
- ఆరోగ్య శ్రీ లిమిట్ రూ.10 లక్షలకు పెంపు
- రెండు గ్యారంటీలను ప్రారంభించిన సీఎం, మంత్రులు
- అసెంబ్లీ నుంచి ట్యాంక్ బండ్ వరకు రేవంత్ జర్నీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు సర్వీసులు షురూ అయ్యాయి. ‘మహాలక్ష్మి’, ఆరోగ్యశ్రీ లిమిట్ రూ.10 లక్షలకు పెంపు పథకాలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ రెండు గ్యారంటీలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఆరోగ్య శ్రీ లోగో, పోస్టర్లను ఆవిష్కరించారు. ఆర్టీసీ బస్సును జెండా ఊపి మహిళా మంత్రులు సురేఖ, సీతక్క ప్రారంభించారు. తర్వాత బస్సులో టికెట్‌ను రేవంత్ కొనుగోలు చేశారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్, ఇతర మహిళలకు ఉచిత టికెట్‌ను సీఎం అందజేశారు.
సీతక్క, సురేఖలకు ఫ్రీ టికెట్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అందజేశారు. అసెంబ్లీ నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు సీఎం, మంత్రులు ప్రయాణించారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా మారుస్తామని వెల్లడించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటించారు. ముందుగా రెండింటిని ప్రారంభిస్తున్నామని తెలిపారు.
తెలంగాణకు పండుగ రోజు
“ఈరోజు తెలంగాణ ప్రజలకు పండుగ రోజు. 2009 డిసెంబర్ 9న తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ తల్లి అంటే సోనియమ్మ రూపం కనిపిస్తుంది. నాది తెలంగాణ అని చెప్పుకునే అవకాశం మనకు సోనియమ్మ ఇచ్చారు. తెలంగాణ ప్రజల కోసం సోనియమ్మ ఆరు గ్యారంటీలను ఇచ్చారు. ఇవాళ ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను అమలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తాం. మహిళలు ఈరోజు నుంచి రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు” అని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్ల ప్రోత్సాహక చెక్‌ను ఆయన అందజేశారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సోనియా గాంధీ ‘మహాలక్ష్మి’ హామీని ఇచ్చారని చెప్పారు. పెరిగిన ధరలతో మహిళల ఇబ్బందులు పడుతున్నారని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ చార్జీలను భారీగా పెంచిందని ఆరోపించారు.
ఆరోగ్య శ్రీ కింద ఏటా రూ.10 లక్షల కవరేజీ
‘చేయూత’ పేరుతో రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సాయాన్ని రూ.10 లక్షలకు పెంచారు. ‘‘రాష్ట్రంలోని పేదలందరికీ ఉచితంగా కార్పొరేట్ వైద్యం లభించనుంది. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి ఏటా రూ.10 లక్షల మేర ఆర్థిక కవరేజీతో వైద్య సాయం అందుతుంది’’ అని శనివారం సమాచార శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 90.10 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. ఈ పథకం ద్వారా 1,672 వైద్యపరమైన ప్యాకేజీలు అందుబాటులోకి రావడంతో పాటు 21 స్పెషాలిటీ సేవలు కూడా బాధితులకు సమకూరనున్నాయని పేర్కొంది.