
బషీర్బాగ్, వెలుగు: మ్యాట్రీమొనీ యాప్ ద్వారా పరిచయం అయిన సైబర్ నేరగాళ్లు ఓ వ్యక్తిని క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ పేరుతో మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన ప్రకారం.. జియాగూడ ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల వ్యక్తికి జీవన్ సాతి మ్యాట్రిమొనీ యాప్ ద్వారా స్కామర్లు సంప్రదించారు. మలేషియాకు చెందిన మహిళగా చాటింగ్ చేశారు. చనువు అయ్యాక క్రిప్టో కరెన్సీలో తాను ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తున్నట్లు నమ్మించారు. బాధితుడు నుంచి రూ.లక్షా 56 వేలు పెట్టించి ఓ లింక్ ద్వారా ఆ డబ్బులను కొట్టేశారు.
పీఎం కిసాన్ యోజన ఏపీకే ఫైల్ తో..
నకిలీ పీఎం కిసాన్ యోజన ఏపీకే ఫైల్ తో స్కామర్స్ ఓ వ్యక్తిని బురిడీ కొట్టించారు. బహదూర్ పురాకు చెందిన 43 ఏళ్ల వ్యక్తి వాట్సాప్ కు ఈ నెల 5న పీఎం కిసాన్ యోజన పేరిట ఏపీకే ఫైల్ పంపారు. ఆ ఫైల్ ఇన్స్టాల్ అయ్యాక ఫోన్ హ్యాక్ అయింది. స్కామర్స్ ఫోన్ యాక్సెస్ చేస్తూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నుంచి రూ.2 లక్షల 90 వేలు
కొట్టేశారు.