కరోనా పేషెంట్లకు ఫ్రీగా ఫుడ్, మెడిసిన్స్, గ్రోసరీస్ హోం డెలివరీ

కరోనా పేషెంట్లకు ఫ్రీగా ఫుడ్, మెడిసిన్స్, గ్రోసరీస్ హోం డెలివరీ
  • అయినోళ్లలా ఆదుకుంటున్నరు
  • కరోనా పేషెంట్లకు స్వచ్ఛంద సంస్థల సేవలు 
  • ఫ్రీగా ఫుడ్, మెడిసిన్స్, గ్రోసరీస్ హోం డెలివరీ
  • అవసరమైన వారికి ఆక్సిజన్ సిలిండర్లు కూడా 
  • హోం ఐసోలేషనల్లో ఉంటున్న వారికి చేయూత
  • సిటీలో ముందుకు వస్తున్న పలువురు యువకులు, ఆర్గనైజేషన్స్

మణికొండలో ఉంటోన్న నరసింహులు ఓ ప్రైవేట్ ​కంపెనీలో పనిచేస్తున్నాడు. గత వారం ఆయనకు కరోనా పాజిటివ్​గా తెలింది. భార్యకి కూడా టెస్ట్ చేయించాడు. ఇద్దరూ వైరస్ బారిన పడటంతో హోం ఐసోలేట్ అయ్యారు. బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకోలేని పరిస్థితి. తెలిసిన వాళ్లను సాయం అడిగినా కరోనా అని వచ్చేందుకు భయపడుతున్నారు. దీంతో ఫుడ్​కి చాలా ఇబ్బంది పడ్డారు. ఒకరోజు వారు సోషల్ మీడియాలో హోం ఐసోలేట్ పేషెంట్లకు ఫ్రీగా ఫుడ్ పంపిణీ చేస్తున్నారనే పోస్ట్ చూశారు. అలా స్వచ్ఛంద సంస్థను కాంటాక్ట్ అయి తమ సమస్యను చెప్పారు. అప్పటి నుంచి ఆర్గనైజేషన్ వాళ్లు లంచ్, డిన్నర్ పంపిస్తున్నారు. 
 

హైదరాబాద్, వెలుగు: ఆపదలో ఆపన్న హస్తం అందిస్తున్నాయి. కరోనా టైంలో అయినవాళ్లు ఆదుకోకపోయినా మేమున్నం అంటూ ముందుకొస్తున్నాయి. వైరస్​బారిన పడి హోం ఐసోలేషన్​లో ఉంటున్న పేషెంట్ల అవసరాలు తీరుస్తున్నాయి.  వారికి కావాల్సిన భోజనం, మెడిసిన్స్, నిత్యావసర సరుకులు తదితరాలు అందిస్తున్నాయి సిటీలోని పలు సంస్థలు. దీంతో పాటు అత్యవసర సమయాల్లో ఆక్సిజన్ సిలిండర్లు అందించడం, ఒకవేళ కరోనాతో పేషెంట్ చనిపోతే ఇంటి నుంచి శ్మశానానికి తీసుకెళ్లేందుకు ఉచిత ఆంబులెన్స్ సర్వీస్ తో పాటు దహన సంస్కారాల్లో సాయం చేస్తున్నాయి.

ఫ్రీగా క్వారంటైన్ మీల్స్..
హోం ఐసోలేషన్ లో ఉంటున్న పేషెంట్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఫుడ్. ఇంట్లో వండుకోవడానికి సరుకులు లేకపోవడం, ఉన్నా చేసుకునేందుకు ఓపిక లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వీరి కోసం సిటీకి చెందిన పలు సంస్థలు ఫ్రీగా ఫుడ్ అందిస్తున్నాయి. పేషెంట్ పేరు, అడ్రెస్ చెప్తే ఆర్గనైజేషన్ల వాళ్లే డోర్ డెలివరీ చేస్తున్నారు. ఒక ఇంట్లో నలుగురుకి వైరస్​ సోకినా అందరికీ రెండు పూటల మీల్స్ అందిస్తున్నారు. నగరంలోని మరో స్వచ్ఛంద సంస్థ ప్రతి రోజు 200 నుంచి 1,000 మందికి ఫ్రీగా ఫుడ్​ను అందిస్తున్నది. డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్ వంటివి కూడా ఇస్తోంది. గతేడాది లాక్ డౌన్ నుంచి ఈ సర్వీసులను స్టార్ట్​ చేసినా సెకండ్ వేవ్​లో పరిస్థితి దారుణంగా ఉందని, ఫుడ్​కోసం చాలా కాల్స్ వస్తున్నాయని ఫ్రీ ఫుడ్​పంపిణీ చేస్తున్న వీబీజీ ఫౌండేషన్ ఫౌండర్ రాజు తెలిపారు.

