డబ్బులు కుమ్మరించిన ఎఫ్​పీఐలు

డబ్బులు కుమ్మరించిన ఎఫ్​పీఐలు

న్యూఢిల్లీ: 2023–-24 ఆర్థిక సంవత్సరంలో ఫారిన్​పోర్ట్​ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్​పీఐలు) భారతీయ ఈక్విటీల్లోకి రూ. 2 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్​చేసి భారీ లాభాలు సంపాదించారు. ప్రపంచ మార్కెట్లలో సమస్యలు ఉండగా, మనదేశ మార్కెట్​బలంగా కనిపించడమే ఇందుకు కారణం. 2025లోనూ ఎఫ్​ఐపీలు భారీగానే ఇన్వెస్ట్​ చేసే అవకాశాలు ఉన్నాయని ఎక్స్​పర్టులు అంటున్నారు.

భారత్‌‌‌‌‌‌‌‌లోని మజార్స్ మేనేజింగ్ పార్టనర్ భరత్ ధావన్ మాట్లాడుతూ, మార్కెట్​పరిస్థితి ఆశాజనకంగా ఉందని,  సానుకూల విధాన సంస్కరణలు, ఆర్థిక స్థిరత్వం,  ఆకర్షణీయమైన పెట్టుబడి మార్గాల మద్దతు వల్ల ఎఫ్‌‌‌‌‌‌‌‌పీఐ ప్రవాహాలు భారీగానే ఉంటాయని అంచనా వేస్తున్నట్లు చెప్పారు.  అయితే ఎప్పటికప్పుడు భౌగోళిక రాజకీయ ప్రభావాలను పరిశీలించి వ్యూహాలను మారుస్తామని ఆయన చెప్పారు. ఎఫ్​పీఐలు కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ బలంగా డబ్బులు పెడతారని భావిస్తున్నట్టు విండ్‌‌‌‌‌‌‌‌మిల్ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌లోని  సీనియర్ డైరెక్టర్ నవీన్ తెలిపారు.

మొత్తం రూ.3.4 లక్షల కోట్లు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌‌‌‌‌‌‌‌పీఐలు  భారతీయ ఈక్విటీ మార్కెట్‌‌‌‌‌‌‌‌లలో దాదాపు రూ. 2.08 లక్షల కోట్లు,  డెట్ మార్కెట్లో రూ. 1.2 లక్షల కోట్ల నికరంగా పెట్టుబడి పెట్టారు.   మొత్తం రూ.3.4 లక్షల కోట్లను క్యాపిటల్ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి పంపారు.   2022–-23లో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు దూకుడుగా రేట్లను పెంచాయి. ఎఫ్​పీఐల ద్వారా మన మార్కెట్లకు అప్పుడు రూ. 37,632 కోట్లు వచ్చాయి. దీనికి ముందు, వారు  రూ. 1.4 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్నారు. అయితే, 2020-–2021లో ఎఫ్‌‌‌‌‌‌‌‌పీఐలు రూ. 2.74 లక్షల కోట్లను పెట్టుబడులు పెట్టారు.

ముఖ్య కారణాలు ఇవి..

యూఎస్, యూకే వంటి అభివృద్ధి చెందిన మార్కెట్లలో ద్రవ్యోల్బణం,  వడ్డీ రేట్ల పోకడ, కరెన్సీ కదలిక, ముడి చమురు ధరలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, దేశీయ ఆర్థిక వ్యవస్థ  ఆరోగ్యం వంటి కారణాల వల్ల విదేశీ పెట్టుబడిదారుల నుంచి ప్రవాహాలు ఎక్కువగా వచ్చాయని మార్నింగ్‌‌‌‌‌‌‌‌స్టార్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ రీసెర్చ్ ఇండియా  అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ అన్నారు. కష్టకాలంలోనూ మన మార్కెట్ ప్రదర్శించిన సామర్థ్యానికి వాళ్లు ఆకర్షితులయ్యారని అన్నారు.

ఇతర మార్కెట్లతో పోలిస్తే, ప్రపంచ ఆర్థిక సంక్షోభం మధ్య భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టంగా,  స్థిరంగా ఉందని, విదేశీ పెట్టుబడులను మరింత ఆకర్షిస్తోందని ఆయన చెప్పారు. యూకే,  జపాన్ వంటి ఆర్థిక వ్యవస్థలు మాంద్యంలో పడిపోయాయని, రష్యా,  ఉక్రెయిన్ ఇప్పటికీ యుద్ధంలో ఉన్నాయని, యూఎస్  ద్రవ్యోల్బణం ఎక్కువే ఉందని వివరించారు. చైనాపై వ్యతిరేకత కూడా ఇండియాకు మేలు చేస్తోందని అన్నారు.