
హైదరాబాద్, వెలుగు: బరోడా కిసాన్ పక్వాడా పేరుతో 15 రోజులపాటు రైతుల అవసరాల కోసం ప్రత్యేక సేవలు అందిస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) జనరల్ మేనేజర్ (హైదరాబాద్ జోన్) మన్ మోహన్ గుప్తా చెప్పారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లలోని రైతులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ట్రాక్టర్, కార్లు, టూవీలర్లు ....ఇలా ఏదైనా రైతులకు అవసరమైన రుణాలను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. రైతుల కోసం ఈ నెల 31దాకా15 రోజులలో దేశవ్యాప్తంగా చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. అగ్రి లోన్ల కోసం సెంటర్ ఫర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ ప్రాసెసింగ్ (సీఏఎంపీ)లను 16 జోన్లలోనూ బ్యాంకు ఏర్పాటు చేసిందని చెప్పారు. అగ్రి మార్కెటింగ్‌లో చొరవతోపాటు, గతంలో లేని అగ్రికల్చర్ లోన్లను తేవడానికి ఈ ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అగ్రికల్చర్ లోన్లలో గోల్డ్ లోన్ సెగ్మెంట్ కింద రూ. 650 కోట్లు, ఎస్‌హెచ్‌జీ సెగ్మెంట్ కింద రూ. 54.96 కోట్లను 2021–22 లో తాము అప్పులుగా ఇచ్చినట్లు వెల్లడించారు. రైతులకు సరయిన టైములో అప్పులు దొరికేలా బరోడా కిసాన్ పక్వాడాలో తమ జోన్‌లోని బ్రాంచీలన్నీ చురుగ్గా పాల్గొంటున్నాయని, గత మూడేళ్లుగా బ్యాంకు ఈ బరోడా కిసాన్ పక్వాడా నిర్వహిస్తోందని డిప్యూటీ జోనల్ మేనేజర్ వినోద్ బాబు వివరించారు. తెలంగాణలో బీవోబీకి 156 బ్రాంచీలున్నాయని వినోద్ బాబు చెప్పారు.