సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగుస్తుంది. అయితే కొత్త కారు కొనాలనుకునే వారికి మార్చి నెలలో ఒక రకమైన పరిస్థితులు ఉంటే, ఏప్రిల్ నుండి మరో రకమైన పరిస్థితులు ఎదురవుతాయి. ఎందుకంటే మార్చి నెలలో కంపెనీలు టార్గెట్లు పూర్తి చేయడానికి, పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి భారీగా క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ఇస్తుంటాయి. కానీ ఏప్రిల్ మొదలయ్యాక కొత్త టార్గెట్లు మొదలవుతాయి కాబట్టి, ఈ ఆఫర్లు అంత ఎక్కువకాలం ఉండవు.
కొత్త ఆర్థిక సంవత్సరం మొదట్లో చాలా కంపెనీలు కార్ల ధరలను సవరిస్తూ పెంచుతుంటాయి. ఎందుకంటే ముడిసరుకుల ఖర్చులు పెరగడం లేదా కొత్త నిబంధనల వల్ల కార్ల తయారీకి ఖర్చు ఎక్కువవుతుంది. దీనివల్ల ఏప్రిల్ తరువాత కారు కొంటే మీరు కాస్త ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావచ్చు.
ఏప్రిల్ తర్వాత కొనే కార్లకు కొత్త తయారీ తేదీతో 2026 మోడల్ అని ఉంటుంది. మార్చిలో కొనే కార్లు పాత ఏడాది కిందకి వచ్చే అవకాశం ఉంటుంది. దింతో కారును భవిష్యత్తులో అమ్మేటప్పుడు రిసేల్ వాల్యూ కంటే కొత్త మోడల్ కార్లకు కొంచెం ఎక్కువ ధర పలికే అవకాశం ఉంటుంది.
మార్చిలో స్టాక్ క్లియర్ చేసే పనిలో ఉంటారు కాబట్టి, మీకు నచ్చిన కలర్ లేదా మోడల్ దొరకకపోవచ్చు. కానీ ఏప్రిల్ నుండి కొత్త స్టాక్ రావడం వల్ల మీకు నచ్చిన వేరియంట్‌ను సెలెక్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని కంపెనీలు ఏప్రిల్‌లో కొత్త మోడళ్లను లేదా కొత్త ఫీచర్లను కూడా పరిచయం చేస్తాయి.
కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవగానే బ్యాంకులు వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ప్రీమియం ధరలను మార్చవచ్చు. ఇది మీరు నెలకు కట్టే ఈఎంఐ (EMI) పై ప్రభావం చూపుతుంది.
మీకు డబ్బు ఆదా అవ్వాలి, భారీ డిస్కౌంట్లు ఉండాలి అనుకుంటే మార్చి నెలాలోపు కొత్త కార్ కొనడం బెస్ట్. కానీ మీకు లేటెస్ట్ మోడల్, కొత్త తయారీ తేదీ, ఎక్కువ కలర్ ఆప్షన్లు కావాలనుకుంటే ఏప్రిల్ వరకు ఆగడం మంచిది.
