
జూబ్లీహిల్స్, వెలుగు: అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న సంకల్పంతో డాక్టర్ బీఆర్.అంబేద్కర్ వర్సిటీలో రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్లకు ఉచిత విద్యను అందిస్తున్నామని వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 2025–26 విద్యా సంవత్సరం నుంచి ఈ అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. 10+2(ఇంటర్మీడియట్) విద్యార్హత కలిగిన ట్రాన్స్జెండర్లకు డిగ్రీలో నామమాత్రపు ఫీజు రూ.500తో విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఫ్రీగా స్టడీ మెటీరియల్ ఇవ్వడంతో పాటు అన్ని ట్యూషన్ ఫీజులు మినహాయించేందుకు యూనివర్సిటీ ముందుకు వచ్చిందని తెలిపారు. ట్రాన్స్జెండర్లతో పాటు కోయ, చెంచు, గోండు తెగలకు చెందిన స్టూడెంట్లకు ఫ్రీగా విద్యను అందిస్తామని పేర్కొన్నారు. అర్హులైన వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.