ఏవి ఉచితాలు..ఏవి అనుచితాలు.?

ఏవి  ఉచితాలు..ఏవి అనుచితాలు.?

ఉచితాలు అనేవి తరచూ చర్చనీయాంశాలు అవుతున్నాయి.   స్కాలర్ షిప్​లు కూడా ఉచితాలు లాంటివే. యూనివర్సిటీ విద్యార్థులకి గతంలో స్కాలర్​షిప్​లు ప్రభుత్వాలు ఇస్తుండేవి. కులాలతో సంబంధం లేకుండా వీటిని ప్రభుత్వాలు ఇస్తుండేవి. ఇప్పుడు కూడా ఇస్తున్నాయేమో నాకు తెలియదు. ఆ స్కాలర్​ షిప్​ల వల్ల చాలామంది యూనివర్సిటీ విద్యను అభ్యసించారు. అలా చదువుకున్న విద్యార్థులు చాలామంది జీవితాల్లో బాగా స్థిరపడ్డారు. న్యాయమూర్తులయ్యారు. సివిల్​ సర్వీసుల్లో సెలెక్ట్​ అయ్యారు. ఈ ఉచితాలు అనేవి చర్చనీయాంశాలే.  ఈ ఉచితాలు అనేక రూపాల్లో ఉన్నాయి. అనేక పేర్లతో ఉన్నాయి. అవి ప్రభుత్వ విధానాలుగా మారిపోయాయి. అందులో రాజకీయ వ్యూహాలు కూడా ఉన్నాయి. ఈ  ఉచితాల అంశం సుప్రీంకోర్టు ముందుకు, హైకోర్టు ముందుకు తరచుగా వస్తున్నాయి.

గత ఫిబ్రవరిలో పట్టణ నిరాశ్రయులకు షెల్టర్​పథకం అమలుకి సంబంధించిన రిట్​ పిటిషన్​ విచారిస్తున్న అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ గవాయ్​ నిరాశ్రయులైన ప్రజలను ‘పరాన్న జీవులు’గా అభివర్ణించారు.  ప్రజలకు ఆహార ధాన్యాలు ఇచ్చి వాళ్లను పరాన్న జీవులుగా మార్చడం లేదా? అని జస్టిస్ గవాయ్​ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలమీద దేశవ్యాప్త చర్చ జరిగింది. 300 మంది యాక్టివిస్టులు, న్యాయవాదులు, జర్నలిస్టులు కలిసి ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఒక బహిరంగ లేఖను రాశారు. 

ద్రవ్యలోటు

ఈ ఉచితాల వల్ల ఏర్పడే ద్రవ్యలోటు గురించి రిజర్వు బ్యాంక్​ హెచ్చరికను చేసింది. ఎన్నికల్లో లబ్ధికోసం పార్టీ అన్ని రాజకీయ పక్షాలు ఉచితాలను అనుచితంగా ప్రకటించి ఇబ్బందులు పాలవుతున్నాయి. సంక్షేమ రాజకీయాలు చట్టబద్ధమైనవే. అయితే సంక్షేమ చర్యలు, అనారోగ్యకరమైన ఉచితాల మధ్య సన్నని రేఖ ఉంది.   40 సంవత్సరాలు ప్రభుత్వాలకు సేవలందించిన ఓ రిటైర్డు ఇంజినీర్​ ఎ. నరేందర్​ రెడ్డి తాను పదవీ విరమణ చేసిన తరువాత రావల్సిన ప్రయోజనాలు తనకు రాలేదని ఆయన తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్​ దాఖలు చేశారు. ఆ పిటిషన్​ విచారిస్తూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ నగేష్​ భీమపాక ఇలా అన్నారు.  ‘ఆర్థిక విషయాలు, సంక్షేమ పథకాలు  శాసనసభ విధానం కిందకు వస్తాయని అవి న్యాయసమీక్ష వెలుపలి  అంశాలు అని అంటూనే అటువంటి దీర్ఘకాలిక ప్రభావాన్ని ప్రభుత్వం పున:పరిశీలించాల్సిన సమయం ఆసన్నమైందని కోర్టు పేర్కొంది. ఉచిత విద్యుత్, నీరు, ప్రజారవాణా, వ్యవసాయ రుణమాఫీ వంటి వాటికి నిధులు కేటాయిస్తూ దీర్ఘకాలంగా సేవలను అందించిన ఉద్యోగులకు బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ ప్రశ్నలో న్యాయబద్ధత ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన అవగాహన లేకుండా ప్రభుత్వ ఉచితాల పంపిణీ పెరుగుతుండటంపై హైకోర్టు తీవ్ర 
ఆందోళనను వ్యక్తపరిచింది. 

