం మంజీరా నదిని దాటేందుకు బయలుదేరారు. ఎప్పుడూ వెళ్లే దారే కదా అని ముందుకు వెళ్లగా ఇసుక గుంతల్లో నీటిలో మునిగిపోయారు. వీరి కోసం కుటుంబ సభ్యులు శనివారం గాలిస్తుండగా మంజీరా నదిలో మూడు మృతదేహాలు కనిపించాయి. వాటిని బయటకు తీసి, మరొకరి కోసం గాలిస్తుండగా  బాలిక గంగోత్రి డెడ్​బాడీ బయటపడింది. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో షెట్లూర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. అడిషనల్​ఏఎస్పీ అనోన్య, బాన్సువాడ డీఎస్పీ జైపాల్ రెడ్డి, సీఐ చంద్ర శేఖర్, బీర్కూర్ ఎస్సై రాజేశ్​లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నలుగురు మృతికి కారకులైన ఇసుక క్వారీ నిర్వాహకులపై, వారికి సహకరిస్తున్న అధికారులపై  చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార డిమాండ్​ చేశారు.