
దానికి రెక్కలున్నా ఎగరలేదు. దీనికి కాళ్లున్నా నడవలేదు. బహుశా అదే కాబోలు.. ఆ రెండింటి మధ్య దోస్తానాను నాటింది. విడదియ్యలేని బంధాన్ని ముడేసింది. హెర్మన్.. ఆ పావురానికి రెక్కలున్నా ఎగరలేక అల్లాడుతుంటే న్యూయార్క్‌లోని మియా ఫౌండేషనోళ్లు తీసుకొచ్చి సాదుతున్నారు. ఈ మధ్యే కాళ్లున్నా వెన్ను సరిగా లేక నడవలేని రెండు నెలల వయసున్న లుండీ అనే చువావానూ తీసుకొచ్చారు. రెండింటినీ ఒకే దగ్గర పెట్టారు. కొన్ని రోజులయ్యాక అవి రెండూ మంచి దోస్తులైనయ్. ఆ దోస్తానా కాస్తా పెరిగి బంధం మరింత స్ట్రాంగ్ అయింది. నడవలేని లుండీని ఓ అమ్మలా హెర్మన్ జాగ్రత్తగా చూసుకుంటోంది. లుండీకి ఓ వీల్‌చైర్ తెప్పించి నడిపించేందుకు చూస్తున్నారట ఫౌండేషన్ వాళ్లు.