ఐటీ ఉద్యోగాల కన్నా ..కోర్టులో వాదనలే బెటర్!.. లాకోర్సుల వైపు క్యూకడుతున్న టెకీలు

ఐటీ ఉద్యోగాల కన్నా ..కోర్టులో వాదనలే బెటర్!.. లాకోర్సుల వైపు క్యూకడుతున్న టెకీలు
  • కోడింగ్ వద్దు.. కోర్టులే ముద్దు
  • లా కోర్సుల వైపు క్యూ కడుతున్న టెకీలు
  • క్వాలిఫై అయిన ప్రతి నలుగురిలో ఒకరు ఇంజినీరే!
  • మూడేండ్ల ఎల్‌‌ఎల్‌‌బీకి అర్హత సాధించిన వారిలో 7,252 మంది బీటెక్ గ్రాడ్యుయేట్లే
  • తగ్గుతున్న సాఫ్ట్‌‌వేర్ క్రేజ్.. కార్పొరేట్ చట్టాలపైనే టెకీల కన్ను

హైదరాబాద్, వెలుగు: ఒకప్పుడు బీటెక్ అంటే సాఫ్ట్‌‌వేర్ కొలువులు.. ఐటీ కంపెనీల్లో లక్షల జీతాలు. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. కంప్యూటర్ ముందు కూర్చుని కోడింగ్ రాయడం కంటే, కోర్టుల్లో వాదనలు వినిపించేందుకే ఇంజినీర్లు ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా విడుదలైన టీజీ లాసెట్ ఫలితాలను చూస్తే ఇదే విషయం స్పష్టమవుతోంది.  

టెక్కీల చూపు చట్టాల వైపు..

సాధారణంగా బీఏ, బీకాం, బీఎస్సీ గ్రాడ్యుయేట్లే ‘లా’  చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ ఈసారి 3 ఏళ్ల ఎల్‌‌ఎల్‌‌బీ ఎంట్రెన్స్​ ఫలితాల్లో ఇంజినీరింగ్ అభ్యర్థులు బీఏ, బీఎస్సీ వారిని వెనక్కి నెట్టేశారు. మొత్తం 29,327 మంది క్వాలిఫై కాగా, అందులో ఏకంగా 7,252 మంది బీటెక్/బీఈ గ్రాడ్యుయేట్లే ఉన్నారు. 

అంటే న్యాయ విద్య వైపు అడుగులు వేస్తున్న ప్రతి నలుగురిలో ఒకరు ఇంజినీరింగ్ చదివిన వారే ఉన్నారు. మొత్తం 11,179 మంది టెక్కీలు దరఖాస్తు చేసుకోగా 8,746 మంది పరీక్షకు హాజరయ్యారు. బీకాం పూర్తి చేసినవారు 11,923 మంది పరీక్ష రాయగా 8,399 మంది క్వాలిఫై అయ్యారు. బీఎస్సీ చదివినవారు 8,620 మంది రాస్తే 6,817 మంది, బీఏ చదివినవారు 6,391 మందికి గానూ 4,969 మంది అర్హత సాధించారు. 

డాక్టర్లు కూడా... 

ఇంజినీర్లే కాదు వైద్య వృత్తిలో ఉన్నవారు కూడా న్యాయశాస్త్రంపై మక్కువ చూపుతున్నారు. 93 మంది ఎంబీబీఎస్ డాక్టర్లు, 56 మంది బీడీఎస్ పూర్తిచేసినవారు, 13 మంది వెటర్నరీ డాక్టర్లు, 23 మంది హోమియోపతి వైద్యులు లాసెట్‌‌లో అర్హత సాధించారు. వీరితో పాటు 500 మంది బీ ఫార్మసీ, 44 మంది ఫార్మ్–డి చేసినవారు కూడా క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్, ఆర్కిటెక్చర్, ఫ్యాషన్ డిజైనింగ్ వంటి విభిన్న నేపథ్యాలు ఉన్నవారు సైతం లా కోర్సులు చదివేందుకు ముందుకొచ్చారు. 

ఇందుకు సాఫ్ట్‌‌వేర్ రంగంలో పెరుగుతున్న అనిశ్చితి, లేఆఫ్స్ ఒక కారణమైతే.. కార్పొరేట్ రంగంలో ‘లీగల్ అడ్వైజర్’లకు ఉన్న డిమాండ్ మరో కారణమని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా పేటెంట్ రైట్స్, సైబర్ లా, ఐపీఆర్ (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) వంటి విభాగాల్లో టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న లాయర్లకు కంపెనీలు భారీ ప్యాకేజీలు ఇస్తున్నాయి. అందుకే టెక్కీలు తమ కెరీర్ సెటిల్‌‌మెంట్ కోసం ‘లా’ పట్టాను ఆయుధంగా మార్చుకోవాలని భావిస్తున్నారు.