హిమాచల్​లో గడ్డకడుతున్న లేక్​లు

హిమాచల్​లో గడ్డకడుతున్న లేక్​లు
  •  లాహుల్ స్పితిలో -15 డిగ్రీలకు పడిపోయిన టెంపరేచర్లు 
  • ఆయా ప్రాంతాలకు పెరుగుతున్న టూరిస్టుల తాకిడి

షిమ్లా: హిమాచల్ ప్రదేశ్​లోని అనేక ప్రాంతాల్లో టెంపరేచర్లు భారీగా పడిపోయాయి. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో చాలా ప్రాంతాల్లో నీళ్లు గడ్డకడుతున్నాయి. సముద్రమట్టానికి 12 వేల అడుగుల ఎత్తులో ఉన్న లాహుల్ స్పితి జిల్లాలోని సిస్సూ లేక్ పూర్తిగా గడ్డకట్టుకుపోయింది. ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు మైనస్ 15 డిగ్రీ సెల్సియస్ లకు పడిపోయాయి. ఎత్తయిన ప్రాంతాల్లో చాలా చోట్ల టెంపరేచర్లు ఫ్రీజింగ్ పాయింట్ కంటే 12 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయని.. దీంతో నదులు, జలాశయాలు గడ్డకడుతున్నాయని అధికారులు ఆదివారం వెల్లడించారు. 

లాహుల్ స్పితిలో ఎటుచూసినా మంచు పేరుకుపోయి వింటర్ సీజన్ కనువిందుగా మారిపోయింది. దీంతో జిల్లాలోని అనేక స్పాట్ లకు టూరిస్టులు భారీగా తరలివస్తున్నారు. వారం రోజులుగా కుర్ఫి సహా పలు ప్రాంతాల్లో టెంపరేచర్లు ఫ్రీజింగ్ పాయింట్లకు పడిపోయి మంచు భారీగా పేరుకుపోవడంతో ఐస్ స్కేటింగ్ వంటి ఆటలు ఆడేందుకు టూరిస్టులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో, మంచులో ఆటలాడుతూ సరదాగా గడుపుతున్నారు. కాగా, హిమాచల్ ప్రదేశ్ లో ఈ సీజన్​లో ప్రధానంగా జనవరి మొదటి ఎనిమిది రోజుల్లో 100 శాతం వర్షపాత లోటు నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.