
- బిల్లులు మాత్రం యథావిధిగా వసూలు
- పంపిణీలోనూ తగ్గుతున్న సమయాలు
- స్కీమ్ పై వ్యక్తమవుతున్న అనుమానాలు
హైదరాబాద్, వెలుగు : గ్రేటర్‌సిటీలో ఫ్రీ వాటర్ స్కీమ్ అమలు సక్కగ లేదు. వాటర్ బోర్డు పూర్తిస్థాయిలో పంపిణీ చేయడంలేదు. నల్లా కనెక్షన్ కలిగిన ప్రతి ఇంటికి నెలకు 20 వేల లీటర్ల నీటిని ఫ్రీగా ఇస్తున్నట్టు మెట్రోవాటర్‌బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. కోర్‌సిటీలో నెలలో15 రోజులు, శివారు ప్రాంతాలైతే వారంలో మూడు నుంచి నాలుగు రోజులకోసారి, ఔటర్వెలుపలి గ్రామాలు, మున్సిపాలిటీలు, టౌన్షిప్లలోనూ ఇదే తరహాలో నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది.
కానీ బిల్లులు మాత్రం నెలకు లెక్కగట్టి టంచన్ గా అధికారులు వసూలు చేస్తున్నారు. ఫ్రీగా ఇచ్చే వాటర్ కు అధికారులు వసూలు చేసే నీటి బిల్లుల వసూలుకు కూడా పొంతన లేదు. దీంతో ఫ్రీ వాటర్ స్కీమ్ సరిగా అమలైతుందా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఎక్కువ నీరు సరఫరా అయితే..
వాటర్ బోర్డు పరిధిలో 25 డివిజన్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ప్రతి డివిజన్లో 10 వరకు సర్వీస్రిజర్వాయర్లను నిర్మించారు. వీటి ద్వారా స్థానికంగా పైప్‌లైన్‌ద్వారా నీటిని అందిస్తున్నారు. గ్రేటర్‌సిటీ, ఔటర్వెలుపలి గ్రామాలు, మున్సిపాలిటీల్లో కలిపి డొమెస్టిక్, కమర్షియల్వి 13,84లక్షల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు 593 ఎంజీడీలు అందిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఫ్రీ వాటర్ స్కీమ్ కింద కరోనా సమయంలో ఏడాది పాటు బిల్లులు వసూలు చేయలేదు. అనంతరం ఏడాది తర్వాత నుంచి సరఫరా చేసిన ప్రతి నీటి బొట్టుకు లెక్కలు కట్టి బిల్లులు వసూలు చేస్తున్నారు.
దీనిపై ప్రజలు అధికారులను అడిగితే.. ఉచితం లేదని, పరిమితంగా అంటే ఒక్కో వినియోగదారుడికి నెలకు 20వేల లీటర్ల మేరకు అందిస్తామని చెబుతున్నారు. అయితే.. 20వేల లీటర్లను మినహాయించి మిగిలిన దానికి బిల్లు వసూలు చేస్తున్నట్టు తెలిపారు. బోర్డు పరిధిలో కనెక్షన్లలోసగం నల్లాలకు మీటర్లు లేకపోవడంతో ఏ పద్ధతిన బిల్లులు వసూలు చేస్తున్నారో అధికారులు చెప్పడంలేదు. ఇప్పటికీ 50 శాతం కనెక్షన్ల నుంచి కనీస చార్జీలనే వసూలు చేస్తున్నారు.
మీటర్ఉన్నవారిని బట్టి, లేవవారి వద్ద అంతే మొత్తంలో వసూలు చేస్తున్నట్టు చెప్పారు. అధికారుల తీరుతో తక్కువ, ఎక్కువ నీటి వాడకం చేసిన వారినుంచి సమానంగానే నీటి బిల్లులు వసూలు చేస్తున్నారు. ఇకపోతే.. సిటీలోని చాలా ఏరియాల్లో తాగునీటి సరఫరాలో కోతలు ఉంటున్నాయి.
నీటి బిల్లుల కంటే..
అధికారిక లెక్కలను చూస్తే.. రోజుకు 590 ఎంజీడీ ( మిలియన్‌గ్యాలన్ల లీటర్లు ఫర్ డే) నీటిని పంపిణీ చేస్తున్నారు. ఇందుకు మంజీరా (45), సింగూరు(75), ఉస్మాన్‌సాగర్(18), హిమాయత్ సాగర్(10), కృష్ణ ప్రాజెక్ట్ మూడు దశల ద్వారా (270), గోదావరి(162) కలిపి మొత్తం 593 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ, ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో తగినంతగా సరఫరా కావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రిజర్వాయర్లలో నీరు ఉందని చెప్తున్న అధికారులు, పంపిణీకి వచ్చే సరికి పొదుపు పాటిస్తున్నారు. దీంతో లబ్ధిదారులు వాడిన నీటి వాడకం కంటే బిల్లులు ఎక్కువ చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు.
సరఫరా సమయాలను తగ్గిస్తుండగా..
సిటీలోని చాలా ప్రాంతాల్లో నీటి పంపిణీ లెక్కల్లో అధికారులు తేడాలు చూపిస్తున్నారు. ముఖ్యంగా సంపన్నవర్గాలు నివసించే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శ్రీనగర్ కాలనీ, మాదాపూర్తదితర ప్రాంతాల్లో రెండు నుంచి రెండున్న గంటలు, కొన్ని చోట్ల మూడు గంటల పాటు నీటిని సరఫరా చేస్తున్నట్టు సమాచారం. అదే మురికివాడలు, మధ్యతరగతి ప్రజలు ఉండే ఏరియాల్లో గంటన్నర నుంచి రెండు గంటల లోపే నీటి పంపిణీ జరుగుతుంది. దీనికి కూడా అధికారులు పలు కారణాలు చెబుతున్నారు. సర్వీస్ రిజర్వాయర్లకు కేటాయించిన స్థాయిలో నీరు అందకపోతే ఉన్న నీటితోనే సరఫరా చేస్తున్నామని, కొన్నిసార్లు సమయాన్ని కూడా కుదించాల్సి వస్తుందని సికింద్రాబాద్బోయిగూడ కు చెందిన ఓ అధికారి తెలిపారు.
నీటి సరఫరా చేసే సమయాలను కుదించడం ద్వారా ఉచిత సరఫరాపైనా ప్రభావం పడుతుంది. నెలకు 40వేల లీటర్లు వినియోగించే వారికి 30 వేల లీటర్ల మేరకు సరఫరా అవుతుంది. కానీ అధికారులు మాత్రం బిల్లులు సమానంగానే వసూలు చేస్తున్నారు. ఒక విధంగా సంపన్నవర్గాలపై బిల్లుల భారం కంటే సాధారణ ప్రజలపైనే ఎక్కువ పడుతుందనేది స్పష్టం అవుతుంది. ఇక మరో సమస్య ఉచిత నీటిని పొందాలంటే ప్రతి వినియోగదారుడు తమ ఆధార్‌నంబర్ ను లింక్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికీ 50 శాతం కూడా ఆధార్ లింక్ పూర్తి కాలేదని ఓ అధికారి పేర్కొన్నారు. దీంతో అలాంటి వారంతా ఉచిత నీటిని పొందలేకపోతున్నారు.