కెమికల్ ఫ్యాక్టరీలో..పేలిన రియాక్టర్ .. చందాపూర్ శివారులో ఘటన

కెమికల్ ఫ్యాక్టరీలో..పేలిన రియాక్టర్ .. చందాపూర్ శివారులో ఘటన
  • కంపెనీ డైరెక్టర్ సహా నలుగురు మృతి
  • 30 మందికి గాయాలు.. ఇద్దరికి సీరియస్ 
  • పేలుడు ధాటికి కుప్పకూలిన భవనం 
  • 7 కిలోమీటర్ల వరకూ వినిపించిన శబ్దం
  • గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశాలు 

సంగారెడ్డి (హత్నూర), వెలుగు :  సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ గ్రామ శివారులోని ఎస్​బీ ఆర్గానిక్స్ కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం ఓ రియాక్టర్ పేలి నలుగురు మృతిచెందారు. మృతుల్లో కంపెనీ డైరెక్టర్ రవి శర్మ(42), మధ్యప్రదేశ్​కు చెందిన సురేశ్ పాల్(50), తమిళనాడుకు చెందిన దయానంద్(48), ఏపీకి చెందిన సుబ్రహ్మణ్యం(36) ఉన్నట్టు గుర్తించారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. ముందుగా ఫ్యాక్టరీలోని బాయిలర్ వద్ద బుధవారం సాయంత్రం 5.30 గంటలకు మంటలు చెలరేగాయి. 

మంటలను ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తుండగానే ఆ వేడికి రియాక్టర్ నుంచి ఆయిల్​లీకై ఒక్కసారిగా పేలింది. ఆ పేలుడు ధాటికి రియాక్టర్​వద్ద ఉన్న నలుగురు ఎగిరిపడి అక్కడికక్కడే చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు కారణంగా రియాక్టర్ ఉన్న భవనం కూడా కుప్పకూలి పదుల సంఖ్యలో గాయపడ్డారు. మిగతా కార్మికులంతా ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.

కొద్దిసేపటికి తేరుకుని లోపల చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. గాయపడ్డ 30 మంది కార్మికులను హత్నూర గవర్నమెంట్​హాస్పిటల్​కు తరలించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చి పరిశీలించారు. అప్పటికే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకోగా కలెక్టర్ వల్లూరి క్రాంతి సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. కొద్దిసేపటికి మంటలను ఆర్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. 

7 కి.మీ. వరకూ భారీ శబ్దం.. 

కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడంతో దాదాపు 7 కిలోమీటర్ల రేడియస్​వరకు భారీ శబ్దం వినిపించింది. అప్పటికే మంటలు దట్టంగా అలుముకోవడంతో అందరిలోనూ భయాందోళన మొదలైంది. రియాక్టర్​పేలిన తర్వాత మంటలు భారీగా వ్యాపించడం.. ఫ్యాక్టరీలోని మరో రియాక్టర్​కూడా పేలిపోయే ప్రమాదం ఉండటంతో యాజమాన్యం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అలర్ట్​అయ్యారు. వెంటనే ఫ్యాక్టరీ చుట్టపక్కల ప్రజలను ఖాళీ చేయించారు.  

సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ.. 

ఫ్యాక్టరీలో ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రియాక్టర్ పేలడం వల్లే మంటలు వ్యాపించినట్టు అధికారులు సీఎంకు వివరించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందజేయాలన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనా స్థలాన్ని మంత్రులు దామోదర రాజనర్సింహ, కొండా సురేఖ పరిశీలించారు. పోలీసులను అడిగి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. కాగా, కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రతిపక్ష నేత, మాజీ సీఎం కేసీఆర్ కూడా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించారు.   

మృతులకు గవర్నర్ సంతాపం 

హైదరాబాద్, వెలుగు :  సంగారెడ్డి జిల్లా చందాపూర్ లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్ పై గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. మరణించిన నలుగురు కార్మికులకు సంతాపం తెలుపుతూ గవర్నర్ బుధవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారికి తక్షణ సహాయ చర్యలు అందించాలని అధికారులను గవర్నర్ ఆదేశించారు.