
కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్లో జిల్లాలో 26,834 గృహలక్ష్మి దరఖాస్తులు వచ్చాయని, వాటిని ఈనెల 20లోపు కులధృవీకరణ, స్వంతస్థలం, ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ కార్డు ఆధారంగా పరిశీలించాలని కలెక్టర్ డాక్టర్ బి.గోపి అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో గృహలక్ష్మి పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గృహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు.
ఈ పథకం సొంతభూమి కలిగిన పేదవారికి రూ.3లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని తెలిపారు. మూడు విడతల్లో ఆర్థిక సాయం ప్రభుత్వం అందించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లక్ష్మికిరణ్, ప్రఫుల్ దేశాయ్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, ఆర్డీఓలు కె. మహేశ్, రాజు పాల్గొన్నారు.