వేర్వేరుచోట్ల నాలుగు హత్యలు

వేర్వేరుచోట్ల నాలుగు హత్యలు

మిర్యాలగూడ, వెలుగు : రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో నాలుగు హత్యలు జరిగాయి. మద్యం మత్తులో మొదలైన గొడవ, వివాహేతర సంబంధం, పాతకక్షలు హత్యలకు దారి తీశాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామానికి చెందిన జంగాల సుధాకర్(28), ఇద్దరు స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి బస్టాప్ సమీపంలో నిలబడ్డాడు. అదే టైంలో అక్కడికి వచ్చిన తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన చిటెకల మల్సూర్.. సుధాకర్ ను బూతులు తిడుతూ న్యూఇయర్​విషెస్​చెప్పాడు. ఇదేమిటని సుధాకర్ ప్రశ్నించటంతో మల్సూర్​గొడవకు దిగాడు. మాటమాట పెరిగి పక్కనే మిషన్ భగీరథ నల్లాల కోసం ఏర్పాటు చేసిన ఇనుప రాడ్డుతో సుధాకర్ తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని108లో మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్​కు తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. హత్య నేపథ్యంలో రెండు గ్రామాల్లో పోలీస్​పహారా కొనసాగుతోంది. ఘటనా స్థలాన్ని మిర్యాలగూడ డీఎస్పీ వై.వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ సత్యనారాయణ, ఎస్సై నర్సింహులు పరిశీలించారు. మృతుడి తల్లి జంగాల నరసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే సుధాకర్, అతని స్నేహితులు, మల్సూర్​ఆదివారం రాత్రి తడకమళ్ల బస్టాప్ సమీపంలోని ఓ బెల్ట్​షాపులో మద్యం తాగారని, ఆ తర్వాత మొదలైన గొడవ హత్యకు దారి తీసిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

నీళ్ల డ్రమ్ములో కుక్కి.. అడ్వకేట్ మర్డర్

పిట్లం : మహారాష్ట్ర పుణెలోని పింప్రికి చెందిన శివశంకర్(47) అడ్వకేట్. నాందేడ్​జిల్లా దెగ్లూర్​తాలూక భక్తపూర్​కు చెందిన రాజేశ్​జాదవ్​భార్య శివశంకర్​వద్ద లాయర్​గా ప్రాక్టీస్​చేస్తుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం మొదలైంది. విషయం తెలుసుకున్న రాజేశ్​జాదవ్​డిసెంబర్​31న పుణె వెళ్లి శివశంకర్​ను కిడ్నాప్​చేశాడు. కాళ్లు, చేతులు కట్టేసి నీళ్ల డ్రమ్ములో పడేసి ఓ వెహికల్​లో భక్తపూర్​తీసుకొచ్చాడు. గాలి ఆడక దారిలోనే శివశంకర్​చనిపోయాడు. ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా మద్నూర్​మండలం కొడిచిర గ్రామ శివారులోకి తీసుకొచ్చి మృతదేహాన్ని కాల్చేశాడు. పుణెలో మిస్సింగ్ కేసు నమోదయ్యాక అక్కడి పోలీసులు రాజేశ్​జాదవ్ పై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా తానే చంపేసినట్లు ఒప్పుకున్నాడు. సోమవారం డెడ్​బాడీని కాల్చేసిన స్థలాన్ని సీఐ కృష్ణ పరిశీలించారు. పూర్తి వివరాలను మహారాష్ట్ర పోలీసులకు అందజేసినట్లు మద్నూర్ ఎస్సై శివకుమార్​తెలిపారు. 

నిజామాబాద్​లో రౌడీషీటర్

నిజామాబాద్ క్రైమ్: నిజామాబాద్ శివారులోని నెహ్రూనగర్ గ్రౌండ్​లో ఆదివారం అర్ధరాత్రి ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. సారంగాపూర్​కు చెందిన అర్షద్​పుట్టినరోజు వేడుకలు ఆదివారం రాత్రి జరిగాయి. కాలనీకి చెందిన ఇబ్రహీం అలియాస్​జంగల్​ఇబ్బు(29)తోపాటు ఆరిఫ్ డాన్ హాజరయ్యారు. వీరిద్దరిపై గతంలో హత్యాయత్నం, దాడులు కేసులు ఉన్నాయి. ఎవరికి వారు ఇల్లీగల్​దందాలు చేస్తూ సొంతంగా గ్యాంగులు మెయింటెన్​చేస్తున్నారు. వీరిద్దరి మధ్య పాత కక్షలు ఉండగా, చాలా రోజుల తర్వాత బర్త్​డే పార్టీలో ఎదురుపడ్డారు. ఇబ్రహీం ఒక్కసారిగా ఆరిఫ్ పై దాడి చేయగా, అప్పటికే కత్తులతో వచ్చిన ఆరిఫ్ గ్యాంగ్ ఇబ్రహీంపై విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన ఇబ్రహీంను హాస్పిటల్​కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆరో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దాడిలో ఐదారుగురు యువకులు పాల్గొన్నారని, త్వరలో అందరినీ పట్టుకుంటామని నిజామాబాద్ సౌత్ సీఐ నరేశ్​ తెలిపారు.

బోధన్, వెలుగు : నిజామాబాద్ జిల్లా బోధన్ శివారులోని నర్సపూర్ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు ఓ యువకుడిపై దాడి చేసి చంపేశారు. బోధన్ టౌన్ సీఐ ప్రేమ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బోధన్​లోని శక్కర్​నగర్​కు చెందిన చాట్ల శివకుమార్(24)పై నర్సాపూర్​శివారులో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దాడిచేశారు. తల, మెడ, చేతిపై కత్తితో పొడి చంపేశారు. సోమవారం స్థానిక రైతులు డెడ్​బాడీని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిశీలించగా శక్కర్​నగర్​కు చెందిన చాట్ల శివకుమార్​అని తేలింది. కూలి పనులకు వెళ్లే శివకుమార్ పై చోరీ కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు గల కారణాలు, చేసినవారు తెలియలేదని సీఐ తెలిపారు. దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.