మెడిసిన్స్.. ఆక్సిజన్ సిలిండర్ల సప్లయ్​..
కరోనా పేషెంట్లకు మెడిసిన్లు, ఆక్సిజన్ సిలిండర్ల అవసరం చాలా ఉంది. హోం ఐసోలేషన్​లో ఉన్న పేషెంట్ల కోసం కొంతమంది యూత్ వలంటీర్లుగా  ముందుకు వచ్చి సాయం చేస్తున్నారు. మెడిసిన్స్, గ్రాసరీ ఇంటికే తీసుకొచ్చి ఇస్తామని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటంతో కరోనా పేషెంట్లు వీరిని సంప్రదిస్తున్నారు. లోకేషన్​తో పాటు కావాల్సిన మందులను వాట్సాప్​లో షేర్ చేస్తున్నారు. వీరు మెడిసిన్స్ కోసమయ్యే డబ్బులను మాత్రమే తీసుకుని సొంత ఖర్చులతో డోర్ డెలివరీ చేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలు విదేశాల్లో ఉండి, వైరస్​ బారిన పడిన పెద్దలకు వీళ్లు ఎంతో సాయం చేస్తున్నారు. మరోవైపు హాస్పిటల్స్​లో, మార్కెట్ లో ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడంతో కొంత మంది దాతలు ముందుకొచ్చి ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకోసం పాజిటివ్ రిపోర్ట్స్ తో పాటు డాక్టర్ ప్రిస్క్రిప్షన్, ఆధార్ కార్డ్ జిరాక్స్, రూ.2 వేలు డిపాజిట్ చేయించుకుంటున్నారు. పేషెంట్ అవసరం తీరాక రూ.2 వేలు తిరిగి ఇస్తున్నారు.

అంబులెన్స్ తో పాటు అంత్యక్రియలు కూడా..
కరోనాతో చనిపోయిన పేషెంట్లను తీసుకెళ్లేందుకు స్వచ్ఛంద సంస్థలు ఉచిత ఆంబులెన్స్ సర్వీసులను అందిస్తున్నాయి. హాస్పిటల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి శ్మశానవాటికకు ఫ్రీగా సర్వీస్​అందిస్తున్నాయి. అంత్యక్రియలు కూడా వీరే దగ్గరుండి చూసుకుంటున్నారు. దహన సంస్కారాలకు డబ్బులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నవారికి తామే డబ్బులు వేసుకుని చేయిస్తున్నామని ఫీడ్ ద నీడి లాస్ట్ రైడ్ సర్వీస్ మెంబర్​ సాయి తేజ తెలిపారు. ‘ ఏప్రిల్ 17 నుంచి ఫ్రీ లాస్ట్ రైడ్ సర్వీసులను మొదలుపెట్టాం. ఇప్పటివరకు 8 మందికి దహన సంస్కారాలు చేశాం. ఇందులో మూడు కుటుంబాలకు మేమే డబ్బులను పెట్టుకున్నాం. ప్రతిరోజు కేవలం క్రిమేషన్ కోసమే 15 నుంచి 20 ఫోన్లు వస్తున్నాయి. క్రిమేషన్ కి రూ.20 వేల నుంచి రూ.25 వేలు అవుతుంది. మేం ఈసీఐఎల్, బన్సిలాల్ పేట్, అంబర్ పేటలోని శ్మశానవాటికల వారితో మాట్లాడం. కరోనాతో చనిపోయిన వారిని అక్కడికే తీసుకెళుతున్నాం’   అని సాయి తేజ అన్నారు. 

రెండు వేలకు పైగా కాల్స్..
మేం పోయిన ఏడాది నుంచి ఫ్రీగా ఫుడ్ అందిస్తున్నాం. రోడ్ సైడ్ ఉన్నవారికి, బస్తీల్లో ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేసేవాళ్లం. అయితే సెకండ్ వేవ్​లో కేసులు ఎక్కువగా వస్తుండటంతో హోం క్వారంటైన్ మీల్ స్టార్ట్ చేశాం. మేం ఊహించినదాని కంటే ఎక్కువగా నీడ్ ఉందని మొదలు పెట్టిన రెండు మూడ్రోజుల్లోనే మాకు తెలిసింది. ప్రతి రోజు 2 వేలకు పైగా కాల్స్​ను మా టీమ్  రిసీవ్ చేసుకుంటోంది. డైలీ 200 మందికి హోం డెలివరీ చేస్తున్నాం. మొన్నటి వరకు సిటీవ్యాప్తంగా చేశాం. కానీ సెకండ్​వేవ్​ కారణంగా టీమ్​లోని వారు కూడా ఫుడ్ డెలివరీ చేయడానికి భయపడుతున్నారు. ప్రస్తుతం మణికొండ చుట్టుపక్కల 7 కిలోమీటర్ల లోపు ఫుడ్ అందిస్తున్నాం. 
- రాజు మడిపడిగే, ఫౌండర్, వీబీజీ ఫౌండేషన్ 

ఆక్సిజన్ ​సిలిండర్లు సప్లయ్ చేస్తున్నాం.. 
గురుద్వార తరఫున ఫ్రీ ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తున్నాం. మా దగ్గర 40 వరకు ఉన్న పది లీటర్ల ఆక్సిజన్ సిలిండర్లన్నీ ఇప్పుడు పేషెంట్ల దగ్గరే ఉన్నాయి. ఇందుకోసం రూ.2 వేలు డిపాజిట్, ఆధార్ కార్డ్ జిరాక్స్ తీసుకుంటున్నాం. పేషెంట్ అవసరం తీరాక వారి రూ.2 వేలు తిరిగి ఇచ్చేస్తాం. పోయిన ఏడాది 20 సిలిండర్లతో మొదలుపెట్టాం. అవసరాన్ని బట్టి పెంచాం. కరోనా వల్ల మేం డోర్ డెలివరీ చేయడంలేదు. అవసరం ఉన్నవారు మా దగ్గరికి వచ్చి తీసుకుంటున్నారు. 
- హర్ ప్రీత్ సింగ్, గురుద్వార, సికింద్రాబాద్ 
 

సోషల్ మీడియాలో పోస్ట్ చూసి..
కరోనా కేసులు పెరుగుతుండటంతో నా వంతుగా ఏదైనా సాయం చేయాలనుకున్నా. అందుకే ఓ ట్విట్టర్​లో పోస్ట్ చేశా. అప్పటి నుంచి నాకు కంటిన్యూస్ గా కాల్స్ వస్తున్నాయి. బెడ్స్ రిక్వైర్​మెంట్, ప్లాస్మా, మెడిసన్ ఇలా అన్ని రకాల హెల్ప్ కోసం పేషెంట్లు నన్ను రీచ్ అవుతున్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ ప్రాంతంలో మెడిసిన్స్ డోర్ డెలివరీ చేస్తున్నా. 
- రికిత్ షాహి, లా స్టూడెంట్ 

కూకట్​పల్లిలో కరోనా పేషెంట్లకు ఫ్రీ ఫుడ్ డెలివరీ
జై గురుదేవ్ యోగా విజ్ఞాన కేంద్రం నిర్వాహకుడు జగన్ 

కరోనా బారిన పడి వంట చేసుకోలేని స్థితిలో ఉన్న కుటుంబాలకు ఫ్రీ ఫుడ్ డెలివరీ చేయనున్నట్లు కూకట్ పల్లిలోని జై గురుదేవ్ యోగా విజ్ఞాన కేంద్రం  నిర్వాహకుడు జగన్ గురూజీ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కూకట్​పల్లి చుట్టూ 10 కి.మీ పరిధిలో ఉండే కరోనా పేషెంట్లు ఎవరికైనా ఉచితంగా లంచ్ ను వారి ఇంటి వద్దకే డెలివరీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. పేషెంట్లు  9441887766 నంబర్ కు ఒకరోజు ముందుగానే కాల్ చేసి ఎంతమందికి ఫుడ్ కావాలో చెప్పాలన్నారు.