రాష్ట్ర అతిథి సౌకర్యం

ఈ పెరుగుతున్న ఉచితాల మీద దేశవాప్తంగా చర్చ జరుగుతోంది.  కానీ, ఎలాంటి న్యాయమైన ముగింపు లభించడం లేదు. ఉచితాలు అవసరమే అని ప్రభుత్వ ఖజానాని ఖాళీచేసేవిధంగా ఉండకూడదని చాలామంది భావన. అయితే, ఒక్క విషయాన్ని ఉచితాలను విమర్శించే వక్తులు గమనించాలి. కనిపించే ఉచితాలు కొన్ని ఉంటాయి.  కనిపించని ఉచితాలు,  చర్చకు రాని ఉచితాలు మరెన్నో ఉంటాయి. అలాంటి  ఉచితాలు లాంటి ఓ  విషయం ఈ మధ్య నా దృష్టికి వచ్చింది.  ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు జనరల్​ ఏపీ ప్రభుత్వానికి గత సంవత్సరం మే  నెలలో ఓ లేఖని రాశారు. 

ఆ లేఖ సారాంశం ఏమిటంటే ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలతో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంతో రాష్ట్ర అతిథి మర్యాదలను,  సౌకర్యాలను ప్రధాన న్యాయమూర్తులకు, హైకోర్టు న్యాయమూర్తులకు పరస్పర (రెసిప్రోకల్) ప్రాతిపదికన విస్తరించడానికి చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించిన తరువాత ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్​ను సందర్శిస్తున్నప్పుడు ‘రాష్ట్ర అతిథి’ సౌకర్యాన్ని విస్తరించాలని నిర్ణయించింది. ఈ జీవోని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం జీవో ఎంఎస్​ 1 తేదీ 1–1–2025  రోజున జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం 2024న ఇలాంటి జీవో ఇచ్చిందన్న విషయం కూడా ఈ జీవో ద్వారా గోచరమవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే న్యాయమూర్తుల అధికారిక సందర్శనలకే కాదు. అనధికార సందర్శన సమయంలో కూడా వాళ్లను రాష్ట్ర అతిథులుగా పరిగణిస్తారు. అనధికార సందర్శన సమయంలో  ఈ సౌకర్యాలు ఇవ్వడం ఏ విధంగా సమంజసమో ఎవరికీ అర్థంకాని విషయం. ఇది ప్రభుత్వం న్యాయమూర్తులకు ఇస్తున్న ఉచితాలుగా భావించే అవకాశం ఉంది కదా. 

పదవీ విరమణ చేసినవారికి ఉచితాలు వద్దు

మరో ముఖ్య విషయం ఆంధ్రప్రదేశ్​ న్యాయమూర్తులు ఎక్కువగా తెలంగాణని సందర్శించే అవకాశం ఉంది. దీనివల్ల తెలంగాణ ప్రభుత్వం మీద అధిక భారం పడే అవకాశం ఉంది.  నిజంగానే అవసరమని ప్రభుత్వాలు భావిస్తే ఏ రాష్ట్ర న్యాయమూర్తులకు ఆ రాష్ట్రమే ఖర్చులని భరిస్తే మంచిది. అనధికార సందర్శన సమయంలో స్టేట్​గెస్ట్​ సౌకర్యాలు ఇవ్వడం ఎంతమాత్రం సమంజసంగా అనిపించడం లేదు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులకి మరీ ముఖ్యంగా ప్రధాన న్యాయమూర్తులకి ఈ సౌకర్యాలు ఇవ్వడం ప్రజల డబ్బులను అనవసర ఖర్చులకు వాడుతున్నట్టుగా అనిపిస్తున్నది. ప్రజలకు ఇచ్చే ఉచితాలు దిగువ శ్రేణి ప్రజలను కొంతపైకి తీసుకుని రావడానికి ఉపయోగపడాలి. అంతేకాని పైనున్న వ్యక్తులని పైకి తీసుకునిపోవడానికి కాదు. ఉచితాల వల్ల ప్రజల జీవితంలో మెరుగైన అవకాశాలు ఏర్పడాలి. అది అవసరం ఉన్న ప్రజలకే ఆ ఉచితాలు అందాలి. ఏమైనా ఉచితాల గురించి మాట్లాడుతున్న వ్యక్తులు తమకు లభిస్తున్న ఉచితాల గురించి ఆలోచించాలి.

అనధికార సందర్శన 

మనదేశంలో ప్రభుత్వాలు పెద్ద లిటిగెంట్.  చాలా కేసుల్లో (స్టేట్) రాజ్యం అనేది వాదిగానో, ప్రతివాదిగానో ఉంటుంది. ఇలాంటి రాజ్యం నుంచి ‘అనధికార సందర్శన’ సమయంలో ‘స్టేట్​ గెస్ట్’ సౌకర్యాలు పొందడం  ఎంతవరకు సమంజసం?  ఇది న్యాయమూర్తులు ఆలోచించుకోవాల్సిన అంశం. ఇలాంటి స్టేట్​గెస్ట్​ సౌకర్యాలు గతంలో లేవు. రెండు తెలుగు రాష్ట్రాలలో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత వచ్చిన సౌకర్యాలు. సౌకర్యాల వెనక ప్రభుత్వాల ఉద్దేశాలు ఏమిటో అర్థంకాని విషయం.  ఉచితాల గురించి తరచూ మాట్లాడుతున్న కోర్టులు వీటి గురించి కూడా మాట్లాడితే బాగుంటుందేమో. 

- డా. మంగారి రాజేందర్, 
జిల్లా జడ్జి (రిటైర్డ్)