
న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ఫాక్స్‌కాన్, తమిళనాడులో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించింది. ఈ పెట్టుబడితో 14 వేల హై-వాల్యూ ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని తమిళనాడు పరిశ్రమల మంత్రి టీఆర్‌బీ రాజా సోమవారం ఎక్స్‌లో వెల్లడించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ఇంజినీరింగ్ ఉద్యోగాల హామీగా పేర్కొంటూ, ఇది ఎలక్ట్రానిక్స్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫాక్చరింగ్ రంగాలకు ఊతమిస్తుందని అన్నారు.
“విలువ ఆధారిత తయారీ, ఆర్ అండ్ డీ, ఏఐ ఆధారిత టెక్నాలజీ కార్యకలాపాలను తమిళనాడులో ఏర్పాటు చేయడానికి ఫాక్స్‌కాన్ ముందుకొచ్చింది” అని ఆయన తెలిపారు.
ఫాక్స్‌కాన్ ఇండియా ప్రతినిధి రాబర్ట్ వూ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ను కలసి పెట్టుబడులపై చర్చించారని అన్నారు. అలాగే దేశంలోనే తొలిసారిగా ఫాక్స్‌కాన్ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ ప్రకటనకు ముందు ఫాక్స్‌కాన్ రాబర్ట్ వూ బెంగళూరులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలసి, రాష్ట్రంలో ఫాక్స్‌కాన్ కార్యకలాపాలను విస్తరించడంపై చర్చించారు. ఫాక్స్‌కాన్ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతోంది.